ఈ సృష్టి సమస్తం ప్రేమ మయం.. సృష్టిలో సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కలిగి ఉండటమే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని మహాభారతం చెబుతోంది. ప్రాణం పోసే మహత్తర శక్తి ప్రేమకు ఉంది. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాలకు ప్రేమ ఎంతో అవసరం. ప్రేమకు కొలతలు లేవు. తరతమ భేదాలు లేవు. అది అనంతమైనది. విశ్వవ్యాప్తమైనది..
మనిషి సంఘజీవి. ఏకాకిగా అతడు సంఘంలో ఎక్కువ కాలం ఉండలేడు. అతడు జీవించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ లేనిదే మనిషి జీవితం వ్యర్ధం. మనిషి మనుగడకు మూలం ప్రేమ. మానవ సంబంధాలు నిలబడేది, కొనసాగేది ప్రేమ పునాది పైనే. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీయువకుల మధ్య ఉండే ప్రేమ.. కేవలం యువతీయువకులదే కాదు ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. సమస్త మానవాళిలో ఉన్న ప్రేమను అవగతం చేసుకుంటే అది మానవ జీవితానికి పరిపక్వతనిస్తుంది.
ప్రేమ గురించి సంపూర్ణంగా తెలిసినవారే, దాన్ని ఆస్వాదిస్తారు. ఇతరులకు పంచగలుగుతారు. ప్రేమ మనిషిని దైవంగా మారుస్తుంది.. ఆ దైవత్వంతోనే మనిషి ఎలాంటి కార్యాలనైనా సాధించగలుగుతాడు.. ప్రేమ గురించి , దాని శక్తి గురించి స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్త్ లాంటి ఎందరో మహనీయులు ఈ లోకానికి తెలియ చేశారు. ఈ క్రమంలో ప్రేమతత్వం ద్వారా కోట్ల మందిని ప్రభావితం చేశారు. ప్రేమలో నిర్భయత్వాన్ని, ఆనందాన్ని సాధించే మార్గాలను వారు ఈ లోకానికి అందించారు.
అయితే ప్రేమ అనేది కేవలం మనుషుల మధ్యనే కాదు అది సమస్త జీవరాశుల మీదా ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రకతి అంతా ప్రేమ మయంగా అందంగా, ఆహ్వాదంగా కనిపిస్తుంది. బొందితో స్వర్గానికి వెళ్ళే అర్హత ధర్మరాజుకు ఉంది. ఆయన స్వర్గానికి వెళ్ళే సమయంలో ఓ కుక్క అతని వెంట పడుతుంది. ఆ కుక్కను ప్రేమగా చూసిన ధర్మరాజు కుక్కను వదిలి స్వర్గానికి వెళ్ళడానికి అంగీకరించడు. ఇలా చివరి క్షణంలో సైతం కుక్క మీద ప్రేమ కురిపించి మూగజీవాల పట్ల తన దయాగుణాన్ని చాటుకున్నాడు.
సాక్షాత్తు శిరిడీ సాయి నాధుడు ఎప్పుడూ ప్రజలతో పాటు మూగ జీవాలను కూడా ఎంతగానో ప్రేమించేవారు. అలాగే రమణ మహర్షితో పాటు ఇంకా అనేక మంది యోగులు, మునులు, సిద్ధులు తమ ప్రేమను జంతు జీవాలపై కురిపించి విశ్వ మానవ ప్రేమను చాటుకున్నారు...ఇలా ఆపదలో ఉన్నవారిని, రోగ గ్రస్తులను మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను ప్రేమించిననాడే మానవ జీవితానికి పరిపక్వత సిద్ధిస్తుంది.
ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడుతుంది. జీవితంలో ప్రతి మనిషి తన స్నేహితులను, తల్లితండ్రులను, పిల్లలనూ ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే సుందరమైన నదులు, కొండలపై జారు జలపాతాలు, ఇసుకతో కూడిన ఎడారులు, ప్రకతి శోభ, చెట్టు చేమ, జంతువులు, పక్షుల, వింతగా కనిపించే మబ్బులు, మిణుకు మిణుకుమనే నక్షత్ర సముదాయం, రోదసి, అందం, సుందరం, బుజ్జి పాపాయి అమాయక నవ్వు, మనుషుల స్నేహం, అభిమానం, వీటి అన్నింటిలో కూడా ప్రేమ కనిపిస్తుంది. వికసిస్తుంది. ప్రేమ మనకు ప్రకృతి ఇచ్చిన వరం.
మనిషి మౌలికంగా దైవస్వరూపుడని, శరీరంలో నివసించే ఆత్మే దైవమని అనేక మంది మహనీయులు సెలవిచ్చారు. జ్ఞానం పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత వికసిస్తుంది. అలా వికసించినపుడే అన్ని భేదాలు అంతరించి ప్రేమతత్వం సాధ్యపడుతుంది. ఏవిధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, మంచి మనసుతో మనం ఒకరి పట్ల చూపే నిస్వార్థమైన ఆదరణే ప్రేమ‘. ఇది ఒక ఉన్నతమైన, పవిత్రమైన, గొప్పదైన భావన.
– దాసరి దుర్గాప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment