
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద లవ్ జిహాద్ ఆర్డినెన్స్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు సంతకం చేసిన లేఖను మంగళవారం విడుదల చేశారు. లవ్ జిహాద్ వ్యతిరేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత రాష్ట్రం "ద్వేషం, విభజన, మతోన్మాద రాజకీయాలకు కేంద్రంగా" మారిందని వారు లేఖలో పేర్కొన్నారు. ఇక దీనిలో సంతకం చేసిన వారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు, ప్రధానమంత్రి మాజీ సలహాదారు టీకేఏ నాయర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.
"చట్టవిరుద్ధమైన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని" వారు లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఇతర రాజకీయ నాయకులందరూ "మీరు ... పాటిస్తామని ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి చదవాల్సిన అవసరం ఏర్పడింది" అని పేర్కొన్నారు. "ఒకప్పుడు గంగా-జమునా నాగరికతకు కేంద్రంగా బాసిల్లిన యూపీ.. ఇప్పుడు ద్వేషం, విభజన, మూర్ఖత్వ రాజకీయాలకు కేంద్రంగా మారింది. పాలనా సంస్థలు ఇప్పుడు మతపరమైన విషంలో మునిగిపోయాయి" అని వారు లేఖలో తెలిపారు.
"స్వేచ్ఛగా బతకాలనుకునే భారతీయు పౌరులు హక్కుకు వ్యతిరేంగా యూపీలోని ప్రభుత్వ యంత్రాంగం యువకులపై దారుణాలకు పాల్పడుతుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక ఆర్డినెన్స్‌ని అడ్డుపెట్టుకుని మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన దారుణాల గురించి లేఖలో ప్రస్తావించారు. వీటిలో ముఖ్యమైనది ఈ నెల ప్రాంరభంలో రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో జరిగిన సంఘటన. దీనిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇద్దరు వ్యక్తులను దారుణంగా కొట్టారు. బాధితుల్లో ఓ వ్యక్తి పెళ్లి పేరుతో బలవంతంగా ఓ హిందూ యువతిని మతం మారేలా చేశాడని ఆరోపించారు. పోలీసులు సదరు వ్యక్తుల మీద ఈ ఆర్డినెన్స్ కింద కేసు నమోదు చేశారని ఐఏఎస్ అధికారులు లేఖలో తెలిపారు. అలానే మరి కొన్ని ఘటనల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అమాయకపు జంటలను వేధింపులకు గురి చేశారని.. ఆ సమయంలో పోలీసులు స్పందించలేదని.. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
మరో ఘటనలో దంపతులను వేధించగా.. గర్భవతిగా ఉన్న యువతికి అబార్షన్ అయ్యిందంటూ ఓ ఆంగ్ల న్యూస్ పేపర్‌లో వచ్చిన ఉదంతాన్ని ఐఏఎస్ అధికారులు లేఖలో ప్రస్తావించారు. అలానే గత వారం బిజ్నోర్‌లో జరిగిన మరో సంఘటనను కూడా ప్రస్తావించారు. ఇక సదరు ఆర్డినెన్స్ భారతీయ ముస్లిం యువకులు హక్కులను కాలరాస్తుందని పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకొచ్చిన లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను అలహాబాద్ కోర్టు కూడా వ్యతిరేకించిందని లేఖలో పేర్కొన్నారు. ఇక యూపీ తీసుకువచ్చిన సదరు యాంటీ లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌ను నలుగురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా వ్యతిరేకించారు. వీరిలో జస్టిస్ మదన్ బీ లోకూర్ సదరు ఆర్డినెన్స్‌ని రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment