పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కుమారుడు ఆజం ఖాన్ కెరీర్‌ను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని ఆరోపించాడు. రమీజ్ రాజా ఇష్టారీతిన వ్యవహరించి యువ ఆటగాళ్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాడని.. అతడి నిర్ణయాల వల్లే జట్టు పరిస్థితి ఇలా తయారైందని విమర్శించాడు.
రాణించని ఆజం ఖాన్
కాగా వికెట్ కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా పాకిస్తాన్ తరఫున అరంగ్రేటం చేశాడు. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 13 మ్యాచ్‌లు ఆడి.. 135.38 స్ట్రైక్‌రేటుతో 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, గణాంకాలు అత్యంత సాధారణంగా ఉన్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఆజం ఖాన్‌కు చోటు దక్కింది.
ఈ క్రమంలో మెగా టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆజం ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా అమెరికా చేతిలో ఓడిన పాక్ జట్టు.. కనీసం సూపర్-8కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఫలితంగా తీవ్ర విమర్శలపాలైంది.
బాడీ షేమింగ్.. విమర్శలు
ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై చర్చ జరుగగా.. ఆజం ఖాన్‌ను బాడీ షేమింగ్ చేశారు చాలా మంది. మొయిన్ ఖాన్ కొడుకు కాబట్టే బంధుప్రీతితో అతడి లాంటి వాళ్లకు కూడా జాతీయ జట్టులో చోటు దక్కుతోందని మండిపడ్డారు. అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించిన మొయిన్ ఖాన్ పీసీబీపైనే విమర్శలు చేయడం విశేషం.
మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు?
‘‘వరల్డ్‌కప్ 2024 మ్యాచ్‌లన్నీ నేను చూశాను. వికెట్ కీపర్ బ్యాటర్ కాబట్టి ఆజం ఖాన్‌కు అన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇస్తారనుకున్నా. కానీ ఒక్క మ్యాచ్‌లో విఫలం కాగానే పక్కనపెట్టారు. ఇలాంటి యువ ఆటగాళ్ల ఉత్సాహాన్ని ఆదిలోనే నీరుగారిస్తే.. ఎప్పుటికప్పుడు ప్లేయర్లను మార్చివేస్తూ ఉంటే.. పటిష్ట జట్టు ఎలా రూపుదిద్దుకుంటుంది.
కనీస సంఖ్యలోనైనా అవకాశాలు ఇవ్వాలి. లేనిపక్షంలో మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు? గతంలో ప్రపంచకప్-2022 సమయంలో రమీజ్ రాజా నా కుమారుడు ఆజం ఖాన్‌ను జట్టు నుంచి తప్పించాడు.
సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినా కావాలనే పక్కనపెట్టాడు. ఇలాంటి వాళ్ల జట్టు ఇలా తయారైంది’’ అని 52 ఏళ్ల మొయిన్ ఖాన్ పీసీబీ ప్రస్తుత, మాజీ యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. తన కుమారుడికి ప్రతిభ ఉన్నా అవకాశాలు రావడం లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment