బోధన్‌రూరల్(బోధన్): జిల్లాలో విశ్వ బ్రాహ్మణుల బతుకులు కళ తప్పుతున్నాయి. ఒకప్పుడు చేతినిండా పనితో గడిపిన విశ్వ బ్రాహ్మణులు నేడు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పెద్దపెద్ద జువెల్లరీ దుకాణాలు, బెంగాలీ కూలీలతో స్వర్ణకారులు ఉపాధిని కోల్పోతుండగా, గుజరాత్, యూపీ, రాజస్థాన్ వ్యాపారుల పోటీతో వండ్రగులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విశ్వబ్రాహ్మణులు కొత్త రాష్ట్రంలోనూ ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంత చారి విశ్వ బ్రాహ్మణుడే. కొత్త రాష్ట్రంలోనైనా తమ బతుకులు బాగు పడడం లేదని వారు వాపోతున్నారు. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఉన్నా.. ప్రభుత్వాలు ఆశించిన మేరకు నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు సమస్త చేతి వృత్తులకు మూల గురువు, విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్యదైవం అయిన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని స్వర్ణకారులు, వండ్రగుల జీవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఉపాధి కోల్పోతున్న వడ్రంగులు..
సొంత ఇంటిని నిర్మించుకునే ప్రతి ఒక్కరికి వండ్రగితో పని ఉంటుంది. ఇంటికి అవసరమైన తలుపులు, కిటికీలు, దర్వాజాలు ఇతర సామగ్రి కోసం వండ్రగులను ఆశ్రయించాల్సిందే. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో రెడీమేడ్ ప్‌లైవుడ్ షాప్‌లు, కిటికీలు, తలుపులు లభిస్తుండడంతో వడ్రంగులకు గిరాకీ తగ్గింది. అంతేగాక రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహరాష్ట్రల నుంచి వలస వచ్చిన వ్యాపారులు ఇక్కడ రెడీమేడ్ సామగ్రిని అమ్ముతున్నారు. దీంతో వడ్రంగులకు పని లేకుండా పోయింది. అలాగే స్వర్ణకార వృత్తుల వారు సైతం ఉపాధి కోల్పోతున్నారు. రెడీమేడ్ ఆభరణాలు, ప్రైవేట్ రంగ సంస్థలు జువెల్లరీ దుకాణాలు ఏర్పాటు చేయడంతో వీరికి గిరాకీ తగ్గింది. బెంగాలీ కూలీలతో స్థానికులకు ఉపాధి దెబ్బతింటోంది. దీనికి తోడు దొంగ బంగారం కేసులతో స్వర్ణకారుల బతుకులు చిద్రమైపోతున్నాయి. ఉపాధి కరువై ఎందరో విశ్వబ్రాహ్మణులు దినసరి కూలీలుగా, నైట్ వాచ్‌మెన్‌లు మారుతున్నారు.
చేతి వృత్తులకు గురువు..
సమస్త చేతి వృత్తులకు మూలపురుషుడు శ్రీ విరాట్ విశ్వకర్మ. విష్ణువుకు సుదర్శణ చక్రాన్ని, ఈశ్వరునికి త్రిశులాన్ని, బహ్మకు ఘంటాన్ని, దేవతలకు పుష్పక విమానాన్ని, మహాశక్తికి దివ్యరథాన్ని, దేవేంద్రుడికి అమరావతి నగరాన్ని సృష్టించి ఇచ్చిన మహా పురుషుడు. చేతివృత్తుల మూల గురువు విశ్వకర్మకు, రచనాదేవిలకు జన్మించిన పుట్టిన ఐదుగురు కుమారులు. మను, మయ, త్వష్ఠ, శిల్పి, విశ్వజ్ఞలు. విశ్వకర్మ మొదటి కుమారుడు మను నుంచి వచ్చిన వృత్తి కమ్మరి. రెండో కుమారుడు మయ నుంచి వచ్చిన వృత్తి వండ్రగి. మూడో కుమారుడు త్వష్ఠ నుంచి వచ్చిన వృత్తి కంచరి. నాలుగో కుమారుడు శిల్పి నుంచి వచ్చిన వృత్తి శిల్పకార వృత్తి. ఐదో కుమారుడు విశ్వజ్ఞ నుంచి వచ్చినదే స్వర్ణకార వృత్తి. విశ్వకర్మ ఐదుగురు కుమారుల నుంచి పుట్టినవే నేటి సమాజంలోని చేతి వృత్తులు.
విశ్వ బ్రాహ్మణుల సంఘం డిమాండ్లు...
విశ్వకర్మలకు ప్రత్యేక పాలక మండలితో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1,000 కోట్లు నిధులు కేటాయించాలి. జీవో నెం.31తో కర్ర వృత్తిదారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈజీవోను ఉపసంహరించుకోవాలి. 50 ఏళ్లు నిండిన వారికి రూ.3వేలు పింఛన్ అందించాలి. జీవో 272 అమలు పరిచి స్వర్ణకారులపై జరిగే అక్రమ రికవరీలను అరికట్టాలి. వృత్తి నైపుణ్యం కోసం ఆధునాతన మిషనరీలపై సబ్సిడీ రుణాలను అందించాలి. పుస్తె, మట్టెలు జ్యూవెల్లరీ షాపులలో అమ్మడాన్ని నిషేధించాలి. బ్యాంకుల్లో అప్రైజర్లుగా స్థానిక స్వర్ణకారులనే తీసుకోవాలి.
పింఛన్ అందించాలి
ఎన్నో ఏళ్లుగా విశ్వ బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. చేతి వృత్తులకు ఆదరణ కరువై ఉపాధి కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక నిధులు కేటాయించి 50 ఏళ్లు నిండిన విశ్వ బ్రహ్మణులందరికి రూ.3వేలు పింఛన్ అందించాలి. – కస్తురోజు కాళిదాస్ చారి, స్వర్ణ కార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, బోధన్
రూ.1,000 కోట్లు నిధులుకేటాయించాలి
విశ్వకర్మలకు ప్రత్యేక పాలక మండలితో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రూ.1,000 కోట్లు నిధులు కేటాయించాలి. విశ్వ బ్రాహ్మణుల చేతి వృత్తులను పోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తి నైపుణ్యం కోసం ఆధునాతన మిషనరీలు అందజేయాలి. ఇందుకుగాను రూ.5లక్షల వరకు సబ్సిడీ రుణాలను అందించాలి. – మారోజు సుధాకర్ చారి, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, బోధన్
Comments
Please login to add a commentAdd a comment