కశ్మీర్ ఆందోళనలపై రాజీ లేదు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి
- భారత సమగ్రతపై పాకిస్తాన్ దాడి
- జమ్మూ కశ్మీర్ కోసం మూడు ప్రాథమ్యాలు సూచించిన ప్రధాని
- ఆజాదీ నినాదాలు భావప్రకటన స్వేచ్ఛ కాదు
జమ్మూ : గత 44 రోజులుగా కశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనల విషయంలో ఇకపై రాజీ పడబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆందోళనల్లో పోలీసులు, భద్రతా దళాలే లక్ష్యంగా రాళ్లు విసిరే వారు దుడుకు మనుషులే తప్ప, సత్యాగ్రహులు కారని ఉద్ఘాటించారు. కశ్మీర్ అనిశ్చితికి పాకిస్తాన్ కారణమని విమర్శించారు. జమ్మూలో ఆదివారం జరిగిన బీజేపీ ర్యాలీలో జైట్లీ పలు అంశాలపై ప్రసంగించారు. ‘పాక్ కొత్త పద్ధతి ద్వారా భారత్‌పై దాడి చేస్తోంది. ప్రత్యేకవాదులు, మతతత్వ శక్తులు, పాక్‌తో చేతులు కలిపి దేశ సమగ్రతపై దాడి చేస్తున్నారు. ఈ సవాలును ఎదుర్కోవాలంటేదేశమంతా జాతి భద్రత, సమగ్రత విషయాల్లో రాజీ లేకుండా పోరాడాలి.
కశ్మీరీలు వేర్పాటువాదులకు వ్యతిరేకంగా దేశం వైపు నిలబడాలి. కశ్మీర్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ మూడు ప్రాధామ్యాలను సూచించారు. ఒకటి.. దేశ భద్రత, సమగ్రత విషయాల్లో రాజీ లేకుండా పోరాడడం, హింసకు పాల్పడే వారిని ఉపేక్షించకపోవడం. రెండోది.. హింసతో విసిగిపోయిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం. చివరిది.. జమ్మూకు బీజేపీ మద్దతుతో కూడిన ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ ప్రాథమ్యాలతో కేంద్రం ముందుకు సాగుతోంది’ అని చెప్పారు. ఆజాదీ నినాదాలను భావప్రకటన స్వేచ్ఛగా భావించలేమని అన్నారు.
కశ్మీర్ పరిస్థితిపై రాహుల్‌తో భేటీ
న్యూఢిల్లీ: కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం ఆదివారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయింది. కశ్మీర్ ఆందోళనలకు రాజకీయ పరిష్కారం కనుగొనాలని కోరింది.
నేడు ప్రధానిని కలవనున్న విపక్షాలు
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని కోరుతూ జమ్మూకశ్మీర్ విపక్షాల ప్రతినిధుల బృందం సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలవనుంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఈ బృందం రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను మోదీకి వివరించనుంది.