ప్రదర్శనకు వచ్చిన వారితో ‘ఎడిస్టీస్’ టీమ్
బంగారు ఆభరణాలు తయారుచేసే స్వర్ణకారుల జీవితాలు బంగారమయంగా ఉన్నాయా.. ఈ విషయాన్ని నేరుగా తెలుసుకోవడమే కాదు వారికి సాయం చేయాలనే ఆలోచనతో పాతికేళ్ల లోపు యంగ్‌స్టర్స్ స్వచ్ఛందంగా వారిని కలిసి, ఆభరణాలను తయారుచేయించి హైదరాబాద్ తెల్లాపూర్‌లో ప్రదర్శనను ఏర్పాటుచేశారు.
గ్లోబలైజేషన్‌లో భాగంగా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు, కంప్యూటర్ డిజైన్స్ వచ్చాక స్వర్ణకారుల ప్రాభవం మసకబారిపోతోందని, వారి కళను బతికించడం కోసం చేస్తున్న ప్రయత్నమిదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వీరిలో శ్రీహర్షిత, ప్రద్యుమ్న, రిత్విక్, ప్రకృతి, సంస్కృతి, సర్వనా, సాత్విక్, భరణ్య, అజయ్, భగీరథ్ లు ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి వీరితో మాట్లాడినప్పుడు స్వర్ణకారుల కళ, వారి శ్రమకు తగిన ఫలం రాబోయే రోజుల్లో మరింతగా పెరగాలని కోరుకున్నారు.
స్వర్ణకారులు తయారుచేసిన ఆభరణాల ప్రదర్శనకు ముందుండి నడిచిన చాడా శ్రీహర్షిత లా పూర్తి చేసి, తెలంగాణలోని ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’కి లీగల్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తోంది. భరణ్య లా చదువుతోంది. రుత్విక్ డాక్టర్ కాగా స్వాతిక్ లా చేస్తున్నాడు. ప్రకృతి పన్నెండవ తరగతి పూర్తిచేసి సైకాలజీ పట్టా పొందడానికి కృషి చేస్తోంది. ప్రద్యుమ్న, భగీరథ్‌లు బీటెక్ చేస్తున్నారు. ఇక సర్వనా, సంస్కృతి లు స్కూల్ ఏజ్‌లోనే ఉన్నారు.
నేరుగా కలిసి..
తాము చేస్తున్న కార్యక్రమాల గురించి శ్రీహర్షిత మాట్లాడుతూ ‘ఎడిస్టీస్ ఎన్జీవోని కిందటేడాది ప్రారంభించాం. దీని ద్వారా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో మంచి మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తుంటాం. ఇందుకు కర్నూలు వాసి అయిన నర్మదా టీచర్ ప్రెసిడెంట్‌గా ఉండి సరైన సూచనలు ఇస్తుంటారు. స్కూల్ కార్యక్రమాల తక్వాత హస్తకళలకు సాయం చేయాలనే ఆలోచన చేసినప్పుడు స్వర్ణకారుల జీవితాలను చూశాం.
మూడు నెలల క్రితం అనుకున్న ఈ కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టాం’ అని వివరిస్తే.. ‘దాదాపు పాతికమంది స్వర్ణకారుల కుటుంబాలను నేరుగా కలిసి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, ఒక డాక్యుమెంటరీ రూపొందించాం. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులను కలిసి, స్వర్ణకారుల జీవితాల గురించి తెలియజేశాం. మేం ఏ కార్యక్రమం చేసినా, అందులో ప్రతీసారి కొత్తవారు సభ్యులు అవుతూ ఉంటారు. దీంతో మరికొందరికి సాయం చేయాలన్న ఆలోచన కూడా పెరుగుతోంది’ అని వివరించింది భరణ్య.
శ్రమ ఎక్కువ.. ఆదాయం తక్కువ
‘హైదరాబాద్‌లోని కళాకారులనే కలుసుకున్నాం. వీరిలో స్థానిక కళాకారులే కాదు కలకత్తా, గుజరాత్.. వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారున్నారు. స్వర్ణకారుల షాప్‌లో ఒకరు మాస్టర్‌గా ఉంటారు. వారికి తప్ప మిగతా అందరికీ చాలా తక్కువ ఆదాయం ఉంటుంది. దీంతో కుటుంబాలు పోషించుకోలేని స్థితిలో ఉన్నవారిని చూశాం. జ్యువెలరీ అంటే లగ్జరీ గూడ్ అని మనకు తెలుసు. వీటిని తయారుచేసేవారి దగ్గర కూడా బాగా డబ్బు ఉంటుంది అనుకుంటాం.
కానీ, వాళ్ల దగ్గర ఏమీ ఉండటం లేదు. ఈ కారణంగా వారి పిల్లలు కనీస చదువులు కూడా కొనసాగించలేకపోతున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో 25 మంది కళాకారులు పాల్గొన్నారు. సందర్శకులు వారి ఆభరణాలు కొనుగోలు చేసి, స్వర్ణకారులకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ కుటుంబాలకు మేం ఇలా సాయంగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది’ అని వివరించారు ఈ యంగ్‌స్టర్స్.
మన హస్తకళలన్నీ ముందు తరాలలోనూ సుసంపన్నంగా వెలగాలి. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జనంలోకి వెళుతూ ఉంటే స్వర్ణకళాకారుల భవిత కూడా బంగారమే అవుతుంది.
కళను గుర్తించండి...
ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఎంత కష్టపడినా ఒక్కోరోజు నాలుగైదు వందలు కూడా రావు. బంగారాన్ని కాల్చి, తీగ తీసి, అత్యంత శ్రద్ధతో ఒక ఆభరణాన్ని తయారు చేయాలంటే ఎంతో టైమ్ పడుతుంది. ఇప్పుడంతా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకే వెళుతున్నారు. మా దగ్గర ఆభరణాలు చేయించుకునేవారు బాగా తగ్గిపోయారు. ప్రస్తుతం మేం ఆర్థికంగానే కాదు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం. రాబోయే తరాలకు ఈ పని అందించే ధైర్యం చేయలేకపోతున్నాం. మా పిల్లలను వేరే పనులు చూసుకోమని చెబతున్నాం. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రముఖులు మా పనిని గుర్తిస్తే ఈ కళ బతుకుతుంది.
– గోవింద్, స్వర్ణకారుడు
ప్రత్యేకమైనది
ఏ పని అయినా ఒకసారి చేసి వదిలేయడం వల్ల సరైన ఫలితాలు రావు. ఈ విషయం స్వర్ణకారులను కలిసినప్పుడు మరింతగా అర్ధమైంది. నిరంతరం సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఎంచుకున్న కార్యక్రమం ఇది. దీనికి చాలా మంది ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఈ ఆలోచన ప్రత్యేకంగా ఉందని అభినందించారు.
– శ్రీహర్షిత
సాయపడదాం
జ్యువెలరీ షాపులు వచ్చాక స్వర్ణకారుల కళానైపుణ్యం ప్రశ్నార్ధకంగానే మారింది. కోవిడ్ తర్వాత వీరి ఇబ్బందులు మరీ పెరిగాయి. కంటిచూపు, గంటలు గంటలు కూర్చొని పని చేయడం వల్ల బ్యాక్‌పెయిన్‌తో సఫర్ అవుతున్నారు. ఈ విధంగా వారికి సాయం పడటం సంతోషాన్నిచ్చింది.
– ప్రకృతి
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment