సాక్షి, జైపూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన రాజస్థాన్ లవ్‌జిహాద్ హత్య కేసు దర్యాప్తు ఆధారంగా పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. నిందితుడు శంభు లాల్ లక్ష్యం వేరే వ్యక్తి అని.. కానీ, పొరపాటున అఫ్రజుల్‌ను చంపాడని పోలీసులు తెలిపారు.
‘శంభు లక్ష్యం అజ్జూ అనే వ్యక్తిని చంపటం. కానీ, అనుకోకుండా అఫ్రజుల్ బలయ్యాడు. ఈ విషయాన్ని విచారణలో శంభు వెల్లడించాడు. తనకు సోదరితో సమానం అని చెబుతున్న యువతిని శంభు ప్రేమిస్తున్నట్లు తేలింది. అందుకే పగతో అజ్జూను చంపేయాలనుకున్నాడు. ఆ క్రమంలో జరిగిన పొరపాటు మూలంగా అఫ్రజుల్‌ను చంపేశాడు ’’ అని రాజ్‌సమంద్ పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే...
రెగర్ మొహల్లా ప్రాంతానికి చెందిన యువతి మహమ్మద్ బబ్లూ షేక్ అనే వ్యక్తితో 2010లో వెళ్లిపోయింది. మాల్దాలో ఉంటున్న ఆమెను వెనక్కి రప్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించగా కుదరలేదు. దీంతో ఆమెను సోదరిగా చెప్పుకునే శంభులాల్ రంగంలోకి దిగాడు. తానే స్వయంగా వెళ్లి ఆమెతో మాట్లాడి వెనక్కి రప్పించాడు. అయితే కొంత కాలానికే అజ్జూ అనే మరోవ్యక్తి ఆమెను తిరిగి మాల్దాకు తీసుకెళ్లాడు. దీంతో మరోసారి ఆమెతో ఫోన్‌లో మాట్లాడి వెనక్కి రప్పించేందుకు యత్నించగా.. అజ్జూ-శంభు ఫోన్‌లోనే వాదులాడుకున్నారు.
తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ యువతి స్వచ్ఛందంగా ఇంటికి వచ్చేసింది. చివరకు నాలుగైదు నెలల క్రితం అజ్జూ మళ్లీ ఆమె కోసం మొహుల్లాకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న శంభు ఇక అజ్జూను చంపేయటమే మార్గమని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో అజ్జూ కోసం శంభు వేట ప్రారంభించాడు.
పొరపాటు అక్కడ దొర్లింది...
అజ్జూ కూడా అఫ్రోజ్ మాదిరిగానే మాల్దా(పశ్చిమ బెంగాల్) నుంచి వలస వచ్చి రాజ్‌సమంద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శంభు అజ్జూ కోసం గాలిస్తూ మార్కెట్‌లో ఆరాతీయటం ప్రారంభించాడు. అసలు విషయం తెలీని ఓ వ్యక్తి.. కూలి పనుల కోసం కాబోలు అన్న ఉద్దేశ్యంతో అఫ్రోజ్ నంబర్ ఇచ్చాడు. అప్పటిదాకా అజ్జూతో శంభుకి ముఖపరిచయం లేకపోవటం.. ఫోన్‌లో కూడా అజ్జూ గొంతును గుర్తుపట్టకపోవటంతో.. అన్నింటికి మించి అతని వివరాలను కూడా తెలుసుకోవటానికి శంభు ఆసక్తి చూపలేదు.
డిసెంబర్ 6న ఉదయం అఫ్రోజ్‌కు ఫోన్ చేసి కాంపౌండ్ వాల్ పనుల కోసం మాట్లాడేందుకు రావాలంటూ శంభు పిలిచాడు. దీంతో వీరిద్దరూ కలుసుకుని పనుల గురించి మాట్లాడుకున్నారు. ఆపై పని ప్రాంతం చూపిస్తానంటూ కిలో మీటర్ దూరం తీసుకెళ్లి అక్కడ అఫ్రోజుల్‌పై దారుణానికి తెగబడ్డారు. ఆ తతంగం అంతా వీడియో తీసి అప్‌లోడ్ చేశాడు. అసలు విషయం పక్కదారి పట్టేందుకు అతను మతద్వేషిగా అభివర్ణించుకుంటూ వీడియోలను అప్‌లోడ్ చేశాడంటూ పోలీసులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment