
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లిం యువకులు చేపడుతున్న ‘లవ్ జిహాద్’కు ప్రతీకారంగా తాము ‘బేటీ బచావో బహు లావో’ కార్యక్రమాన్ని వచ్చేవారం నుంచి చేపడుతున్నామని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ హిందూ జాగారణ్ మంచ్ ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద తమ హిందూ యువకులు 2,100 మంది ముస్లిం యువతులను పెళ్లి చేసుకుంటారని వెల్లడించింది.
తాము ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ ఇది ఒకలాంటి లవ్ జిహాద్ లాంటిదేనని హిందూ జాగారణ్ మంచ్ ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ అజ్జూ చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ముస్లిం యువతులకు రెండు విధాలుగా అంటే, ఆర్థికంగా, సామాజికంగాను భద్రత కల్పిస్తామని చెప్పారు. పైగా తమ హిందువులు పెళ్లి చేసుకునే ముస్లిం యువతులు హిందూ మతంలోకి మారాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. వారు ముస్లిం యువకులను పెళ్లి చేసుకున్నట్లయితే పది మంది పిల్లల్ని కనాల్సి ఉంటుంది. హిందువులను పెళ్లి చేసుకోవడం వల్ల ఇద్దరు, ముగ్గురుకు మించి పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.
తాము హిందువులమని చెప్పుకొని ముస్లిం యువతులను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వెళతామని ఆయన చెప్పారు. లవ్ జిహాద్‌కు పాల్పడే ముస్లిం యువకులు అలా చేయరని, నుదిటన తిలకం పెట్టుకొని తిరుగుతారని, హనుమాన్ చాలిస్ కూడా కంఠతా పట్టి వల్లిస్తారని, తీరా ప్రేమలో పడ్డాక తాము ముస్లింలమని, ముస్లిం మతం పుచ్చుకోవాలని హిందూ యువతులపై ఒత్తిడి చేస్తారని ఆయన చెప్పారు. పైగా టెర్రరిస్టులుగా, మానవ బాంబులుగా మార్చేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. తాము ముస్లిం యువతులను పెళ్లి చేసుకోవడం వల్ల వారు కనే పదిమంది ముస్లిం పిల్లల సంఖ్య తగ్గిపోతుందని, వారి పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారికి హిందూ వ్యతిరేకతను నూరి పోస్తారని, అదే హిందువులను చేసుకోవడం వల్ల తమ పిల్లలకు హిందువు వ్యతిరేక ప్రచారం చేయరని, ఇది ఈ కార్యక్రమం ద్వారా తమకు లాభించే అంశమని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment