goldsmiths
-
బంగారంలాంటి ఆలోచన
బంగారు ఆభరణాలు తయారుచేసే స్వర్ణకారుల జీవితాలు బంగారమయంగా ఉన్నాయా.. ఈ విషయాన్ని నేరుగా తెలుసుకోవడమే కాదు వారికి సాయం చేయాలనే ఆలోచనతో పాతికేళ్ల లోపు యంగ్‌స్టర్స్ స్వచ్ఛందంగా వారిని కలిసి, ఆభరణాలను తయారుచేయించి హైదరాబాద్ తెల్లాపూర్‌లో ప్రదర్శనను ఏర్పాటుచేశారు. గ్లోబలైజేషన్లో భాగంగా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు, కంప్యూటర్ డిజైన్స్ వచ్చాక స్వర్ణకారుల ప్రాభవం మసకబారిపోతోందని, వారి కళను బతికించడం కోసం చేస్తున్న ప్రయత్నమిదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వీరిలో శ్రీహర్షిత, ప్రద్యుమ్న, రిత్విక్, ప్రకృతి, సంస్కృతి, సర్వనా, సాత్విక్, భరణ్య, అజయ్, భగీరథ్ లు ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి వీరితో మాట్లాడినప్పుడు స్వర్ణకారుల కళ, వారి శ్రమకు తగిన ఫలం రాబోయే రోజుల్లో మరింతగా పెరగాలని కోరుకున్నారు. స్వర్ణకారులు తయారుచేసిన ఆభరణాల ప్రదర్శనకు ముందుండి నడిచిన చాడా శ్రీహర్షిత లా పూర్తి చేసి, తెలంగాణలోని ‘బచ్పన్ బచావో ఆందోళన్’కి లీగల్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తోంది. భరణ్య లా చదువుతోంది. రుత్విక్ డాక్టర్ కాగా స్వాతిక్ లా చేస్తున్నాడు. ప్రకృతి పన్నెండవ తరగతి పూర్తిచేసి సైకాలజీ పట్టా పొందడానికి కృషి చేస్తోంది. ప్రద్యుమ్న, భగీరథ్లు బీటెక్ చేస్తున్నారు. ఇక సర్వనా, సంస్కృతి లు స్కూల్ ఏజ్‌లోనే ఉన్నారు. నేరుగా కలిసి.. తాము చేస్తున్న కార్యక్రమాల గురించి శ్రీహర్షిత మాట్లాడుతూ ‘ఎడిస్టీస్ ఎన్జీవోని కిందటేడాది ప్రారంభించాం. దీని ద్వారా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో మంచి మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తుంటాం. ఇందుకు కర్నూలు వాసి అయిన నర్మదా టీచర్ ప్రెసిడెంట్‌గా ఉండి సరైన సూచనలు ఇస్తుంటారు. స్కూల్ కార్యక్రమాల తక్వాత హస్తకళలకు సాయం చేయాలనే ఆలోచన చేసినప్పుడు స్వర్ణకారుల జీవితాలను చూశాం. మూడు నెలల క్రితం అనుకున్న ఈ కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టాం’ అని వివరిస్తే.. ‘దాదాపు పాతికమంది స్వర్ణకారుల కుటుంబాలను నేరుగా కలిసి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, ఒక డాక్యుమెంటరీ రూపొందించాం. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులను కలిసి, స్వర్ణకారుల జీవితాల గురించి తెలియజేశాం. మేం ఏ కార్యక్రమం చేసినా, అందులో ప్రతీసారి కొత్తవారు సభ్యులు అవుతూ ఉంటారు. దీంతో మరికొందరికి సాయం చేయాలన్న ఆలోచన కూడా పెరుగుతోంది’ అని వివరించింది భరణ్య. శ్రమ ఎక్కువ.. ఆదాయం తక్కువ ‘హైదరాబాద్‌లోని కళాకారులనే కలుసుకున్నాం. వీరిలో స్థానిక కళాకారులే కాదు కలకత్తా, గుజరాత్.. వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారున్నారు. స్వర్ణకారుల షాప్‌లో ఒకరు మాస్టర్‌గా ఉంటారు. వారికి తప్ప మిగతా అందరికీ చాలా తక్కువ ఆదాయం ఉంటుంది. దీంతో కుటుంబాలు పోషించుకోలేని స్థితిలో ఉన్నవారిని చూశాం. జ్యువెలరీ అంటే లగ్జరీ గూడ్ అని మనకు తెలుసు. వీటిని తయారుచేసేవారి దగ్గర కూడా బాగా డబ్బు ఉంటుంది అనుకుంటాం. కానీ, వాళ్ల దగ్గర ఏమీ ఉండటం లేదు. ఈ కారణంగా వారి పిల్లలు కనీస చదువులు కూడా కొనసాగించలేకపోతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో 25 మంది కళాకారులు పాల్గొన్నారు. సందర్శకులు వారి ఆభరణాలు కొనుగోలు చేసి, స్వర్ణకారులకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ కుటుంబాలకు మేం ఇలా సాయంగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది’ అని వివరించారు ఈ యంగ్‌స్టర్స్. మన హస్తకళలన్నీ ముందు తరాలలోనూ సుసంపన్నంగా వెలగాలి. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జనంలోకి వెళుతూ ఉంటే స్వర్ణకళాకారుల భవిత కూడా బంగారమే అవుతుంది. కళను గుర్తించండి... ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఎంత కష్టపడినా ఒక్కోరోజు నాలుగైదు వందలు కూడా రావు. బంగారాన్ని కాల్చి, తీగ తీసి, అత్యంత శ్రద్ధతో ఒక ఆభరణాన్ని తయారు చేయాలంటే ఎంతో టైమ్ పడుతుంది. ఇప్పుడంతా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకే వెళుతున్నారు. మా దగ్గర ఆభరణాలు చేయించుకునేవారు బాగా తగ్గిపోయారు. ప్రస్తుతం మేం ఆర్థికంగానే కాదు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం. రాబోయే తరాలకు ఈ పని అందించే ధైర్యం చేయలేకపోతున్నాం. మా పిల్లలను వేరే పనులు చూసుకోమని చెబతున్నాం. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రముఖులు మా పనిని గుర్తిస్తే ఈ కళ బతుకుతుంది. – గోవింద్, స్వర్ణకారుడు ప్రత్యేకమైనది ఏ పని అయినా ఒకసారి చేసి వదిలేయడం వల్ల సరైన ఫలితాలు రావు. ఈ విషయం స్వర్ణకారులను కలిసినప్పుడు మరింతగా అర్ధమైంది. నిరంతరం సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఎంచుకున్న కార్యక్రమం ఇది. దీనికి చాలా మంది ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఈ ఆలోచన ప్రత్యేకంగా ఉందని అభినందించారు. – శ్రీహర్షిత సాయపడదాం జ్యువెలరీ షాపులు వచ్చాక స్వర్ణకారుల కళానైపుణ్యం ప్రశ్నార్ధకంగానే మారింది. కోవిడ్ తర్వాత వీరి ఇబ్బందులు మరీ పెరిగాయి. కంటిచూపు, గంటలు గంటలు కూర్చొని పని చేయడం వల్ల బ్యాక్పెయిన్తో సఫర్ అవుతున్నారు. ఈ విధంగా వారికి సాయం పడటం సంతోషాన్నిచ్చింది. – ప్రకృతి – నిర్మలారెడ్డి -
Goldsmiths: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు
(డెస్క్–రాజమహేంద్రవరం): ఆధునిక పరిస్థితుల ప్రభావితంతో కుల వృత్తులు కూలిపోతున్నాయి. రోజురోజుకూ ఉనికి కోల్పోతున్నాయి. మనుగడ కష్టమని భావించిన కొందరు బతుకుదారి మార్చుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికీ తాతల కాలం నుంచి వారసత్వంగా అబ్బిన వృత్తినే నమ్ముకుంటూ యాతనలు పడుతున్నారు. ఒకప్పుడు ‘బంగారు’బాబుల్లా బతికిన స్వర్ణకారుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. చాలామంది పల్లెటూళ్ల నుంచి పట్టణాల బాట పడుతున్నారు. బతుకు బండి పయనానికి ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. ఉనికిపాట్లు కార్పొరేట్ సంస్థల సవాళ్ల నేపథ్యంలో కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వర్ణకారులు ఇప్పటికీ ఉనికి చాటుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని నల్లమందుసందు, సీతమ్మసందు, చందాసత్రం, గుండువారి వీధి ప్రాంతాల్లో కొందరు స్వర్ణకారులు కొద్దోగొప్పో ఆభరణాల తయారీ పనులు చేసుకుంటూ వృత్తికి ఊపిరిలూదుతున్నారు. దీర్ఘకాలంగా ఉన్న పరిచయాలతో కొందరు ఇక్కడకు వచ్చి బంగారమిచ్చి వారితో ఆభరణాలు తయారు చేయించుకుంటున్నారు. ఒక్క రాజమహేంద్రవరం నగరంలోనే 2008 నాటికి వెయ్యి మందికి పైగా స్వర్ణకారులు ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య బాగా తగ్గిపోయింది. తమ సంఘంలో 600 మంది సభ్యులుగా కొనసాగుతున్నారని రాజమహేంద్రవరం స్వర్ణకారుల సంఘం గండేబత్తుల శ్యామ్ చెప్పారు. కార్పొరేట్ సెగ ఆభరణాల రంగంలో కార్పొరేట్లు అడుగు పెట్టడంతో స్వర్ణకారుల బతుకులు రంగు మారిపోయాయి. అప్పటి వరకూ ఉన్న ఉపాధి కాస్తా దూరం కావడం ప్రారంభమైంది. తొలినాళ్లలో జ్యూయలరీ షాపులొచ్చి వీరి మనుగడను కొంత దెబ్బ తీశాయి. పాతిక సంవత్సరాలుగా నగరాల్లో కార్పొరేట్ షాపులు పెరిగిపోయాయి. ఈ పదేళ్లలో ఓ మాదిరి పట్టణాలకూ ఈ షాపులు విస్తరించాయి. పగలూ రాత్రీ విద్యుద్దీపాల కాంతులతో వెలిగిపోయే అందాల షాపుల భవంతుల వైపే జనమూ అడుగులు వేస్తున్నారు. ఫలితంగా వృత్తి నైపుణ్యమున్న స్వర్ణకారులకు ఆదరణ తగ్గింది. కార్పొరేట్ తాకిడికి తలవంచిన కొందరు బ్యాంకులు లేదా బంగారంపై వడ్డీ ఇచ్చే వ్యక్తుల వద్ద అప్రైజర్లుగా చేరిపోయారు. వయసు 50లు దాటిన మరికొందరు మరో పని నేర్చుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో పాత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణకారులుగా పని చేస్తున్నవారెవరూ తమ పిల్లలను ఈ రంగం వైపు నడిపించడంలేదు. తన ఇద్దరు పిల్లలూ బాగా చదువుకున్నారని.. ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని నల్లమందు సందులో పని చేస్తున్న స్వర్ణకార సంఘం సభ్యుడు పేరూరి సూర్యప్రకాష్ చెప్పారు. తమ తరం తర్వాత స్వర్ణకారులు కనిపించరని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పడదామన్నా పెట్టుబడి ఏదీ.. అన్ని వృత్తుల మాదిరిగానే ఆభరణాల తయారీలో కూడా ఆధునికత అడుగు పెట్టింది. ప్రతి చిన్న పనీ యంత్రాల సాయంతోనే చేయాల్సి వస్తోంది. కానీ వాటిని సమకూర్చోలేక స్థాయికి తగ్గట్టుగా చిన్నపాటి పరికరాలతో స్వర్ణకారులు నెట్టుకొస్తున్నారు. గతంలో ఎక్కువగా కుంపటి ఉపయోగించేవారు. నాటి స్వర్ణకారులెందరినో శ్వాసకోశ వ్యాధులు ఇప్పటికీ వెంటాడుతున్నాయని స్వర్ణకారుడు ఈదరాడ శ్రీనివాస్ చెప్పారు. ఉదయం నుంచి చీకటి పడే వరకూ కూర్చుని పని చేయడం వల్ల శారీరక వ్యాయామం లేక అనారోగ్యం బారిన పడుతున్నామని మరో స్వర్ణకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దోగొప్పో డబ్బులు వెచ్చించి, చిన్నపాటి యంత్రాలు కొందామన్నా ఎక్కువ మందికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదు. ఒక్కో యంత్రానికి కనీసం రూ.50 వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. వ్యక్తిగత రుణాలకు బ్యాంకులు సహకరించడ లేదని స్వర్ణకారుడు వరప్రసాద్ చెప్పారు. దొంగ బంగారం కొన్నారంటూ గతంలో పోలీసుల నుంచి తమకు తరచూ వేధింపులు ఎదురయ్యేవని కొందరు స్వర్ణకారులు చెప్పారు. ఐదేళ్లుగా ఈ వేధింపులు తగ్గాయన్నారు. ఏమైనప్పటికీ కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేక స్వర్ణకారుల బతుకులు కాంతిహీనమవుతున్నాయి. సామాజిక భవనమూ లేదు ఈ మధ్యనే రాజమహేంద్రవరం స్వర్ణ కారుల సంఘానికి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. స్వర్ణకారుల బతుకులు దయనీయంగా ఉన్నాయి. ఈ నగరంలో మాకు ఒక సామాజిక భవనం కూడా లేదు. స్థలమివ్వగలిగితే భవనం ఇస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసి సమకూర్చగలిగే ఆర్థిక స్తోమత మాలో ఎవ్వరికీ లేదు. ప్రజాప్రతినిధులు మా కష్టాలను గమనించి సామాజిక భవనం నిర్మించాలని కోరుతున్నాను. – గండేబత్తుల