అతి చేస్తే అంతే సంగతులు
ప్రాచీనకాలంలో ఋషులూ, మేధావులూ, ప్రవక్తలూ చెప్పిన సుభాషితాలు కొన్ని ఆ రోజులకంటే, ఇప్పటి సాం ఘిక పరిస్థితులకే ఎక్కువ అన్వయిస్తాయని ప్రస్తుత ఆధునిక ప్రపంచాన్ని చూస్తూ ఉంటే అనిపిస్తుంది. అందరూ ఎరిగిన ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న సూక్తి దీనికొక చక్కని ఉదాహరణ.
ప్రపంచంలో ఇంత ఆర్థిక సాంకేతిక అభివృద్ధి కనిపిస్తున్నా, చాలా మందికి జీవితం సమస్యలమయమే. మరింత అభివృద్ధి చెందిన దేశాలలో మరిన్ని సమస్యలు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, దాం పత్య సమస్యలు, సంతానంతో సమస్యలు, మానవ సం బంధాల సమస్యలు.‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న చిన్న సూత్రాన్ని బాగా మనసుకు పట్టించుకొని, ఆచరించగలిగితే, ఈ సమస్యలలో చాలా వాటికి పరిష్కారం లభిస్తుంది.
ఆహార విహారాల విషయంలో, జీవన విధానం విషయంలో నివార్యమైన ‘అతి’ వల్లనే కదా ఆరోగ్య సమస్యలలో మూడువంతుల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే కామక్రోధాలూ, ఈర్ష్యాహంకారాలలో ‘అతి’ వల్లనే మానవ సంబంధాలలో ఎక్కువ శాతం సమస్యలు. అతి లోభం, అత్యాశ వల్లా, ఎలాగైనా సరే అందరికంటే ఉత్తమమైన, ఉన్నతమైన స్థానానికి ఏదోవిధంగా చేరుకోవాలనే తాపత్రయంతో అనారోగ్యకరమైన పోటీతో తెచ్చిపెట్టుకునే సమస్యలు మరికొన్ని.
‘అతి’ వల్ల మనిషి యుగ యుగాలుగా బాధపడుతున్నాడు, ఇవాళే కాదు.
అతి దర్పే హతాలంకా అతి మానే చ కౌరవాః
అతిదానే బలిః-బద్ధః అతి సర్వత్ర వర్జయేత్ ॥
మితిమీరిన బలదర్పం వల్ల త్రేతాయుగంలో లంకా రాజ్యం నాశనమైపోయింది. ద్వాపరయుగంలో మితిమీరిన ఈర్ష్యవల్ల కౌరవులు నశించిపోయారు. అంతకుముందు కృతయుగంలో దానం లాంటి సత్కర్మ కూడా మితి ఎరగకుండా చేసి, బలిచక్రవర్తి కట్టుబడిపోయి పాతాళ వాసం చేశాడు. అందుకే ‘అతి’ అన్ని చోట్లా వర్జించాలి అని ఆర్యోక్తి. ఇది కలియుగంలో కూడా ఆచరణ యోగ్యం.
‘అతి’కి, ఈ కాలంలో అన్నిటికంటే సాధారణమైన, సర్వజనీనమైన, స్థూలమైన స్పష్టమైన ఉదాహరణ ఆహా రం. నాలుకకు హితవైన ఆహారం మితంగా భుజించటం తప్పేమీ కాదు. కానీ ‘అతి’గా భుజిస్తే, భుజించింది అరిగేందుకు అవకాశం లేనంతగా భుజిస్తే ఊబకాయం, అనారోగ్యం, సంబంధిత సమస్యలూ తప్పవు. అలాగే మనకు అందుబాటులో ఉండి, చట్టానికీ ధర్మానికీ విరుద్ధం కాని ఏ భోగమైనా అనుభవించవచ్చు. పరిమితులూ పరిస్థితులూ మరచిపోకుండా దాని కోసం యథాశక్తి ప్రయత్నించవచ్చు. అర్థ, కామాలు కూడా పురుషార్థాలే. కానీ, కోరిక పరిమితులలో ఉంటేనే అది తీరే అవకాశం, తీరటం వల్ల సుఖానుభవం. మితులు దాటితే దుఃఖం తప్పదు. మితులు మీరిన కోరికలే దుఃఖానికి కారణం.
మితిలేని ధన కనక వస్తు వాహనాల తాపత్రయం కూడా మితిలేకుండా పెరిగిన అనారోగ్యదాయకమైన ఊబకాయం లాంటిదే. కాకపోతే ఇది కంటికి కనిపిం చని ఊబకాయం. కనిపించే ఊబకాయం సుఖాన్ని కలి గించే బదులు ఆయాసం, అనారోగ్యం, అనాకారితనం కలిగించినట్టు, ‘అతి’ తాపత్రయం అశాంతినీ, అలజడినీ, ఒత్తిడినీ కలిగిస్తుంది. ‘మనిషికి చిక్కకుండా ఉండే భోగాలు మనిషికి మనోవ్యధను కలిగిస్తాయి. భోగాలకు చిక్కకుండా ఉండే మనిషిదే అసలైన సుఖం!’ అని మరొక ఆసక్తికరమైన, ఆలోచనీయమైన ప్రాచీన భారతీయ సుభాషితం.
ఎం. మారుతి శాస్త్రి