
రాజస్థాన్‌లో చోటుచేసుకున్న అత్యంత భయానక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. 'లవ్ జిహాద్' పేరిట ఓ వ్యక్తిని సజీవ దహనం చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడో కిరాతకుడు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ తింటున్నారు. ఈ ఘటనలో మరణించిన బాధితుడిని మహమ్మద్ భట్టా షైక్‌గా పోలీసులు గుర్తించారు. శంబూనాథ్ రాయ్‌గర్ అనే వ్యక్తి అతడిని కొట్టి చంపి.. సజీవ దహనం చేశాడు. నిందితుడిని గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈలోపు సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన మరో వీడియో సదరు నేరగాడు తాను చేసిన చర్యను సమర్థించుకోవడం గమనార్హం. లవ్ జిహాద్ నుంచి యువతిని కాపాడేందుకు తాను అలా చేశానంటూ అతను వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఈ ఘటన రాజస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్‌సమంద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు చోటుచేసుకోకుండా జిల్లాలో ఐజీ ఆనంద్ శ్రీవాస్తవ క్యాంప్ చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాజ్‌సమంద్ జిల్లాలోని రాజ్‌నగర్ ప్రాంతంలో దేవి హెరిటేజ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సగం కాలి పడి ఉన్న మృతదేహం గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. బాధితుడిని వ్యవసాయ పరికరంతో చితక్కొట్టిన నిందితుడు.. అనంతరం కిరోసిన్ పెట్టి తగులబెట్టాడు. ఈ మేరకు వీడియో తీసి.. ఎవరూ 'లవ్ జిహాద్'కు పాల్పడిన ఇదే గతి పడుతుందని అతను హెచ్చరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment