ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు
మనది పురుషాధిక్య సమాజం. అన్నింటిలోనూ వాళ్లే ముందుంటారు, వాళ్లదే పైచేయి. రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కార్యనిర్వాహణ కావచ్చు, చివరికి ఎంటర్టైన్మెంట్ రంగం కావచ్చు, మహిళ అందులో పావుగానే ఉండేది. కానీ కాలం మారుతుంది. గ్లోబలైజేషన్ ప్రభావం, చదువుతో వచ్చిన చైతన్యం కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, మార్పుకి దోహదపడుతున్నాయి. అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు దూసుకుపోతున్నారు. అన్ని రంగాల్లో తాము కూడా ఏదైనా చేయగలమని నిరూపిస్తున్నారు.
సినిమా రంగంలోనూ కూడా హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలు, హీరో లవర్ పాత్రలకే పరిమితం అనే భావన క్రియేట్ అయ్యింది. కానీ నెమ్మదిగా దానిలోనుంచి బయటపడుతున్నారు. మహిళ పాత్రకు ప్రాధాన్యత పెంచుతున్నారు. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆదరణ పెరగడంతో ఆ దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహిళా సాధికారత నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చి ఆదరణ పొందాయి. ఎంతో కొంత సమాజంపై ఆ ఇంపాక్ట్ ని చూపించాయి. ఇటీవల కాలంలో ఉమెన్ ఎంపావర్‌మెంట్ ప్రధానంగా వచ్చిన సినిమాలు, వాటి ప్రత్యేకతలేంటో ఓ లుక్కేద్దాం.
తెలుగులో.. `అరుంధతి` నుంచి `యశోద` వరకు..
టాలీవుడ్లో అనుష్క, సమంత వంటి కథానాయికలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అంతకు ముందే విజయశాంతి(కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ), జయసుధ(శివరంజని), సౌందర్య(అమ్మోరు)మహిళా ప్రాధాన్యతతో కూడిన సినిమాలు చేశారు మెప్పించారు. మహిళా శక్తిని చాటారు. హీరోయిజంలో పడి ఇండస్ట్రీ కొట్టుకుపోతున్న క్రమంలో ఈ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్లో మహిళా సాధికారతని చెప్పే చిత్రాలు చేసి మెప్పించారు. ఇటీవల కాలంలో అనుష్క శెట్టి ఇందులో ముందు వరుసలో ఉంది. ఆమె ఇప్పటికే `అరుంధతి`, `రుద్రమదేవి`, `భాగమతి`, `సైలెంట్` వంటి చిత్రాలు చేసింది.
`అరుంధతి`తో అనుష్క సంచలనం..
దుష్ట శక్తిని ఎదుర్కొని ప్రజలను, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ మహిళ(జేజమ్మ) చేసిన పోరాటం నేపథ్యంలో `అరుంధతి` సాగుతుంది. ఇందులో అనుష్క పాత్రనే నిర్ణయాత్మక పాత్రగా ఉంటుంది. తనే స్వతహాగా పోరాడుతుంది. ఆ పోరాటంలో తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ విజయం సాధిస్తుంది. అయితే ఈ సినిమాలో చాలా వరకు మూఢ విశ్వాసం ఉన్నప్పటికీ ఓ మహిళా తిరుగుబాటు, పోరాట పటిమ అనే అంశం ఎంతో మంది ఆడవాళ్లని ఇన్స్పైర్ చేస్తుందని చెప్పొచ్చు. కోడి రామకృష్ణ రూపొందించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
ఆ తర్వాత అనుష్క నుంచి `రుద్రమదేవి`, `భాగమతి`, `సైలెంట్` చిత్రాలొచ్చాయి. చరిత్ర నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ `రుద్రమదేవి`సినిమాని రూపొందించారు. ఓ అమ్మాయి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే అబ్బాయిగా పెరిగిన ఓ అమ్మాయి.. చివరికి కష్ట కాలంలో రాజ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ఓ వీరుడిలా, ఓ యోధుడిలా పోరాడే ఇతివృత్తం ఇందులో ప్రధాన అంశం. మహిళల్లోని వీరత్వాన్ని చాటి చెప్పిందీ సినిమా.
కమర్షియల్ ఇది పెద్దగా మెప్పించలేకపోయింది. అలాగే రాజకీయ క్రీడలో బలిపశువుగా మారిన భాగమతి దాన్నుంచి ఎలా బయటపడింది, రాజకీయ నాయకుల కుట్రలను ఎంత తెలివిగా దెబ్బకొట్టిందనే కాన్సెప్ట్ తో వచ్చిన `భాగమతి` సైతం ఆకట్టుకుంది. చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. కానీ అనుష్క నటించిన మరో సినిమా `సైలెంట్` మాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమాల్లోనూ అంతర్లీనంగా ఉమెన్ ఎంపావర్‌మెంట్ అంశాన్ని మనం చూడొచ్చు.
`యశోద`తో సమంత జోరు
కమర్షియల్ హీరోయిన్గా కెరీర్‌ని స్టార్ట్ చేసిన సమంత ఇటీవల `యశోద` సినిమాతో మెప్పించింది. మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మహిళా సాధికారత అనే అంశానికి సరైన అర్థాన్ని చెప్పింది. అద్దెగర్భం(సరోగసి) అనే అంశాన్ని తీసుకుని దర్శకుడు హరి-హరీష్ రూపొందించిన చిత్రమిది. ఇందులో అద్దెగర్భాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని కార్పొరేట్ మెడికల్ సంస్థలు నిర్వహిస్తున్న మాఫియాని, చీకటి కోణాలను వెలికితీసింది. సినిమా పరంగా ఇది ఫిక్షనల్‌గానే తీసినప్పటికీ, ప్రస్తుత సమాజంలోనూ ఇలాంటి అగడాలు జరుగుతున్నాయనేది ఈ సినిమా ద్వారా చెప్పారు.
ఇందులో ఓ సాధారణ అమ్మాయిగా సమంత అద్దెగర్భం పొంది అందులో చీకటి కోణాలను బయటకు తీసిన తీరు, ఈ క్రమంలో వారితో పోరాడిన తీరు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ పాత్ర పొటెన్షియాలిటీని బయటపెడుతుంది. అంతిమంగా మహిళ శక్తిని చాటి చెబుతుంది. ఇది సమాజాన్ని ప్రభావితం చేసింది. దీంతోపాటు `ఓబేబీ` చిత్రంతోనూ సమంత పర్ఫెక్ట్ ఉమెన్ ఎంపావర్‌మెంట్‌ని ఆవిష్కరించింది. ఓ వృద్ధ మహిళ యంగ్ ఏజ్‌లో సాధించలేనివి.. యంగ్‌గా మారినప్పుడు వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ మహిళా సాధికారతకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇందులో సమంతతోపాటు లక్ష్మి నటన వాహ్ అనిపిస్తుంది.
`మహానటి`, `మిస్ ఇండియా`తో కీర్తిసురేష్ సత్తా..
కీర్తిసురేష్ పాన్ ఇండియా ఇమేజ్‌ని, జాతీయ అవార్డుని తీసుకొచ్చిన చిత్రం `మహానటి`. అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారణంగా రూపొందిన బయోపిక్. ఇందులో ఆమె జర్నీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సావిత్రి స్టార్ హీరోలను మించిన స్థాయికి ఎదగడం, ఆ తర్వాత ప్రేమ పేరులో మోసానికి గురికావడం, తర్వాత తన జీవితాన్నే నాశనం చేసుకోవడం ఇందులో కన్‌క్లూజన్. కానీ విశేష అభిమానుల ఆరాధ్య నటిగా కీర్తించబడింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్ కంటే ఫెయిల్యూర్ని, ఆమె చేసిన తప్పులను ఆవిష్కరించిన చిత్రంగా నిలుస్తుందని చెప్పొచ్చు.
మరోవైపు `మిస్` ఇండియా`తో మహిళాసాధికారతకు అసలైన అర్థం చెప్పింది కీర్తిసురేష్. విదేశాల్లో మన ఇండియన్ టీని పరిచయం చేసి, అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసి సక్సెస్‌గా నిలవడమనేది ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనం. కానీ నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయింది. మిస్టరీ థ్రిల్లర్ `పెంగ్విన్` సైతం మహిళలను ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే `గుడ్ లక్ సఖి`చిత్రంలోనూ ఓ పేద గిరిజన అమ్మాయి షూటర్‌గా రాణించేందుకు పడే కష్టం నేపథ్యం ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ సినిమాలు ఆడకపోవడంతో అంతగా ఇంపాక్ట్ ని చూపించలేకపోయాయి.
కోలీవుడ్‌లో.. నయనతార
ఉమెన్ ఎంపావర్‌మెంట్ కి ప్రతిబింబం.. స్టార్ హీరోయిన్ నయనతార మహిళ సాధికారతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఆమె గ్లామర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తుంది. ఆమె మాత్రమే కాదు, ఆమె సినిమాలు సైతం ఇటీవల అలానే ఉంటున్నాయి. నయనతార `డోరా`, `కో కో కోకిల`, `వసంతకాలం`, `అమ్మోరు తల్లి`, `ఓ2`, `మయూరి` వంటి సినిమాలతో విజయాలు అందుకుంది.
ఇందులో `డోరా`లో ఓ ఆత్మతో పోరాటం చేస్తుంది నయన్. అలాగే `కోలమావు కోకిల` చిత్రం.. నిజమైన ఉమెన్ఎంపావర్మెంట్ని చాటి చెబుతుంది. ఇందులో కుటుంబ బాధ్యతని తను మోయాల్సి రావడంతో జాబ్ చేయాల్సి వస్తుంది నయనతారకి. ఆమె కొకైన్ స్మగ్లింగ్ చేసే సంస్థలో పనిచేయాల్సి వస్తుంది. అయితే అందుకో చాలా సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ సవాళ్లని, అడ్డంకులను ఎదుర్కొని దాన్నుంచి బయటపడేందుకు నయనతార చేసిన పోరాటమే ఈ చిత్రం. ఆద్యంతం ఇన్ స్పైరింగ్‌గా ఉంటుంది. నేటి సమాజంలోని సవాళ్లని ప్రతిబింబిస్తుంది.
నయనతార రెండేళ్ల క్రితం నటించిన `నెట్రికన్` సైతం ఉమెన్ ఎంపావర్‌మెంట్ అంశంగానే రూపొందింది. ఓ కళ్లులేని లేడీ పోలీస్ ఆఫీసర్ ఓ సీరియల్ కిల్లర్‌ని పట్టుకునేందుకు చేసే పోరాటమే ఈ చిత్ర కథ. ఇందులో కళ్లు లేకుండా కూడా హంతకులను నయనతార పట్టుకోవడం అనే అంశం మహిళ ఎంత పవర్ఫుల్ అనేది చాటి చెబుతుంది. మగవారిని మించి మహిళ చేయగలదని నిరూపించింది.
అలాగే తన కూతురిని కాపాడుకోవడం కోసం తల్లి పడే స్ట్రగుల్స్ నేపథ్యంలో రూపొందిన `కనెక్ట్`, కొడుక్కి ఆక్సిజన్ అందేలా చేయడంకోసం తల్లి పడే ఆరాటం నేపథ్యంలో వచ్చిన `ఓ2`, అలాగే హర్రర్ మూవీ `ఐరా`, తోపాటు `మాయా` చిత్రాలతోనూ నయనతార ఆకట్టుకుంది. ఆయా చిత్రాల్లో మహిళా శక్తి సామర్థ్యాలను చాటి చెప్పింది. నయనతార నటించిన చాలా సినిమాలు విశేష ఆదరణ పొందడంతోపాటు మంచి కలెక్షన్లని రాబట్టడం విశేషం. ఇందులో చాలా వరకు సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలుండటం విశేషం.
`గార్గి`తో సాయిపల్లవి..
