బెంగళూరు: మైసూరులో భూకేటాయింపుల వివాదంలో కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతించడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం ప్రకటించారు.
‘‘ ఏం లేకున్నా గవర్నర్ దీన్నొక కేసులా మార్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నిరసన బాటలో పయనిస్తుంది. తాలూకా, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ మెమొరాండం అందజేస్తారు’’ అని నిరసన కార్యక్రమ వివరాలను డీకే వివరించారు.
22న సీఎల్పీ భేటీ
గవర్నర్ నిర్ణయాన్ని ఐకమత్యంతో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని చాటేందుకు 22వ తేదీన సీఎల్పీ భేటీని నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ‘‘ ముడా భూకేటాయింపుల అంశంపై ఈ భేటీలో చర్చిస్తారు. చట్టబద్ధంగా ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నామో ఆయన వివరిస్తారు’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
వాదించనున్న సింఘ్వీ, సిబల్ !
మైసూరు భూకేటాయింపుల కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఎం సిద్ధరామయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ వాదించే అవకాశముంది. ఈ మేరకు వీరిద్దరూ నేడు బెంగళూరుకు వస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment