ఒక చదరపు అంగుళం తివాచీ అల్లాలంటే 197 దారపు ముడులు వేయాలి. ఓపికతో నిండిన ఈ పనిని స్త్రీలే నేర్చుకున్నారు. ‘జైపూర్ రగ్స్’ ఇవాళ 40 వేల మంది నేత కార్మికులతో రగ్గులు తయారు చేయిస్తుంటే వారిలో 30 వేల మంది స్త్రీలే ఉన్నారు. కోడలుగా ఆ ఇంట అడుగుపెట్టిన రుత్వి చౌదరి ఈ సంస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
‘ఇంట అడుగు పెట్టిన కోడలికి ఇంటి సభ్యుల కన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇంటి ఘనతను కోడలు నిలబెట్టగలదా లేదా అందరూ గమనిస్తారు. మా మామగారు ఎన్.కె.చౌదరి మొదలెట్టిన జైపూర్ రగ్స్ సంస్థలో డైరెక్టర్‌గా అడుగు పెడుతున్నప్పుడు అదేం సామాన్యమైన బాధ్యతని అనిపించలేదు. కాని సాధించగలననే అనుకున్నాను’ అంటుంది రుత్వి చౌదరి.
ఆడపడుచులు ఆశ, అర్చనలు అమెరికాలో జైపూర్ రగ్స్ సంస్థను నడుపుతుంటే మన దేశంలో భర్త యోగేష్ చౌదరితో కలిసి సంస్థను ముందుకు తీసుకెళుతోంది రుత్వి చౌదరి. ‘నేను మొదటగా చెప్పాలనుకుంటున్నది ఏమంటే మాది విమెన్ సెంట్రిక్ ఆర్గనైజేషన్. మా సంస్థలో ప్రధాన బాధ్యతలన్నీ స్త్రీలే నిర్వహిస్తారు. మా దగ్గర అల్లే ప్రతి తివాచీ స్త్రీ తన బిడ్డను సింగారించినట్టే ఉంటుంది. చేతి అల్లికతో తయారయ్యే తివాచీలు ఇవి’ అంటుందామె.
► తొమ్మిది మందితో మొదలయ్యి
రుత్వి చౌదరి మామగారు ఎన్.కె.చౌదరి 1978లో కేవలం ఇద్దరు నేతగాళ్లతో, రెండు మగ్గాలతో, ఐదు వేల రూపాయల పెట్టుబడితో జైపూర్ రగ్స్‌ను స్థాపించాడు. చాలా కాలం వరకు ఇది కేవలం విదేశాలకే రగ్గులు పంపేది. 2006లో కొడుకు యోగేష్ చౌదరి పగ్గాలు స్వీకరించాక దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. రుత్వి చౌదరి వచ్చాక సంప్రదాయిక డిజైన్లకు డిజైనర్ల సృజన జత చేయడంతో కొత్త తరాన్ని ఆకట్టుకునేలా ఇవి తయారవుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల్లో 600 గ్రామాల్లో దాదాపు 30 వేల మంది మహిళా నేత కార్మికులు తివాచీలు తయారు చేస్తారు.
రాజస్తాన్‌లాంటి చోట దేశీయ తివాచీ డిజైన్లు అద్భుతంగా ఉంటాయి. కాని చాలామటుకు మూసగా కనిపిస్తాయి. నేను ఈ సాంప్రదాయికతను చెడగొట్టదలుచుకోలేదు. కాని డిజైనర్ల సృజన జత చేయాలనుకున్నాను. హిరేన్ పటేల్, ఆషిష్ షా, శాంతను గార్గ్‌లాంటి వాళ్ల చేత కొత్త డిజైన్లు, పాట్రన్లు ఈ దేశవాళి డిజైన్లకు జత చేశాను. మా మహిళా నేతగత్తెలు వాటిని వెంటనే అందుకున్నారు. ఈ కాలపు యూత్‌ను కూడా ఆకర్షించేలా తయారు చేశారు’ అంది రుత్వి.
► స్త్రీలకు దక్కిన మర్యాద
‘తివాచీ ఇంటిని దగ్గరగా కూడేలా చేస్తుందంటారు పర్షియన్లు. ఆ సంగతి ఏమో కాని వేల మంది స్త్రీలను మేము ఒక కుటుంబంగా చేయగలిగాము. రాజస్థాన్‌లో తివాచీల నేత వల్ల స్త్రీలకు గౌరవం పెరిగింది. అన్నింటి కంటే ముఖ్యం వలసలు ఎంతో తగ్గాయి. భార్య సంపాదిస్తూ ఉండటంతో భర్త కూడా బుద్ధిగా పని చేయడం మొదలెట్టాడు. ఈ అన్ని కారణాల వల్ల మా నేతమ్మలు మా సంస్థను ఎంతో ప్రేమిస్తారు. మేము కూడా వారిని ఎక్కువ విసిగించం. మెటీరియల్ ఇచ్చి సరుకును బదులుగా తీసుకుంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్. వారికి వీలున్నప్పుడే పని చేయొచ్చు. అంతర్గతంగా ఏదైనా సమస్య వస్తే చర్చించుకోవడానికి పరిష్కరించుకోవడానికి ‘తనా–బనా’ అనే సొంత యాప్ ఉంది. అందులో సత్వర పరిష్కారాలు చెబుతాం’ అంటుంది రుత్వి.
► జర్మనీలో అవార్డ్
జైపూర్ రగ్స్ సంస్థ తాను ఇచ్చే డిజైన్లనే కాక మహిళలను వారి మనసుకు నచ్చిన డిజైన్లతో వినూత్నమైన తివాచీలను అల్లే వీలు కల్పిస్తుంది. వీటిని ‘మన్‌చాహా’ తివాచీలు అంటారు. ఇలాంటి తివాచీలకు ఎక్కువ సమయం (కొత్త డిజైన్ ఆలోచించాలి కనుక) పడుతుంది కాబట్టి ఎక్కువ మంది ట్రై చేయరు. కాని ప్రతిభ ఉన్న మహిళలు పాశ్చాత్యులను సైతం అబ్బుర పడేలా డిజైన్లు చేస్తారు. వీటి ధర కూడా ఎక్కువే ఉంటుంది. 2018లో బిమలా దేవి అనే నేతమ్మ అల్లిన తివాచీకి ఫ్రాంక్‌ఫర్ట్‌లో ‘జెర్మన్ డిజైన్ అవార్డ్’ దక్కింది. ‘మన వారి ప్రతిభను అలా ప్రపంచ దేశాలకు చాటుతున్నాం. మా మహిళలు తయారు చేస్తున్న తివాచీలు ఇప్పుడు 80 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి’ అని తెలిపింది రుత్వి.
ఈ సంస్థలో ఒకసారి కొంతమంది స్త్రీలు 30 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పు తివాచీని అల్లారు. దీని కోసం కోటీ 40 లక్షల దారపు ముడులను వేయాల్సి వచ్చింది. ‘మేము తయారు చేసిన వాటిలో అది అత్యంత ఖరీదైనది. దానిని సౌది రాజుకు అమ్మాం’ అని తెలిపింది రుత్వి. ‘దళారులను తొలగించి వారి కమీషన్ కూడా స్త్రీలకే అప్పజెప్పడం వల్ల వారూ మేమూ సంతృప్తిగా ఉన్నాం’ అని ముగించిందామె.
Comments
Please login to add a commentAdd a comment