handcraft
-
ఆధునికత, హస్తకళా నైపుణ్యం మేళవింపుతో గౌరాంగ్ హోం ‘నీల్’ కలెక్షన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేశారు. జాతీయ అవార్డు ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా, సాంప్రదాయ భారతీయ వస్త్రాలు , హస్తకళలు, జమ్దానీ కళను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా "గౌరంగ్ హోమ్"లోని "నీల్" పేరుతో తొలి కలెక్షన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫర్నిచర్, ఫర్నీషింగ్లు , పింగాణీ వస్తువులు ప్రదర్శనకుంటాయి. నాణ్యత, టైమ్‌లెస్ డిజైన్‌కు ప్రాధాన్యతినిస్తూ, సాంప్రదాయ హస్తకళ లేటెస్ట్ ట్రెండ్ మిళితమై ఈ వస్తువులు కొలువు దీరతాయి."గౌరంగ్ హోమ్" ద్వారా ఇంటీరియర్ డిజైన్ సేవల్లోకి ప్రవేశిస్తూ, కాన్సెప్ట్-టు-ఫినిష్ స్టైల్లో ఇంటిని అందంగా తీర్చిదిద్దు కోవడంలో పాపులర్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో “గౌరంగ్ హోమ్” కలెక్షన్ ఎగ్జిబిషన్ అక్టోబరు 4న ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు అందుబాటులో ఉంటుంది.'నీల్' కలెక్షన్లోని ప్రతి భాగం ఆ కళ గురించి మాత్రమే కాకుండా, దానిని తయారు చేసిన శిల్పి నైపుణ్యాన్ని తెలిపుతూ,ఈ కలెక్షన్ మీ ఇంటిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది అంటారు గౌరాంగ్. ఇండియన్ ఇంటీరియర్స్ కోసం ఇదొక కొత్త అధ్యాయమన్నారు. నీల్ కలెక్షన్స్‌లో ఫర్నిషింగ్స్, బెడ్‌స్ప్రెడ్‌లు, కంఫర్టర్లు, దిండు కవర్లు , టేబుల్ లినైన్స్ సిగ్నేచర్ స్టైల్లో ఉంటాయి. ఇందులో జమ్దానీ నేత, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాన్, కసౌటి, సుజినీ కళాత్మకతతో ఇండిగో (నీలిరంగు)కలర్లో ఆకట్టుకుంటాయి.అందానికి, ఆరోగ్యానికి తగినట్టుగా శతాబ్దాల రాగి ,తగరంతో తయారు చేసిన శతాబ్దాల నాటి వస్తువలను సిరామిక్‌తో తయారు చేసిన క్రోకరి మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇందులో పురాతన కుండల వినియోగానికి ప్రతీకగా, చేతితో తయారు చేసిన డిన్నర్వేర్ ఉంటుంది. ప్రతీ వస్తువును ప్రపంచవ్యాప్తంగా లభించే మట్టితో తయారు చేయడం విశేషం.ఈ వెంచర్ ద్వారా, తన ప్రసిద్ధ డిజైన్ ఫిలాసఫీని జీవితానికి తీసుకురావాలనేదే గౌరంగ్ లక్ష్యం. భారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించడం, పర్యావరణ అనుకూల పదార్థాలు, సహజ రంగులు, సాంప్రదాయ పద్ధతులు,కళాకారుల నైపుణ్యాన్ని మెచ్చుకునేలా పర్యావరణ స్పృహ ఉన్న ఔత్సాహిక గృహాలంకరణ వినియోగదారులను ఆకట్టుకోనుంది. -
Pratima Raparthi: ధోతీ కట్టు.. మూడు రంగుల్లో ముగ్గు!
హస్త కళలపై ఇష్టంతో చిత్రలేఖనం, బ్లాక్ప్రింటింగ్ నేర్చుకుంది. చదివింది ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్. చేనేతకారులకు అండగా ఉండాలని చర్ఖా సంస్థను ప్రారంభిం చింది. మువ్వన్నెల జెండా రంగులు... మధ్యన మన సంస్కృతికి చిహ్నమైన ముగ్గును చిత్రించి, చేనేత వస్త్రంతో కండువాను డిజైన్ చేసింది. పేటెంట్ హక్కునూ పొందింది. తన హ్యాండ్లూమ్ చీరలను ధోతీ కట్టులా డిజైన్ చేసి, వాటినే తన రోజువారీ డ్రెస్‌గా మార్చుకుంది. సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉంటున్న ప్రతిమ రాపర్తి తన వార్డ్రోబ్ను సరికొత్తగా మార్చుకుంది.‘ప్రపంచానికి కాటన్ దుస్తులను మన దేశమే పరిచయం చేసింది. మనదైన సంస్కృతిని మనమే పరిచయం చేసుకోవాలి. అలాగే మనల్ని అందరూ గుర్తించాలి. ఈ ఆలోచనే చేనేతలకు దగ్గరగా ఉండేలా చేసింది. 2018లో ‘చర్ఖా’ పేరుతో చేనేతలకు మద్దతుగా నిలవాలని సంస్థను ప్రారంభించాను.ట్రై కలర్స్‌లో ముగ్గు..స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ట్రై కలర్స్ డ్రెస్ ధరించి వెళ్లడానికి చాలా కష్టపడేదాన్ని. ఆరెంజ్, బ్లూ, గ్రీన్ కలర్స్ ఉండేలా డ్రెస్సింగ్ చేసుకునేదాన్ని. అలా కాకుండా ఆ రోజుకి ఏదైనా ప్రత్యేకమైన యునిఫామ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. చేనేత క్లాత్‌ను ఎంపిక చేసుకొని, అంచుగా వాటికి నేచురల్ కలర్స్‌ని జత చేశాను. మూడు రంగుల మధ్యలో ఉండే ధర్మచక్ర మన అడ్మినిస్ట్రేషన్‌కి, విజ్డమ్కి ప్రతీక. ధర్మచక్రను మన డ్రెస్సుల్లో వాడకూడదని, దాని బదులుగా ముగ్గు డిజైన్ చేశాను. ముగ్గు అనేది మన సంస్కృతికి, స్త్రీల కళా హృదయానికి ప్రతీక.25 చుక్కలు..మధ్య చుక్క ఈ డ్రెస్ ఎవరు ధరిస్తారో వారికి ప్రతీక. మిగతా 24 చుక్కలు మన పూర్వీకులు, కాలానికి ప్రతీకగా అనుకోవచ్చు. అలాగే, ఆ చుక్కలన్నీ కలుపుతూ వెళితే మన సమాజ వృద్ధికి, రాబోయే తరానికి సూచికగానూ ఉంటాయి. ఈ డిజైన్ని కండువా, శారీ, ధోతీ, ఘాఘ్రా చోళీకి తీసుకున్నాను. దీనికి పేటెంట్ రైట్ కూడా తీసుకున్నాను. ఈ డిజైన్ కండువాను ఎవరైనా ధరించవచ్చు.చేనేత చీరలతో ధోతీ కట్టు..నా దగ్గర ఎక్కువగా ఉన్న హ్యాండ్లూమ్ చీరలని ప్రత్యేక కట్టుగా మార్చుకోవాలనుకున్నాను. సౌకర్యంగా ఉండేలా చీరలను ధోతీగా కన్వర్ట్ చేసుకున్నాను. సెల్, మనీ, కార్డ్స్ పెట్టుకోవడానికి ఈ ధోతీకి పాకెట్స్ కూడా ఉంటాయి. పూర్వం రోజుల్లో గోచీకట్టు చీరలను వాడేవారు. ఆ డిజైన్ ప్రతిఫలించేలా నాకు నేను కొత్తగా డిజైన్ చేసుకున్న డ్రెస్సులివి. టూర్లకు, బయటకు ఎక్కడకు వెళ్లినా ఇలాంటి డ్రెస్‌తోనే వెళతాను. నాకు నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను. వీవర్స్, టైలర్స్, బ్లాక్‌ప్రింట్, హ్యాండ్‌క్రాఫ్ట్స్ వారితో కలిసి వర్క్ చేస్తాను. ఇకో ఫ్రెండ్లీ హ్యాండీ క్రాఫ్ట్, టైలరింగ్, పెయింటింగ్... వంటివి గృహిణులకు నేర్పిస్తుంటాను’’ అని వివరించారు ప్రతిమ. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు!
ఆ ఏడేళ్ల కుర్రాడు పాము కాటుకు గురయ్యాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. కుమారుడు మరణించాడన్న బాధలో ఉన్న అతని తండ్రికి ఊహించని విధంగా మరో సమస్య ఎదురయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనంతరం ఆ బాలుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో లేదు. మరోమార్గం లేక మృతుని కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని తోపుడు బండిపై పెట్టి, రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో పెద్దసంఖ్యలో జనం ఆ తోపుడుబండిని అనుసరిస్తూ వచ్చారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినా అధికారులు ఈ ఉదంతంపై స్పందించక పోవడం విచారకరం. సాహిల్ శరీరంలో కదలిక? విజయ్‌పూర్‌కు చెందిన ఏడేళ్ల సాహిల్ ఖాన్‌ను పాము కాటువేసింది. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించాగా, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రాత్రంతా పోస్టుమార్టం హౌస్‌లో ఉంచారు. మర్నాడు సాహిల్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. వారికి సాహిల్ శరీరంలో కదలిక కనిపించింది. దీంతో వారు వైద్యులకు ఈ విషయాన్ని చెప్పారు. వారు పరీక్షించి, బాలుడు మృతిచెందాడని నిర్థారించారు. తరువాత వైద్యులు ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని కుటుంబ సభ్యులు అంబులెన్స్ కోసం చాలాసేపు ఎదురు చూశారు. సంబంధిత అధికారులకు ఈ విషయం గురించి చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేమీలేక నాలుగు చక్రాల తోపుడు బండిపై బాలుని మృతదేహాన్ని ఉంచి, ఇంటికి తరలించారు. ఈ పరిస్థితిని చూసిన స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. తరువాత మృతునికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: భర్త చంకలో పిల్లాడు.. భార్య చేతిలో సైకిల్.. డెలివరీబాయ్ ఫ్యామిలీ వీడియో వైరల్! -
Rutvi Chaudhary: స్త్రీల సారథ్యంలో స్త్రీలు నేసే తివాచీలు
ఒక చదరపు అంగుళం తివాచీ అల్లాలంటే 197 దారపు ముడులు వేయాలి. ఓపికతో నిండిన ఈ పనిని స్త్రీలే నేర్చుకున్నారు. ‘జైపూర్ రగ్స్’ ఇవాళ 40 వేల మంది నేత కార్మికులతో రగ్గులు తయారు చేయిస్తుంటే వారిలో 30 వేల మంది స్త్రీలే ఉన్నారు. కోడలుగా ఆ ఇంట అడుగుపెట్టిన రుత్వి చౌదరి ఈ సంస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ‘ఇంట అడుగు పెట్టిన కోడలికి ఇంటి సభ్యుల కన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇంటి ఘనతను కోడలు నిలబెట్టగలదా లేదా అందరూ గమనిస్తారు. మా మామగారు ఎన్.కె.చౌదరి మొదలెట్టిన జైపూర్ రగ్స్ సంస్థలో డైరెక్టర్‌గా అడుగు పెడుతున్నప్పుడు అదేం సామాన్యమైన బాధ్యతని అనిపించలేదు. కాని సాధించగలననే అనుకున్నాను’ అంటుంది రుత్వి చౌదరి. ఆడపడుచులు ఆశ, అర్చనలు అమెరికాలో జైపూర్ రగ్స్ సంస్థను నడుపుతుంటే మన దేశంలో భర్త యోగేష్ చౌదరితో కలిసి సంస్థను ముందుకు తీసుకెళుతోంది రుత్వి చౌదరి. ‘నేను మొదటగా చెప్పాలనుకుంటున్నది ఏమంటే మాది విమెన్ సెంట్రిక్ ఆర్గనైజేషన్. మా సంస్థలో ప్రధాన బాధ్యతలన్నీ స్త్రీలే నిర్వహిస్తారు. మా దగ్గర అల్లే ప్రతి తివాచీ స్త్రీ తన బిడ్డను సింగారించినట్టే ఉంటుంది. చేతి అల్లికతో తయారయ్యే తివాచీలు ఇవి’ అంటుందామె. ► తొమ్మిది మందితో మొదలయ్యి రుత్వి చౌదరి మామగారు ఎన్.కె.చౌదరి 1978లో కేవలం ఇద్దరు నేతగాళ్లతో, రెండు మగ్గాలతో, ఐదు వేల రూపాయల పెట్టుబడితో జైపూర్ రగ్స్ను స్థాపించాడు. చాలా కాలం వరకు ఇది కేవలం విదేశాలకే రగ్గులు పంపేది. 2006లో కొడుకు యోగేష్ చౌదరి పగ్గాలు స్వీకరించాక దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రుత్వి చౌదరి వచ్చాక సంప్రదాయిక డిజైన్లకు డిజైనర్ల సృజన జత చేయడంతో కొత్త తరాన్ని ఆకట్టుకునేలా ఇవి తయారవుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల్లో 600 గ్రామాల్లో దాదాపు 30 వేల మంది మహిళా నేత కార్మికులు తివాచీలు తయారు చేస్తారు. రాజస్తాన్లాంటి చోట దేశీయ తివాచీ డిజైన్లు అద్భుతంగా ఉంటాయి. కాని చాలామటుకు మూసగా కనిపిస్తాయి. నేను ఈ సాంప్రదాయికతను చెడగొట్టదలుచుకోలేదు. కాని డిజైనర్ల సృజన జత చేయాలనుకున్నాను. హిరేన్ పటేల్, ఆషిష్ షా, శాంతను గార్గ్లాంటి వాళ్ల చేత కొత్త డిజైన్లు, పాట్రన్లు ఈ దేశవాళి డిజైన్లకు జత చేశాను. మా మహిళా నేతగత్తెలు వాటిని వెంటనే అందుకున్నారు. ఈ కాలపు యూత్‌ను కూడా ఆకర్షించేలా తయారు చేశారు’ అంది రుత్వి. ► స్త్రీలకు దక్కిన మర్యాద ‘తివాచీ ఇంటిని దగ్గరగా కూడేలా చేస్తుందంటారు పర్షియన్లు. ఆ సంగతి ఏమో కాని వేల మంది స్త్రీలను మేము ఒక కుటుంబంగా చేయగలిగాము. రాజస్థాన్‌లో తివాచీల నేత వల్ల స్త్రీలకు గౌరవం పెరిగింది. అన్నింటి కంటే ముఖ్యం వలసలు ఎంతో తగ్గాయి. భార్య సంపాదిస్తూ ఉండటంతో భర్త కూడా బుద్ధిగా పని చేయడం మొదలెట్టాడు. ఈ అన్ని కారణాల వల్ల మా నేతమ్మలు మా సంస్థను ఎంతో ప్రేమిస్తారు. మేము కూడా వారిని ఎక్కువ విసిగించం. మెటీరియల్ ఇచ్చి సరుకును బదులుగా తీసుకుంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్. వారికి వీలున్నప్పుడే పని చేయొచ్చు. అంతర్గతంగా ఏదైనా సమస్య వస్తే చర్చించుకోవడానికి పరిష్కరించుకోవడానికి ‘తనా–బనా’ అనే సొంత యాప్ ఉంది. అందులో సత్వర పరిష్కారాలు చెబుతాం’ అంటుంది రుత్వి. ► జర్మనీలో అవార్డ్ జైపూర్ రగ్స్ సంస్థ తాను ఇచ్చే డిజైన్లనే కాక మహిళలను వారి మనసుకు నచ్చిన డిజైన్లతో వినూత్నమైన తివాచీలను అల్లే వీలు కల్పిస్తుంది. వీటిని ‘మన్చాహా’ తివాచీలు అంటారు. ఇలాంటి తివాచీలకు ఎక్కువ సమయం (కొత్త డిజైన్ ఆలోచించాలి కనుక) పడుతుంది కాబట్టి ఎక్కువ మంది ట్రై చేయరు. కాని ప్రతిభ ఉన్న మహిళలు పాశ్చాత్యులను సైతం అబ్బుర పడేలా డిజైన్లు చేస్తారు. వీటి ధర కూడా ఎక్కువే ఉంటుంది. 2018లో బిమలా దేవి అనే నేతమ్మ అల్లిన తివాచీకి ఫ్రాంక్‌ఫర్ట్‌లో ‘జెర్మన్ డిజైన్ అవార్డ్’ దక్కింది. ‘మన వారి ప్రతిభను అలా ప్రపంచ దేశాలకు చాటుతున్నాం. మా మహిళలు తయారు చేస్తున్న తివాచీలు ఇప్పుడు 80 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి’ అని తెలిపింది రుత్వి. ఈ సంస్థలో ఒకసారి కొంతమంది స్త్రీలు 30 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పు తివాచీని అల్లారు. దీని కోసం కోటీ 40 లక్షల దారపు ముడులను వేయాల్సి వచ్చింది. ‘మేము తయారు చేసిన వాటిలో అది అత్యంత ఖరీదైనది. దానిని సౌది రాజుకు అమ్మాం’ అని తెలిపింది రుత్వి. ‘దళారులను తొలగించి వారి కమీషన్ కూడా స్త్రీలకే అప్పజెప్పడం వల్ల వారూ మేమూ సంతృప్తిగా ఉన్నాం’ అని ముగించిందామె. -
బంగారంలాంటి ఆలోచన
బంగారు ఆభరణాలు తయారుచేసే స్వర్ణకారుల జీవితాలు బంగారమయంగా ఉన్నాయా.. ఈ విషయాన్ని నేరుగా తెలుసుకోవడమే కాదు వారికి సాయం చేయాలనే ఆలోచనతో పాతికేళ్ల లోపు యంగ్‌స్టర్స్ స్వచ్ఛందంగా వారిని కలిసి, ఆభరణాలను తయారుచేయించి హైదరాబాద్ తెల్లాపూర్‌లో ప్రదర్శనను ఏర్పాటుచేశారు. గ్లోబలైజేషన్లో భాగంగా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు, కంప్యూటర్ డిజైన్స్ వచ్చాక స్వర్ణకారుల ప్రాభవం మసకబారిపోతోందని, వారి కళను బతికించడం కోసం చేస్తున్న ప్రయత్నమిదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. వీరిలో శ్రీహర్షిత, ప్రద్యుమ్న, రిత్విక్, ప్రకృతి, సంస్కృతి, సర్వనా, సాత్విక్, భరణ్య, అజయ్, భగీరథ్ లు ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి వీరితో మాట్లాడినప్పుడు స్వర్ణకారుల కళ, వారి శ్రమకు తగిన ఫలం రాబోయే రోజుల్లో మరింతగా పెరగాలని కోరుకున్నారు. స్వర్ణకారులు తయారుచేసిన ఆభరణాల ప్రదర్శనకు ముందుండి నడిచిన చాడా శ్రీహర్షిత లా పూర్తి చేసి, తెలంగాణలోని ‘బచ్పన్ బచావో ఆందోళన్’కి లీగల్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తోంది. భరణ్య లా చదువుతోంది. రుత్విక్ డాక్టర్ కాగా స్వాతిక్ లా చేస్తున్నాడు. ప్రకృతి పన్నెండవ తరగతి పూర్తిచేసి సైకాలజీ పట్టా పొందడానికి కృషి చేస్తోంది. ప్రద్యుమ్న, భగీరథ్లు బీటెక్ చేస్తున్నారు. ఇక సర్వనా, సంస్కృతి లు స్కూల్ ఏజ్‌లోనే ఉన్నారు. నేరుగా కలిసి.. తాము చేస్తున్న కార్యక్రమాల గురించి శ్రీహర్షిత మాట్లాడుతూ ‘ఎడిస్టీస్ ఎన్జీవోని కిందటేడాది ప్రారంభించాం. దీని ద్వారా ప్రభుత్వ స్కూల్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో మంచి మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తుంటాం. ఇందుకు కర్నూలు వాసి అయిన నర్మదా టీచర్ ప్రెసిడెంట్‌గా ఉండి సరైన సూచనలు ఇస్తుంటారు. స్కూల్ కార్యక్రమాల తక్వాత హస్తకళలకు సాయం చేయాలనే ఆలోచన చేసినప్పుడు స్వర్ణకారుల జీవితాలను చూశాం. మూడు నెలల క్రితం అనుకున్న ఈ కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టాం’ అని వివరిస్తే.. ‘దాదాపు పాతికమంది స్వర్ణకారుల కుటుంబాలను నేరుగా కలిసి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, ఒక డాక్యుమెంటరీ రూపొందించాం. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులను కలిసి, స్వర్ణకారుల జీవితాల గురించి తెలియజేశాం. మేం ఏ కార్యక్రమం చేసినా, అందులో ప్రతీసారి కొత్తవారు సభ్యులు అవుతూ ఉంటారు. దీంతో మరికొందరికి సాయం చేయాలన్న ఆలోచన కూడా పెరుగుతోంది’ అని వివరించింది భరణ్య. శ్రమ ఎక్కువ.. ఆదాయం తక్కువ ‘హైదరాబాద్‌లోని కళాకారులనే కలుసుకున్నాం. వీరిలో స్థానిక కళాకారులే కాదు కలకత్తా, గుజరాత్.. వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారున్నారు. స్వర్ణకారుల షాప్‌లో ఒకరు మాస్టర్‌గా ఉంటారు. వారికి తప్ప మిగతా అందరికీ చాలా తక్కువ ఆదాయం ఉంటుంది. దీంతో కుటుంబాలు పోషించుకోలేని స్థితిలో ఉన్నవారిని చూశాం. జ్యువెలరీ అంటే లగ్జరీ గూడ్ అని మనకు తెలుసు. వీటిని తయారుచేసేవారి దగ్గర కూడా బాగా డబ్బు ఉంటుంది అనుకుంటాం. కానీ, వాళ్ల దగ్గర ఏమీ ఉండటం లేదు. ఈ కారణంగా వారి పిల్లలు కనీస చదువులు కూడా కొనసాగించలేకపోతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో 25 మంది కళాకారులు పాల్గొన్నారు. సందర్శకులు వారి ఆభరణాలు కొనుగోలు చేసి, స్వర్ణకారులకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ కుటుంబాలకు మేం ఇలా సాయంగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది’ అని వివరించారు ఈ యంగ్‌స్టర్స్. మన హస్తకళలన్నీ ముందు తరాలలోనూ సుసంపన్నంగా వెలగాలి. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జనంలోకి వెళుతూ ఉంటే స్వర్ణకళాకారుల భవిత కూడా బంగారమే అవుతుంది. కళను గుర్తించండి... ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఎంత కష్టపడినా ఒక్కోరోజు నాలుగైదు వందలు కూడా రావు. బంగారాన్ని కాల్చి, తీగ తీసి, అత్యంత శ్రద్ధతో ఒక ఆభరణాన్ని తయారు చేయాలంటే ఎంతో టైమ్ పడుతుంది. ఇప్పుడంతా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకే వెళుతున్నారు. మా దగ్గర ఆభరణాలు చేయించుకునేవారు బాగా తగ్గిపోయారు. ప్రస్తుతం మేం ఆర్థికంగానే కాదు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం. రాబోయే తరాలకు ఈ పని అందించే ధైర్యం చేయలేకపోతున్నాం. మా పిల్లలను వేరే పనులు చూసుకోమని చెబతున్నాం. ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రముఖులు మా పనిని గుర్తిస్తే ఈ కళ బతుకుతుంది. – గోవింద్, స్వర్ణకారుడు ప్రత్యేకమైనది ఏ పని అయినా ఒకసారి చేసి వదిలేయడం వల్ల సరైన ఫలితాలు రావు. ఈ విషయం స్వర్ణకారులను కలిసినప్పుడు మరింతగా అర్ధమైంది. నిరంతరం సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఎంచుకున్న కార్యక్రమం ఇది. దీనికి చాలా మంది ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఈ ఆలోచన ప్రత్యేకంగా ఉందని అభినందించారు. – శ్రీహర్షిత సాయపడదాం జ్యువెలరీ షాపులు వచ్చాక స్వర్ణకారుల కళానైపుణ్యం ప్రశ్నార్ధకంగానే మారింది. కోవిడ్ తర్వాత వీరి ఇబ్బందులు మరీ పెరిగాయి. కంటిచూపు, గంటలు గంటలు కూర్చొని పని చేయడం వల్ల బ్యాక్పెయిన్తో సఫర్ అవుతున్నారు. ఈ విధంగా వారికి సాయం పడటం సంతోషాన్నిచ్చింది. – ప్రకృతి – నిర్మలారెడ్డి -
హస్తకళా వైభవం.. చెక్క కళ భళా!
ఉదయగిరి(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): రాచరిక సామ్రాజ్య కేంద్రంగా విరాజిల్లిన ఉదయగిరిలో ఇప్పుడు ఆ ప్రాభవ వైభవం కనిపించకపోయినా హస్తకళా వైభవానికి కొదువ లేదు. చెక్కపై చెక్కిన కళాత్మక వస్తువులు తయారు చేస్తున్న ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. ఉదయగిరి దిలావర్‌భాయి వీధిలోని హస్తకళల అభివృద్ధి కేంద్రంగా తయారయ్యే వస్తువులకు ఖండాంతర ఖ్యాతి ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తకళ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 150 కుటుంబాలకు జీవనోపాధి చెక్క నగిషీ వస్తువుల తయారీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందిస్తుండడంతో ప్రస్తుతం 150 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వందేళ్లకు పూర్వం ఒకట్రెండు కుటుంబాలు ఈ కళారంగాన్ని నమ్ముకుని జీవనాన్ని సాగించాయి. ఉదయగిరి హస్తకళల కేంద్రంతో తయారయ్యే వివిధ రకాల వస్తువులకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు పొందింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన చేతివృత్తుల ఎగ్జిబిషన్లో ఉదయగిరి కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి అబ్బురపడి ప్రశంసలు అందించారు. కళకు ప్రాణం పోసిన అబ్దుల్‌బషీర్ తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్న షేక్ అబ్దుల్‌బషీర్ తన 24వ ఏట ఈ వృత్తిలోకి ప్రవేశించి వివిధ రకాల వస్తువులను తయారు చేయం ప్రారంభించారు. దీనిపై ఇతరులు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో తన ఇద్దరు కుమార్తెలు గౌసియాబేగం, ఫాయిదాలకు నేర్పించారు. 