శ్యామ్, అధ్యక్షుడు, రాజమహేంద్రవరం స్వర్ణకారుల సంఘం రుణం అందించాలి స్వర్ణాభరణాల తయారీ యంత్రాలు చాలా ఖరీదైనవి. కొనుక్కుని బతుకుదామంటే ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. ముద్రా రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నా బ్యాంకులు స్పందించడం లేదు. పూచీకత్తు లేనిదే ఇవ్వబోమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తిలో ఎలా పోటీ పడగలం? ఎలా ముందుకు వెళ్లగలం? రుణ సదుపాయం కల్పిస్తే కొద్దోగొప్పో ఈ వృత్తి బతకడానికి అవకాశముంటుంది. – ఈదర వరప్రసాద్, నల్లమందు సందు, రాజమహేంద్రవరం ఈ స్పీడులో మాలాంటి వాళ్లకు కష్టమే.. ఎక్కడ పడితే అక్కడ జ్యూయలరీ షాపులు వచ్చేశాయి. పెద్ద పట్టణాల్లో కార్పొరేట్ సంస్థల షోరూములు వచ్చేశాయి. అక్కడ అడిగిన వెంటనే కావాల్సిన నగ దొరుకుతోంది. ప్రస్తుతం ప్రజలకు అడిగిన వెంటనే సరకు ఇవ్వాలి. ఒక్క క్షణం కూడా ఓపిక పట్టే తత్వం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎంత బాగా చేసినా ఫలితం ఏముంది? కొద్ది మంది మాత్రం చిన్నచిన్న నగలు చేయించుకోవడానికి నమ్మ కంతో వస్తున్నారు. జగన్ ప్రభుత్వం పుణ్యమాని పెన్షన్ వస్తోంది. – నామగిరి బ్రహ్మానందం, ప్రత్తిపాడు -
నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు..
-
‘కళ’తప్పుతున్న బతుకులు
బోధన్‌రూరల్(బోధన్): జిల్లాలో విశ్వ బ్రాహ్మణుల బతుకులు కళ తప్పుతున్నాయి. ఒకప్పుడు చేతినిండా పనితో గడిపిన విశ్వ బ్రాహ్మణులు నేడు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పెద్దపెద్ద జువెల్లరీ దుకాణాలు, బెంగాలీ కూలీలతో స్వర్ణకారులు ఉపాధిని కోల్పోతుండగా, గుజరాత్, యూపీ, రాజస్థాన్ వ్యాపారుల పోటీతో వండ్రగులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విశ్వబ్రాహ్మణులు కొత్త రాష్ట్రంలోనూ ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంత చారి విశ్వ బ్రాహ్మణుడే. కొత్త రాష్ట్రంలోనైనా తమ బతుకులు బాగు పడడం లేదని వారు వాపోతున్నారు. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఉన్నా.. ప్రభుత్వాలు ఆశించిన మేరకు నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు సమస్త చేతి వృత్తులకు మూల గురువు, విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్యదైవం అయిన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని స్వర్ణకారులు, వండ్రగుల జీవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఉపాధి కోల్పోతున్న వడ్రంగులు.. సొంత ఇంటిని నిర్మించుకునే ప్రతి ఒక్కరికి వండ్రగితో పని ఉంటుంది. ఇంటికి అవసరమైన తలుపులు, కిటికీలు, దర్వాజాలు ఇతర సామగ్రి కోసం వండ్రగులను ఆశ్రయించాల్సిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో రెడీమేడ్ ప్లైవుడ్ షాప్‌లు, కిటికీలు, తలుపులు లభిస్తుండడంతో వడ్రంగులకు గిరాకీ తగ్గింది. అంతేగాక రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహరాష్ట్రల నుంచి వలస వచ్చిన వ్యాపారులు ఇక్కడ రెడీమేడ్ సామగ్రిని అమ్ముతున్నారు. దీంతో వడ్రంగులకు పని లేకుండా పోయింది. అలాగే స్వర్ణకార వృత్తుల వారు సైతం ఉపాధి కోల్పోతున్నారు. రెడీమేడ్ ఆభరణాలు, ప్రైవేట్ రంగ సంస్థలు జువెల్లరీ దుకాణాలు ఏర్పాటు చేయడంతో వీరికి గిరాకీ తగ్గింది. బెంగాలీ కూలీలతో స్థానికులకు ఉపాధి దెబ్బతింటోంది. దీనికి తోడు దొంగ బంగారం కేసులతో స్వర్ణకారుల బతుకులు చిద్రమైపోతున్నాయి. ఉపాధి కరువై ఎందరో విశ్వబ్రాహ్మణులు దినసరి కూలీలుగా, నైట్ వాచ్మెన్లు మారుతున్నారు. చేతి వృత్తులకు గురువు.. సమస్త చేతి వృత్తులకు మూలపురుషుడు శ్రీ విరాట్ విశ్వకర్మ. విష్ణువుకు సుదర్శణ చక్రాన్ని, ఈశ్వరునికి త్రిశులాన్ని, బహ్మకు ఘంటాన్ని, దేవతలకు పుష్పక విమానాన్ని, మహాశక్తికి దివ్యరథాన్ని, దేవేంద్రుడికి అమరావతి నగరాన్ని సృష్టించి ఇచ్చిన మహా పురుషుడు. చేతివృత్తుల మూల గురువు విశ్వకర్మకు, రచనాదేవిలకు జన్మించిన పుట్టిన ఐదుగురు కుమారులు. మను, మయ, త్వష్ఠ, శిల్పి, విశ్వజ్ఞలు. విశ్వకర్మ మొదటి కుమారుడు మను నుంచి వచ్చిన వృత్తి కమ్మరి. రెండో కుమారుడు మయ నుంచి వచ్చిన వృత్తి వండ్రగి. మూడో కుమారుడు త్వష్ఠ నుంచి వచ్చిన వృత్తి కంచరి. నాలుగో కుమారుడు శిల్పి నుంచి వచ్చిన వృత్తి శిల్పకార వృత్తి. ఐదో కుమారుడు విశ్వజ్ఞ నుంచి వచ్చినదే స్వర్ణకార వృత్తి. విశ్వకర్మ ఐదుగురు కుమారుల నుంచి పుట్టినవే నేటి సమాజంలోని చేతి వృత్తులు. విశ్వ బ్రాహ్మణుల సంఘం డిమాండ్లు... విశ్వకర్మలకు ప్రత్యేక పాలక మండలితో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1,000 కోట్లు నిధులు కేటాయించాలి. జీవో నెం.31తో కర్ర వృత్తిదారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈజీవోను ఉపసంహరించుకోవాలి. 50 ఏళ్లు నిండిన వారికి రూ.3వేలు పింఛన్ అందించాలి. జీవో 272 అమలు పరిచి స్వర్ణకారులపై జరిగే అక్రమ రికవరీలను అరికట్టాలి. వృత్తి నైపుణ్యం కోసం ఆధునాతన మిషనరీలపై సబ్సిడీ రుణాలను అందించాలి. పుస్తె, మట్టెలు జ్యూవెల్లరీ షాపులలో అమ్మడాన్ని నిషేధించాలి. బ్యాంకుల్లో అప్రైజర్లుగా స్థానిక స్వర్ణకారులనే తీసుకోవాలి. పింఛన్ అందించాలి ఎన్నో ఏళ్లుగా విశ్వ బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. చేతి వృత్తులకు ఆదరణ కరువై ఉపాధి కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక నిధులు కేటాయించి 50 ఏళ్లు నిండిన విశ్వ బ్రహ్మణులందరికి రూ.3వేలు పింఛన్ అందించాలి. – కస్తురోజు కాళిదాస్ చారి, స్వర్ణ కార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, బోధన్ రూ.1,000 కోట్లు నిధులుకేటాయించాలి విశ్వకర్మలకు ప్రత్యేక పాలక మండలితో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రూ.1,000 కోట్లు నిధులు కేటాయించాలి. విశ్వ బ్రాహ్మణుల చేతి వృత్తులను పోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తి నైపుణ్యం కోసం ఆధునాతన మిషనరీలు అందజేయాలి. ఇందుకుగాను రూ.5లక్షల వరకు సబ్సిడీ రుణాలను అందించాలి. – మారోజు సుధాకర్ చారి, విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, బోధన్ -
స్వర్ణకారుల ఒకరోజు దీక్ష
నకిరేకల్ః తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నకిరేకల్‌లోని మెయిన్ సెంటర్లో స్వర్ణకారులు మంగళవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కేతేపల్లి, నకిరేకల్, కట్టంగూర్, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల స్వర్ణకారులు పాల్గొన్నారు. స్వర్ణకారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వృత్తి నైపుణ్యం కోసం రూ.5లక్షల వరకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు చింతోజు నవీన్‌కుమార్, పానగంటి ఉపేంద్రచారి, ఓంకార చారి, గందసిరి రామకృష్ణ, నరేంద్రచారి ఉన్నారు.