
అమ్మాయిని కాపాడి.. అమ్మేశాడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. సింధు ప్రావిన్స్లో ఓ పోలీస్ అధికారి హిందూ మతానికి చెందిన అమ్మాయిని 50 వేల రూపాయలకు అమ్మేశాడు. తర్వాత మూడు రోజులకు ఆమెతో బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేయించి, ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు.
గోట్కి జిల్లా మీర్పూర్ మతెలోకు చెందిన అనిలా బాగ్రి అనే ఈ అమ్మాయిని కొన్నిరోజుల క్రితం కొందరు కిడ్నాప్ చేశారు. కాగా పోలీసులు కిడ్నాపర్ల బారి నుంచి ఆమెను రక్షించినా కొత్త కష్టాలు మొదలయ్యాయి. సాజద్ ఖాజీ అనే పోలీస్ అధికారి ఆమెను ఇంటికి పంపలేదు. ఈ విషయం తెలుసుకున్న అనిలా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ కుమార్తెను అప్పగించాల్సిందిగా కోరారు. అయితే 50 వేల రూపాయలు ఇస్తేనే పంపిస్తానని ఖాజీ డిమాండ్ చేశాడు. తర్వాత ఖాజీ తన స్నేహితుడు మసూరికి ఆ అమ్మాయిని అమ్మేశాడు. ఈ విషయం మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు ఖాజీని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.
పాకిస్థాన్లో హిందూ మతానికి చెందిన అమ్మాయిని కిడ్నాప్ చేయడం, ఆమెపై లైంగికదాడి చేయడం లేదా బలవంతంగా మతమార్పిడి చేసి వివాహం చేసుకోవడం వంటి ఘటనలు జరగడం సాధారణమని, పాకిస్థాన్లో హిందువులను లేకుండా చేసి పూర్తిగా ఇస్లాం దేశంగా మార్చాలని చూస్తున్నారని రాజ్కుమార్ అనే హిందూ కార్యకర్త చెప్పాడు.