మతమార్పిడులపై హైకోర్టు సీరియస్
బలవంతపు మత మార్పిడులు, లవ్ జీహాద్ కేసుల వ్యవహారం జాతి ప్రయోజనాలకు భంగకరంగా ఉందని కేరళ హైకోర్టు మండిపడింది. దీనిపై వెంటనే సమగ్రంగా విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. తన ముందుకు వచ్చిన రెండు కేసుల విషయంల కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనల్లో డీజీపీ స్వయంగా విచారణను పర్యవేక్షించి, దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలిపింది. 24 ఏళ్ల వయసున్న హిందూ యువతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించి, ఆమెకు ఓ ముస్లిం వ్యక్తితో 2016 డిసెంబర్ నెలలో చేసిన పెళ్లి చెల్లుబాటు కాదని చెబుతూ, ఇలాంటి విషయాలపై తక్షణం దృష్టి పెట్టాలని డీజీపీని ఆదేశించింది.
మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న సంస్థల పాత్రపై విచారణ జరపాలని, మొత్తం రాష్ట్రమంతా డీజీపీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఆయన వీటిని పర్యవేక్షించాలని జస్టిస్ కె. సురేంద్రమోహన, జస్టిస్ అబ్రహం మాథ్యూలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. లవ్ జీహాద్, మతమార్పిడుల కోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలే ఉండటం దారుణమని వ్యాఖ్యానించింది. ముందుగా హిందూ యువతులను ప్రేమలోకి దించి తర్వాత వారిని బలవంతంగా మతమార్పిడి ద్వారా ఇస్లాం మతంలోకి మార్చి అప్పుడు వారిని పెళ్లి చేసుకోవడాన్నే లవ్ జీహాద్ అంటున్నారు. కేరళలో ఇందుకోసం ఏకంగా కొన్ని సంస్థలే ఏర్పాటయ్యాయి. తన కూతురిని కొన్ని సంస్థలు బలవంతంగా మతం మార్పించి, ఒక ముస్లిం వ్యక్తితో ఆమె పెళ్లి చేస్తున్నాయని ఓ యువతి తండ్రి 2016 ఆగస్టులో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను బలవంతంగా సిరియా పంపి, ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలలో చేర్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాను మేజర్‌నని, తన ఇష్టం మేరకే మతం మారి పెళ్లి చేసుకున్నానని ఆమె కోర్టులో చెప్పినా, కోర్టు మాత్రం ఆ వివాహాన్ని చట్టపరంగా రద్దుచేసి, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించింది. హోమియోపతి వైద్యవిద్య చదువుతున్న 24 ఏళ్ల యువతి అన్నీ వదిలిపెట్టి ఉన్నట్టుండి మతం మారి వేరే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని, దాని వెనక కొంతమంది బలవంతం ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.