
సాక్షి, మైసూరు: కర్ణాటకలోని మైసూరు నగరంలో మరో లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. గత 10 రోజుల్లో ఇలాంటిది రెండో సంఘటన కావడంతో నగరంలో చర్చనీయాంశమైంది. గుజరాత్‌లోని ద్వారక జిల్లా దేవభూమికి చెందిన హిందూ యువతికి మూడేళ్ల క్రితం మైసూరు తాలూకా జయపురకు చెందిన ఫైజల్ అహ్మద్ అనే యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఇద్దరూ చాటింగ్, ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఫైజల్ సూచనల మేరకు ఆ యువతి 6 నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి మైసూరుకు వచ్చేయగా, ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
మొదట సవ్యంగానే ఉన్న ఫైజల్, అతని తల్లి రోజులు గడిచేకొద్దీ మతం మారాలని, మాంసాహారం తినాలని యువతిపై ఒత్తిడి చేయసాగారు. రోజురోజుకు వారి నుంచి శారీరక, మానసిక వేధింపులు తీవ్రతరం కావడంతో కొద్ది రోజుల క్రితం యువతి గుజరాత్‌లో ఉన్న తన తల్లితండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో నగరానికి చేరుకున్న యువతి సోదరుడు ఆదివారం మైసూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యభర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా, యువతి తనపై జరుగుతున్న వేధింపులను ఏకరువు పెట్టింది. భర్తతో కలసి జీవించడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పడంతో పోలీసులు యువతిని ఆమె సోదరుడి వెంట గుజరాత్‌కు పంపించారు. అయితే యువతి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఫైజల్ చెబుతున్నాడు. ఇస్లాంలోకి మారాలని, మాంసాహారం అలవాటు చేసుకోవాలనే తదితర షరతులకు అంగీకారం తెలిపే ఆమె తనను పెళ్లి చేసుకుందని ఫైజల్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment