రాజకీయ నేతలను రానివ్వం: ఒమర్ అబ్దుల్లా
పుకార్లు నమ్మొద్దని తమ రాష్ట్ర ప్రజలకు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. కిష్ట్‌వార్ సంఘటనపై దర్యాప్తు నివేదిక ఆధారంగా తక్షణమే చర్య తీసుకుంటామని ఆయన హామీయిచ్చారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే రాజకీయ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. కిష్ట్‌వార్ మతఘర్షణల్లో ఇద్దరు మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మతఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించేందుకు అరుణ్ జైట్లీతో సహా రాజకీయ నాయకులెవరినీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా, కిష్ట్‌వార్ జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన బీజేపీ నేత అరుణ్‌జైట్లీని జమ్మూ ఎయిర్‌పోర్టులో పోలీసులు నిర్బంధించారు. కిష్ట్‌వార్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల నేపథ్యంలో ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.
కిష్ట్‌వార్ జిల్లాలో శుక్రవారం జరిగిన మత ఘర్షణల్లో ఇద్దరు మరణించగా, ఇరవై మందికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈద్ ప్రార్థనల తర్వాత కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతో ఘర్షణలు మొదలయ్యాయి. దీనికి నిరసనగా బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగదళ్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో జమ్మూలో శనివారం ర్యాలీ నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకోవడంతో, వారిపై రాళ్లు రువ్వారు. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్లు లాఠీలు ఝుళిపించి, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో జమ్మూ ఎస్పీ సహా ఏడుగురు గాయపడ్డారు.మరోవైపు, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ గీలానీ ఆదివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.