'మన శాశ్వత సభ్యత్వానికి గండికొడుతున్నారు'
లక్నో: కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే అసహనం అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటుందని, దీని వల్ల దేశ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ లక్నోలో అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అనేక దేశాలు భారత్కు శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్నా, కాంగ్రెస్ రాజకీయ విధానాలు ఆ అవకాశాలకు గండి కొట్టేవిలా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో కంటే ఇప్పుడు దేశంలో అసహనం ఎక్కువగా ఉందా అని షానవాజ్ ప్రశ్నించారు. అసహనం అంశాన్ని పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని అసహన ఆరోపణలతో భంగపరచలేరని షానవాజ్ స్పష్టం చేశారు.