
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానిపై వ్యక్తిగత ద్వేషంతోనే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ రఫేల్ ఒప్పందంలో అక్రమాలు అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. రక్షణ బలగాలు, న్యాయవ్యవస్థ, ఆర్బీఐ వంటి వ్యవస్థలపై కాంగ్రెస్ బూటకపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఫెయిలైన విద్యార్ధి నిత్యం క్లాస్ టాపర్‌పై ద్వేషం వెళ్లగక్కుతాడని రాహుల్‌ను ఎద్దేవా చేశారు.
వ్యవస్ధలను కాపాడతామంటూ ముందుకొస్తున్న విధ్వంసకుల నుంచి వాటిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జైట్లీ పేర్కొన్నారు. ఆర్బీఐ, న్యాయవ్యవస్ధ, సీబీఐల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఎంతలా తలదూర్చాయో తెలుసుకోవాలని జైట్లీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో కాంగ్రెస్‌కు చురకలు వేశారు.
అమెరికాలో వైద్య చికిత్స అనంతరం శనివారం భారత్‌కు చేరుకున్న అరుణ్ జైట్లీ వ్యవస్థలపై దాడి జరుగుతున్నదంటూ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో విపక్షాలను టార్గెట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష నేతలు మొసలికన్నీరు కారుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని తిరిగి వారసత్వ నేతల చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment