భక్తి ఉద్యమ సారథి
భారతీయ సనాతన ధర్మంలో మోక్ష సాధనకు జ్ఞాన-కర్మ-భక్తి మార్గాలను నిర్దేశించారు. వీటిలో జ్ఞానయోగం సాధారణ మేధస్సుగల సామాన్యులకు ఒక పట్టాన అర్థమై అంతుబట్టేది కాదు. అటు కర్మమార్గంలో ఆచరించాల్సిన వైదిక కర్మలూ, యజ్ఞయాగాలూ, విధినిషేధాలూ కూడా సాధారణ మానవులకు సులభంగా సాధ్యమయ్యేది కాదు. కనుకనే కలియుగంలో మానవులందరికీ భగవత్ సాక్షాత్కారానికి సర్వోత్కృష్టమైన మార్గం భక్తి మార్గమేనని చైతన్య మహా ప్రభువు అంటారు. పదకొండో శతాబ్దం తరువాతి కాలంలో దేశమంతా వెల్లువలా వ్యాపించిన భక్తి ఉద్యమ నిర్మాతల్లో ఆయన ప్రముఖుడు.
గౌడీయ సంప్రదాయంవారూ, ఇస్కాన్ సభ్యులూ ఆయనను ద్వాపరయుగంలో ‘నల్లనయ్య’గా పుట్టిన శ్రీకృష్ణుడి ‘తెల్లనయ్య’ అవతారంగా ఆరాధిస్తారు. చైతన్య ప్రభువు ‘గౌరాంగుడు’-తెల్లని దేహకాంతితో మెరిసిపోయే సుందరాకారుడు. ఆయన బోధలు ఆనాటి సగటు మనిషి ఆధ్యాత్మిక చింతనకూ, సాధనకూ ఆచరణీయమైన స్పష్టమైన మార్గ నిర్దేశం చేశాయి. భగవన్నామ సంకీర్తనను మించిన ఆధ్యాత్మిక సాధనలేదని చైతన్యులు తన ఆచరణద్వారా, బోధనల ద్వారా, ఉద్యమంద్వారా దేశమంతా చాటారు.
సర్వకాల సర్వావస్థలలోనూ, ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే , హరేరామ హరేరామ రామ రామ హరే హరే!’ అన్న మహా మంత్రాన్ని జపిస్తూ, ఏ పనిచేసినా శ్రీకృష్ణార్పణ భావంతో చేస్తే ఆపదలన్నీ తొలగి, పాపాలన్నీ క్షయమైపోయి తరిస్తారని చైతన్యులు బోధించారు. చైతన్యులు 1486 సంవత్సరం, ఫిబ్రవరి 18 ఫాల్గుణ పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో వంగదేశంలోని నవద్వీపంలో మాయాపూర్ గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే ఎన్నో మానవాతీతమైన లీలలూ, మహిమలూ ప్రదర్శించారు. పదహారేళ్ల వయసుకే ఉద్దండ పండితుడిగా పేరు సంపాదించారు. ఇరవైయ్యేళ్ల వయసులో గయక్షేత్రంలో ఈశ్వరపురి అనే గురువునుంచి హరే కృష్ణ మంత్రోపదేశం పొందాక ఆయనకు కృష్ణభక్తే లోకమైపోయింది. నృత్యంలో, గానంలో కృష్ణ నామ సంకీర్తనచేస్తూ కృష్ణభక్తి ప్రచారాన్ని ఉద్యమంగా నిర్వహిస్తూ శేష జీవితమంతా గడిపారు చైతన్య ప్రభువు. ఇరవైనాలుగేళ్లకే ఆయన సన్యాసం స్వీకరించారు. రాధాకృష్ణ ప్రేమతత్వం ఆయనను ఎంతో ప్రభావితుడిని చేసింది. ఆయనకు జీవితమంతా బృందావనంలోనే గడపాలని ఉండేదట. కానీ, చైతన్య ప్రభువు తల్లి ఆదేశం మేరకు సన్యాసాశ్రమ జీవితంలో ఎక్కువ భాగం పూరీ క్షేత్రంలోని జగన్నాథుడి సంకీర్తనలో గడిపారు. పూరీ రథయాత్ర సంప్రదాయాన్ని చైతన్యులు మరింత వైభవోపేతం చేశారు. దక్షిణ యాత్రచేసి ఆయన శ్రీకూర్మం, సింహాచలం, మంగళగిరి, తిరుపతిసహా దక్షిణాదిన ఉన్న పుణ్యక్షేత్రాలెన్నో దర్శించారు. కొవ్వూరులో రాజప్రతినిధిగా ఉన్న రామానంద రాయలు అనే ఆంధ్రుడు చైతన్యప్రభువుల సన్నిహిత శిష్యుల్లో ఒకరయ్యారు.
బృందావన యాత్రలో చైతన్యులకు లభించిన సనాతన గోస్వామి, రూపగోస్వామి, జీవగోస్వామి తదితర శిష్యులు ఆయన బోధించిన భక్తి తత్వాన్ని గ్రంథస్థం చేశారు. చైతన్యులు మాత్రం శిక్షాష్టకం అనే ఎనిమిది శ్లోకాలు మినహా స్వయంగా ఏ గ్రంథమూ రాయలేదు. ఆయన పూరీ సముద్ర తీరంలో ఉన్న గోపీనాథ మందిరంలో 1533 జూన్ 14న నలభైయ్యేడు సంవత్సరాల వయసులో నృత్య సంకీర్తనలు చేస్తూ ఆ భక్తి పారవశ్యంలో ఆకస్మికంగా మందిరంలోనికి దూసుకుపోయి గోపీనాథుడిలో లీనమై అవతార సమాప్తి చేశారు.
(నేడు చైతన్య ప్రభువు జయంతి)
- ఎం. మారుతిశాస్త్రి