భోపాల్: లవ్ జిహాద్‌ను అరికట్టడం కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెడతామని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా అన్నారు. పెళ్లి పేరుతో మత మార్పిడికి పాల్పడితే నాన్ బెయిల్ కేసులు నమోదు చేసి, ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, లవ్ జిహాద్‌కి సహాయం చేసిన వారికి కూడా ప్రధాన నిందితుడితో సమానంగా శిక్ష ఉంటుందని హెచ్చరించారు. బలవంత మత మార్పిడుల కోసం పవిత్రమైన వివాహ ధర్మాన్ని అడ్డు పెట్టుకోవడం దుర్మార్గమని మిశ్రా వ్యాఖ్యానించారు. ఇక పెళ్లి కోసం స్వచ్చందంగా మతం మారాలని భావించే వారు తప్పని సరిగా నెల రోజుల ముందుగానే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. (చదవండి: సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!)
కాగా, కేవలం వివాహం కోసం మతమార్పిడి చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్న అలహాబాద్ కోర్టు వ్యాఖ్యల లవ్ జిహాద్ అంశం ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక, హరియాణా వంటి పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు లవ్ జిహాద్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామంటూ ప్రకటనలు చేశాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం సైతం అదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది.
ఇక ముస్లిం వర్గానికి చెందిన అబ్బాయి, హిందూ అమ్మాయిని ప్రేమించడం లేదా పెళ్లి చేసుకున్న సందర్భాలను లవ్ జిహాద్‌గా పేర్కొంటూ రైట్ వింగ్ గ్రూపులు ఈ పదాన్ని వాడుకలోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే లవ్ జిహాద్ అనే పదానికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్వచనం చెప్పలేదు. అంతేగాకుండా ఈ అంశం ఆధారంగా కేంద్ర నిఘా సంస్థలు ఎలాంటి కేసు నమోదు చేయలేదని లోక్‌సభలో ఈ మేరకు ఫిబ్రవరిలో ప్రకటన చేసింది.
Comments
Please login to add a commentAdd a comment