
సుప్రీం ముంగిట తొలి లవ్ జిహాది కేసు
న్యూఢిల్లీ : దేశంలో తొలి లవ్ జిహాది కేసు సర్వోన్నత న్యాయస్థానం చెంతకు చేరింది. కేరళకు చెందిన ఓ హిందూ మహిళ ఇస్లాంను స్వీకరించి ముస్లింను వివాహం చేసుకోవడం వివాదాస్పదమైంది. దీన్ని లవ్ జిహాదిగా పరిగణించి వీరి వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది. కేరళ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహిళ భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 24 ఏళ్ల తన భార్యకు ఏ మతాన్ని స్వీకరించాలి, ఎవరిని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకునే హక్కు ఉందని భర్త కోర్టుకు వివరించారు.
లవ్ జిహాది కుట్రలో భాగంగా ఇది జరిగిందని పేర్కొంటూ వివాహాన్ని రద్దు చేస్తూ కేరళ హైకోర్టు ఉత్తర్వులను పిటిషనర్ తరపు న్యాయవాదులు కపిల్ సిబల్, ఇందిరా జైసింగ్ తప్పుపట్టారు. వీరి వివాహాన్ని రద్దు చేయడంతో పాటు సదరు మహిళను తన భర్తతో కలిసేందుకు అనుమతించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
బాధిత మహిళ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె మనోభావాలు తెలుసుకునేందుకు కోర్టుకు పిలిపించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లకు విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళ ఇంటిని పోలీసులు చుట్టుముట్టి ఆమెను ఎవరూ కలిసేందుకు అనుమతించడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.24 గంటల్లోగా ఆమెను కోర్టుఎదుట హాజరు పరిచేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.