2003లో 15 మంది సభ్యులు సంఘంగా ఏర్పడి చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉడెన్ కట్టరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. దీనికి హ్యాండ్‌క్రాఫ్ట్స్ మినిస్టరీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆర్థిక సాయం అందించారు. ప్రశంసల జల్లులు ఈ కళకు ఊపిరిపోసిన అబ్దుల్బషీర్కు లేపాక్షి, హస్తకళల అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంసా పత్రంతో పాటు బహుమతులు అందజేశారు. ఆయన కూతురు షేక్ గౌసియాబేగంకు కూడా ఇదే సంస్థ ఆమె ప్రతిభను గుర్తించి వివిధ బహుమతులు అందించారు. తాజాగా కేంద్రం నిర్వాహకురాలు షేక్ గౌసియాబేగంకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.20 లక్షల నిధులు మంజూరు చేసింది. 200 రకాలు పైగా వస్తువుల తయారీ ఉదయగిరి దుర్గం, కొండ ప్రాంతాల్లో లభించే లద్ది, బిల్లనద్ది, కలువ, బిక్కి, దేవదారు తదితర అటవీ కర్రను ఉపయోగించి ఈ వస్తువులు తయారు చేస్తారు. ఈ కొయ్య ద్వారా స్పూన్లు, ఫోర్కులు, అట్లకర్ర, గరిటెలు, డైనింగ్ టేబుల్స్, ఫొటో ఫ్రేమ్స్, పిల్లలు ఆడుకునే వివిధ రకాల వస్తువులు, వివిధ వస్తువులు నిల్వ చేసుకునేందుకు ఉపయోగించే ట్రేలు, చిన్న గిన్నెలు, ప్లేట్లు, దువ్వెనలు తదితర 200 రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. ఈ వృత్తిలో ముస్లిం మహిళలే అత్యధికంగా ఉండడంతో ప్రస్తుతం ఉన్న కేంద్రం ప్రాంగణంలోనే కొత్త భవనం ఏర్పాటు చేసి ఆధునిక మెషిన్లు సమకూర్చాలి. తద్వారా ఎక్కువ మంది ఈ వృత్తిలోకి ప్రవేశించి తమ ఆదాయం పెంచుకునే వీలుంటుంది. – షేక్ గౌసియా బేగం -
స్వదేశీ వస్తువులకు విదేశాల్లో డిమాండ్
పెదవేగి : చేతివృత్తుల ద్వారా దేశంలో తయారైన వస్తువులకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని టెక్స్టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీ తెలిపారు. పెదవేగి మండలం పెదవేగిలో ఎస్ఎంసీ పాఠశాలలో విద్యార్థులకు చేతి వృత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో తయారైన చేతివృత్తుల వస్తువులకు ఇతర దేశాలలో మంచి గిరాకీ ఉందని, చేతివృత్తుల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలని అన్నారు. విద్యార్థులు వస్తువుల తయారీపై శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జి మాణిక్యాలరావు, ఎస్ఎంసీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుక్క అవినాష్ రాజు, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రామన్న, పాఠశాల హెచ్ ఎం ఉషారాణి పాల్గొన్నారు. -
చేతి వృత్తికి చేయూత
రామభద్రపురం: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. చేతివృత్తులను ప్రోత్సహించేందుకు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఏటా చేతి వృత్తిదారులకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా అయితే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసిందో.. అదే విధంగా అర్హులైన పేద చేతివృత్తిదారులకు కూడా అందివ్వాలని నిర్ణయించింది. లాండ్రీ, బంగారు ఆభరణాలు తయారు చేసే షాపులు, సెలూన్లు, చేనేత కార్మికులకు ఈ అవకాశం కల్పించింది. కరెంట్ బిల్లు, ఆధార్ కార్డు జెరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్ కార్డు జెరాక్స్, మొబైల్ నంబర్, అద్దెకు ఉంటున్నట్లైతే యజమాని ఆధార్ కార్డు జెరాక్స్, మొబైల్ నంబర్ వంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రాయితీ విద్యుత్ ఇలా... లాండ్రీ షాపులకు 150 యూనిట్ల వరకూ, బంగారు ఆభరణాలు తయారు చేసే షాపులకు 100 యూనిట్ల వరకూ, సెలూన్ షాపులులకు 150 యూనిట్ల వరకూ, బట్టలు నేసే చేనేతలకు 100 యూనిట్ల వరకూ ఉచితంగా అందించనుంది. జిల్లాలో ఈ వృత్తిపై ఆధారపడిన దాదాపు 25 వేల మందికి లబ్ధి కలగనుంది. చేతి వృత్తిదారులకు ఊరట.. కరోనా కష్టకాలంలో పనులు లేక అల్లాడుతున్న ఎంతోమందికి ఈ ఉచిత విద్యుత్ ఆదుకోనుంది. జిల్లాలో అత్యధిక బీసీలు చేతి వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గతేడాది కోవిడ్ ఆంక్షలతో వృత్తి సజావుగా సాగక అనేక ఇబ్బందులు పడ్డారు. మళ్లీ సెకండ్ వేవ్‌తో మరింత కుంగిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించడంతో వారందరికీ ఊరట లభించనుంది. ముఖ్యమంత్రి వై,ఎస్.జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో గతేడాది రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిపొందారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు... సెలూన్లు, లాండ్రీ, దోబీ ఘాట్లు ఇలా చేతి వృత్తిదారులకు ఉచిత విద్యుత్ అందివ్వడం అభినందనీయం. ఇప్పటికే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – కల్లూరు త్రినాథరావు, చేనేత కార్మికల సంఘం చైర్మన్, కొట్టక్కి తండ్రి హామీ నెరవేరుస్తున్న తనయుడు దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సెలూన్ దుకాణాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తానని చెప్పారు. దీనిపై అప్పట్లో దుకాణాల సర్వే కూడా చేయించారు. దురదృష్ట వశాత్తూ తాయన మరణించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చుతున్నారు. – చీపురుపల్లి శ్రీను, మండల నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, రామభద్రపురం బంగారు పనిచేస్తున్న కళాకారుడు సద్వినియోగం చేసుకోవాలి విద్యుత్ సదుపాయంతో దుకాణాలు నిర్వహించే సెలూన్లు, లాండ్రి, బంగారం పని చేసే దుకాణాలు, మగ్గం పనిచేసేవారికి ప్రభుత్వం విద్యుత్ రాయితీలు కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. అర్హులైన లబ్ధిదారులు మండల విద్యుత్ సెక్షన్ కార్యాలయానికి వెళ్లి ఆయా ఏఈల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. – వై.విష్ణు, ఎస్ఈ, విద్యుత్ శాఖ -
28 ఏళ్ల శ్రమ: ఇది ఆడవాళ్ల ప్రపంచం
‘ఇది మగవాళ్ల సామ్రాజ్యం’ అనే కనిపించని సరిహద్దు రేఖ ఒకటి ఉంటూనే ఉంటుంది. ఆ సరిహద్దు రేఖను చెరిపి వేయడానికి ఆడవాళ్లు నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు. ఇప్పుడు... చేనేత మహిళలు మగ్గం సాక్షిగా ఇది ఆడవాళ్ల ప్రపంచం కూడా అని నిరూపిస్తున్నారు. అయితే... వాళ్లు చేస్తున్నది రికార్డు కోసం కాదు... పురస్కారాల కోసమూ కాదు. దారం మెడకు ఉరితాడవుతున్న మగవాళ్లు ఇతర రంగాలను వెతుక్కుంటున్నారు. ఆ... కష్టకాలంలో మహిళలు మగ్గాన్ని అందుకున్నారు.. దారంతో జీవితాలను అల్లుకుంటున్నారు. అది హైదరాబాద్ నగరం బంజారాహిల్స్‌లోని సీసీటీ (క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ) భవనం. అందులో ఒక మహిళ మగ్గం మీద జామ్దానీ చీరను నేస్తోంది. ఆమె పేరు జనగం కృష్ణవేణి. శ్రీకాకుళం జిల్లా, రాజాం మండలంలోని బొద్దాం గ్రామం నుంచి వచ్చిందామె. ఆమె నేస్తున్న మగ్గం మీద నిలువుదారాల కింద ఒక పేపర్ ఉంది. అందులో ఉన్న డిజైన్ని చూస్తూ రంగుల దారాలను కలుపుతోందామె. మధ్యలో కండెతో అటు నుంచి ఇటు తీస్తూ అడ్డం దారాన్ని జత చేస్తోంది. క్రమంగా డిజైన్ ఒక్కో వరుసనూ పూర్తి చేసుకుంటూ పూర్తి రూపం సంతరించుకుంటోంది. నేత మీద డిజైన్ ఒక లైన్ కూడా పక్కకు పోవడం లేదు. పూల రెక్కలు, ఆకులు, తీగలు అన్నీ... పేపర్ మీద గీసినంత నైపుణ్యంగా నేత లో ఒదిగిపోతూ చీర మీద ప్రత్యక్షమవుతున్నాయి. కృష్ణవేణికి ఈ పనిలో పదిహేనేళ్ల అనుభవం ఉంది. గ్రామాల్లో ఇలాంటి ఎందరో చేనేతకారులున్నారు. ఒకప్పుడు మగ్గం మీద మగవాళ్లు మాత్రమే పని చేసేవాళ్లు. ఇప్పుడిది ఆడవాళ్ల రంగమైంది. తెలంగాణ హస్తకళా ప్రదర్శనల కుడ్యం, ప్రఖ్యాత హ్యాండ్లూమ్ డ్రెస్ డిజైనర్ గౌరంగ్ షా రూపొందించిన ఫ్యూజన్ చీరల ప్రదర్శన ఈ మార్పు వెనుక అనేక ఒడిదొడుకులున్నాయి. అష్టకష్టాలున్నాయి. ఆకలి మరణాలున్నాయి. వాటన్నింటికీ ఎదురీది చేనేత ను నిలబెట్టుకుంటున్నారు మహిళలు. చేనేతరంగం