సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏఎన్‌ఐ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ఎమర్జెన్సీని విధించిన నియంత మనవడి నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. స్వతంత్రంగా వ్యవహరించే జర్నలిస్ట్‌పై దాడి, కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం ద్వారా రాహుల్ తన అసలైన డీఎన్‌ఏను బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
జర్నలిస్ట్‌పై రాహుల్ వ్యాఖ్యల పట్ల కుహనా ఉదారవాదులు ఎందుకు మౌనంగా ఉన్నారని, ఎడిటర్స్ గిల్డ్ స్పందన కోసం వేచిచూస్తున్నామని జైట్లీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ముందుగా సిద్ధం చేసిందని, సానుకూల జర్నలిస్ట్‌తో ఇంటర్వ్యూను మొక్కుబడిగా జరిపించారన్న రాహుల్ వ్యాఖ్యలపై జైట్లీ ఈ మేరకు విరుచుకుపడ్డారు.మరోవైపు మోదీని ఇంటర్వ్యూ చేసిన ఎడిటర్ సైతం రాహుల్ తరును తప్పుబడుతూ ట్వీట్ చేశారు.
‘డియర్ రాహుల్..నాపై దాడి చేసేందుకు మీరు ప్రెస్ మీట్‌లో చవకబారు వ్యాఖ్యలు చేశారు..నేను ప్రధానిని ప్రశ్నించాను తప్ప సమాధానాలు ఇవ్వలేదు...మోదీపై మీరు దాడిచేయదల్చుకుంటే చేసుకోండి, మధ్యలో నన్ను లాగడం ఎందుకు..దేశంలో అత్యంత పురాతన పార్టీ అధ్యక్షుడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను ఆశించలే’మని జర్నలిస్ట్ స్మితా ప్రకాష్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment