కాశ్మీర్‌లో అరుణ్ జైట్లీ నిర్బంధం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లో మత ఘర్షణలు జరిగిన కిష్ట్‌వార్ జిల్లాను సందర్శించేందుకు ఆదివారం జమ్మూ చేరుకున్న బీజేపీ నేత అరుణ్ జైట్లీని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వెనక్కు పంపింది. జమ్మూ విమానాశ్రయంలోనే పోలీసులు ఆయనను నిర్బంధించారు. తర్వాత కొద్దిసేపటికి ఆయనను వెనక్కు పంపారు. జైట్లీతో పాటు వచ్చిన పంజాబ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ అవినాశ్‌రాయ్ ఖన్నాను, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జుగల్ కిశోర్‌ను కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని, ఆ తర్వాత వెనక్కు పంపారు. మత ఘర్షణలతో ఉద్రిక్తంగా మారిన కిష్ట్‌వార్ వెళ్లేందుకు రాజకీయ నాయకులను అనుమతించబోమని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు కిష్ట్‌వార్‌లో ఆదివారం మరో మృతదేహం లభ్యమైంది. అయితే, మృతుడు హింసాకాండలోనే మరణించాడా, మరేదైనా కారణం వల్ల మరణించాడా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ సందర్భంగా వదంతులను నమ్మవద్దని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిష్ట్‌వార్‌లో శుక్రవారం చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందిన దరిమిలా, కాశ్మీర్ లోయలోని చుట్టుపక్కల ప్రాంతాలకూ ఉద్రిక్తతలు విస్తరించాయి. దీంతో శనివారం జమ్మూ, రాజౌరీ జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం, ఆదివారం ఉధామ్‌పూర్, సాంబా, కఠువా జిల్లాలకు, దోడా జిల్లాలోని భదేర్వా పట్టణానికి కర్ఫ్యూ విస్తరించింది. అయితే, జమ్మూ విమానాశ్రయంలోనే జైట్లీని నిర్బంధించి, అక్కడి నుంచి ఆయనను వెనక్కు పంపడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
మత ఘర్షణలు చెలరేగిన ప్రాంతంలో వాస్తవాలను తెలుసుకునేందుకు వచ్చిన జైట్లీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడింది. కిష్ట్‌వార్ హింసాకాండకు సంబంధించిన నిజాలు బయటకు రాకుండా చూసేందుకే ఒమర్ సర్కారు జైట్లీ సహా తమ పార్టీ నేతలను నిర్బంధించిందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. కాగా, ఘర్షణలు జరిగిన కిష్ట్‌వార్ జిల్లాకు వెళ్లాలనుకున్న తనను శ్రీనగర్‌లోని తన ఇంటిని దాటి బయటకు రాకుండా నిర్బంధించారని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. మరోవైపు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ఆ రాజకీయ నాయకులందరూ తిరిగి 2008 నాటి (అమర్‌నాథ్ భూములపై ఘర్షణ) పరిస్థితులను పునరావృతం చేయాలని ప్రయత్నిస్తున్నారని, తద్వారా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభలో విపక్షనేత సుష్మా స్వరాజ్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని ఆ పార్టీ నేతలకు సూచించాలని కోరానని ఒమర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరో మూడు జిల్లాలకు కర్ఫ్యూ విధించామని, ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతాల్లో సైన్యాన్ని రంగంలోకి దించామని జమ్మూ డివిజినల్ కమిషనర్ శాంత్‌మను చెప్పారు.
మంత్రి పాత్రపై దర్యాప్తు జరపాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ
కిష్ట్‌వార్ మత ఘర్షణలపై జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నరేశ్ గుప్తా డిమాండ్ చేశారు. కిష్ట్‌వార్‌లో మైనారిటీలపై జరిగిన దాడి వెనుక రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి సజ్జద్ కిచ్లూ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారని, కిచ్లూ కిష్ట్‌వార్‌లో ఉండగానే ఈ సంఘటన జరిగినందున ఆయన పాత్రపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.