కుదేలవుతూ ఉపాధికి భరోసా కలిగించని పరిస్థితుల్లో కుటుంబాలను పోషించుకోవడానికి మగవాళ్లు ఇతర రంగాలకు మళ్లుతున్నారు. అలాంటి తరుణంలో మహిళలు మగ్గాన్ని చేతబూనారు. ఒకప్పుడు చేనేత సామాజిక వర్గానికే పరిమితమైన నేత పనిలో అందరూ భాగస్వాములవుతున్నారు. కూరగాయలమ్ముకునే వాళ్లు, ఇతర వ్యవసాయ పనులు చేసుకునే మహిళలు కూడా చేనేతలో శిక్షణ తీసుకుని పూర్తిస్థాయి నేతకారులుగా మారినట్లు చెప్పారు కృష్ణవేణి. ఇంటిపట్టున ఉండి ఈ పని చేసుకుంటూ నెలకు పది వేల వరకు సంపాదించుకోగలుగుతున్నట్లు చెప్పారామె. ‘‘ఇద్దరు మహిళలు మూడు నెలలపాటు మగ్గం మీద కష్టపడితే ఇక్కడ మీరు చూస్తున్న ఒక చీర తయారవుతుంది. చీర డిజైనింగ్, రంగుల తయారీ వంటివేవీ కాకుండా మగ్గం మీద పనికి పట్టే సమయం అది. కొన్ని ఇళ్లలో మగవాళ్లు కూడా ఈ పని చేస్తున్నారు. కానీ తక్కువ. మాలాంటి ఎందరో నేసిన అందమైన చీరలను మధ్య దళారులు, హోల్‌సేల్ వ్యాపారులు తీసుకెళ్లి నగరాల్లో అమ్ముకునే వాళ్లు. ఇప్పుడు మాలాంటి వాళ్లకు కూడా ఈ మహా నగరంలో మా ఉత్పత్తులను ప్రదర్శించుకునే వెసులుబాటు వచ్చింది. మా దగ్గర ఉన్న మెటీరియల్‌ను బట్టి రోజుల లెక్కన ఎన్ని రోజులు కావాలంటే అంతవరకే ఇక్కడ స్థలాన్ని అద్దెకు తీసుకోవచ్చు. మా చేనేతలే కాదు, హస్తకళాకృతుల తయారీదారులందరూ దీనిని ఉపయోగించుకోవచ్చు. మనదగ్గర కళలకు కొదవేముంది నిర్మల్ బొమ్మలు, చేర్యాల పెయింటింగులు, పెంబర్తి లోహపు విగ్రహాలు, శిల్పకళాకృతులకు నెలవు. మాలాగ వీటి తయారీలో కష్టపడిన వాళ్లందరూ మా వస్తువులను కొనేవాళ్లను నేరుగా చూస్తాం. వీటిని తయారు చేసింది మేమేనని గర్వంగా చెప్పుకుంటాం’’ అని కృష్ణవేణి సంతోషంగా చెప్పింది. 28 ఏళ్ల శ్రమ ఈ నెల ఎనిమిద తేదీన ప్రారంభమైన సీసీటీ భవనం వెనుక కూడా మహిళల శ్రమ దాగి ఉంది. ఒక కళ కలకాలం మనుగడ సాగించాలంటే... ప్రజాదరణ ఉండాలి. మన దగ్గర కూచిపూడి, భరత నాట్యం, నాటకం, సంగీత కచేరీలకు మంచి వేదికలున్నాయి. కానీ హస్తకళాకృతుల ప్రదర్శనకు మాత్రం ప్రభుత్వం తరఫున వేదికలు లేవు. ఉన్న వేదికలు కూడా ఏ ఆరు నెలలకో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించి సరిపెడుతుంటాయి. ఈ లోటును భర్తీ చేయడమే తమ ఉద్దేశమని తెలియచేశారు సీసీటీ నిర్వహకులు ఉషా సర్వారాయలు, మీనా అప్నేందర్. ‘ఇది కేవలం క్రాఫ్ట్‌మెన్ సంక్షేమం కోసమేనని, ‘సీసీటీ స్పేసెస్’ పేరుతో సీసీటీలో స్థలానికి రోజుల చొప్పున నామమాత్రపు అద్దె చెల్లించి తమ ఉత్పత్తులను ప్రదర్శించుకోవచ్చని చెప్పారు మీనా. ‘‘కళ కాలంతో పాటు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగుతూ ఉండాలి. కళకు, కళాకృతులకు ఆదరణ తగ్గే కొద్దీ కళాకారులు ఇతర ఉపాధి మార్గాల్లోకి మారిపోతుంటారు. ఇదే కొనసాగితే కళ అంతరించిపోతుంది. ఆ ప్రమాదం నుంచి హస్తకళాకృతులను రక్షించడం కోసం ఇరవై ఎనిమిదేళ్లుగా శ్రమించి ఈ భవనాన్ని నిర్మించగలిగాం. ఇది మన సంప్రదాయ కళలను సంరక్షించుకోవడం కోసం స్వచ్ఛందం గా ఏర్పాటు చేసుకున్న సంస్థ. జాతీయ స్థాయిలో ‘క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సీసీఐ రూపొందించిన నియమావళికి అనుగుణంగా హైదరాబాద్‌లో ‘క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ’ స్వతంత్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది’’అని చెప్పారు ఉష, మీనా. సీసీటీ లో తొలి ప్రదర్శన ప్రఖ్యాత డ్రెస్ డిజైనర్ గౌరంగ్‌షా ఏర్పాటు చేశారు. ఈ నెల 13 వరకు కొనసాగే గౌరంగ్ వీవింగ్ మ్యూజియమ్‌లో శ్రీకాకుళం జామ్దానీ, ఔరంగాబాద్ పైథానీ, ఒరిస్సా ఇకత్, కోట నెట్, ధకాయ్ త్రీ హండ్రెడ్ కౌంట్, కశ్మీరీ తాపెస్ట్రీ వస్త్ర విశేషాలున్నాయి. రవివర్మ చిత్రాలను జామ్దాని నేతలో చేసిన ప్రయోగాలున్నాయి. వీటితోపాటు రెండు –మూడు రాష్ట్రాల చేనేత ప్రత్యేకతలను ఒక చీరలో తీసుకురావడం వంటి అనేక ప్రయోగాలకు ప్రతీక ఈ వీవింగ్ మ్యూజియమ్. –వాకా మంజులారెడ్డి -
షో అదిరింది