సాయిపల్లవి నటించే సినిమాల్లో కచ్చితంగా మహిళా సాధికారత అనే అంశం ఉండి తీరాల్సిందే. లేదంటే ఆమె నటించదు. హీరో సరసన చేసినా ఆమె పాత్ర బలంగా ఉండాల్సిందే. ఇక తనే మెయిన్ లీడ్‌గా చేసి మెప్పించిన చిత్రం `గార్గి` ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి, మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడుకోవడం కోసం ఓ టీచర్ ఒంటరిగా చేసే పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. మరోవైపు తెలుగులో వచ్చిన `విరాటపర్వం`లోనూ ప్రేమ కోసం ఆమె చేసే పోరాటం సైతం మహిళా శక్తిని చాటుతుందని చెప్పొచ్చు.
కోలీవుడ్‌లో ఐశ్వర్య రాజేష్ సైతం మహిళా శక్తిని చాటే చిత్రాలు చేస్తూ రాణిస్తుంది. ఆమె స్పోర్ట్స్ డ్రామా `కౌసల్య కృష్ణమూర్తి`(కనా) ఉమెన్ ఎంపావర్‌మెంట్‌ని చాటింది. దీంతోపాటు ఇటీవల `డ్రైవర్ జమున`, `ది గ్రేట్ ఇండియన్ కిచెన్`, `రన్ బేబీ రన్`, `సొప్పన సుందరి` వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్ సినిమాల్లోనే మహిళ పాత్ర బలంగా ఉండేలా చూసుకుంటుంది. ఆయా సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉండటం విశేషం. అలాగే అమలాపాల్ నటించిన `ఆడై`(ఆమె) చిత్రం సైతం మహిళా శక్తిని చాటింది.
మలయాళంలో.. `జయ జయ జయ జయ హే`..
మలయాళంలో ఇటీవల కాలంలో మహిళా శక్తిని చాటిన చిత్రంగా `జయ జయ జయ జయ హే`నిలుస్తుంది. విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శణ రాజేంద్రన్, బసిల్ జోసెఫ్ నటించారు. ఇది అత్తారింట్లో అవమానాలు, గృహహింసకు గురైన మహిళ తిరుగుబాటు నేపథ్యంలో రూపొందిన చిత్రం. జయ అనే అమ్మాయికి బాగా చదువుకుని గొప్పగా ఎదగాలని ఉంటుంది, కానీ పేరెంట్స్ చదువు మధ్యలోనే ఆపేసి పెళ్లి చేస్తారు. చదివిస్తానన్న మాటతో పెళ్లి చేసుకున్న భర్త ఆ తర్వాత దాని ఊసేత్తడు.పైగా రోజూ ఇంట్లో వేదింపులు. ఇక లాభం లేదని భావించిన జయ తిరగబడుతుంది. ఫోన్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఇంట్లో ఎవరికి తెలియకుండా భర్తని కొడుతుంది. భర్త మొదట ఈ విషయాన్ని దాచినా తర్వాత బయటపడుతుంది. పెద్దల సమక్షంలో ఇద్దరు క్షమాపణలు చెప్పుకుని మారిపోతారు.
అంతలోనే జయ గర్భం దాల్చేలా చేస్తాడు భర్త. అలా అయితే ఇంట్లో పడి ఉంటుందని వారి ప్లాన్. కానీ ఈ కుట్ర గురించి తెలిసిన జయకి రక్తపోటు పెరిగి అబార్షన్ అవుతుంది. ఆమెపై నిందలేయడంతో ఇంటికి దూరంగా సోదరుడితో కలిసి ఉంటుంది. విడాకుల కోసం కోర్ట్ కి వెళ్లగా జడ్జ్ క్లాస్ పీకడంతో భర్త లో మార్పు వస్తుంది, ఆ తర్వాత జయని ప్రేమగా చూసుకుంటాడు. తన వ్యాపారంలో భాగస్వామిని చేస్తాడు. దీంతో అతని వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా మారుతుంది. కుటుంబం, విలువులు అంటూ అన్నీ భరించిన భార్య.. అత్తింటి ఆగడాలు తట్టుకోలేక ఎదురుతిరిగి తనేంటో నిరూపించింది. తన శక్తిని చాటి చెప్పింది.
మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ సినిమా ఇటీవల కాలంలో మలయాళంలో ఎంతో ప్రభావితం చేసిన చిత్రంగా నిలవడం విశేషం. వీటితోపాటు మాలీవుడ్‌లో మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వచ్చి మెప్పించాయి. అందులో ఒకటి `ఉయరే`. అనేక స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి ఓ సాధారణ అమ్మాయి పైలట్ కావడమనే కథతో ఈ చిత్రం రూపొంది ఆదరణ పొందింది. ఇందులో పార్వతి ప్రధాన పాత్రలో నటించింది. దీంతోపాటు కిడ్నాప్‌కి గురైన ఓ అమ్మాయి పడే వేదన, దాన్నుంచి ఆమె బయటపడేందుకు చేసే పోరాటం నేపథ్యంలో వచ్చిన థ్రిల్లర్ `హెలెన్` మంచి ఆదరణ పొందింది. అలాగే ఇద్దరు అమ్మాయిల జర్నీ నేపథ్యంలో వచ్చిన `రాణి పద్మిని`, అమల అక్కినేని, మంజు వారియర్ నటించిన `కేరాఫ్ సైరా బాను` చిత్రాలు మహిళా శక్తిని చాటే కథాంశాలతో రూపొంది మెప్పించాయి. సమాజంపై ఎంతో కొంత ఇంపాక్ట్ ని చూపించాయి.
బాలీవుడ్లో.. `డర్టీ పిక్చర్` టూ `మేరీకోమ్` టూ `గంగూబాయ్`..
బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల జోరు చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన `డర్టీ పిక్చర్స్` నుంచి మొన్న అలియాభట్ నటించిన `గంగూభాయ్` వరకు చాలా సినిమాలు వచ్చి విశేష ఆదరణ పొందాయి. కమర్షియల్ గానూ సత్తా చాటాయి. బాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాపై ఎంతో ఇంపాక్ట్ ని చూపించాయి. బాలీవుడ్లో అంతకు ముందు కూడా అనేక మహిళశక్తిని చాటే సినిమాలు వచ్చినా, `డర్టీ పిక్చర్స్` మాత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అసలైన ఉమెన్ ఎంపావర్‌మెంట్‌ని చాటి చెప్పింది.
ఇందులో విద్యాబాలన్ తన నటనతో ఇరగదీసి జాతీయ అవార్డుని అందుకుంది. మరోవైపు రియల్ లైఫ్ బాక్సర్ మేరీకోమ్ జీవితం ఆధారంగా వచ్చిన `మేరీకోమ్`తో ప్రియాంక చోప్రా.. మహిళా శక్తిని నిరూపించింది. నిజమైన ఉమెన్ ఎంపావర్‌మెంట్ ని చాటి చెప్పింది. ఇండియన్ సినిమాపైనే బలమైన ప్రభావాన్ని చూపించడంతోపాటు ఎంతో మందిని ప్రభావితం చేసిన సినిమాగా నిలిచింది. మరోవైపు మిడిల్ ఏజ్ మహిళ విదేశాల్లో ఇంగ్లీష్ నేర్చుకుని తను కూడా స్వతంత్రంగా నిలబడటమనే కాన్సెప్ట్ తో వచ్చిన శ్రీదేవి `ఇంగ్లీష్ వింగ్లీష్` మహిళా శక్తికి, ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనం. ఈ సినిమా చాలా మందిని ప్రభావితం చేసింది.
తొలి ఇండియన్ ఎయిర్ పైలట్‌గా..
తప్పిపోయిన భర్తని వెతికే క్రమంలో ఓ గర్భిణి పడే బాధల నేపథ్యంలో వచ్చిన విద్యా బాలన్ `కహాని`, ఓ లేడీ పోలీస్ అధికారి క్రైమ్‌ని అంతం చేసే ఇతివృత్తంతో వచ్చిన రాణి ముఖర్జీ `మార్దాని`, కార్గిల్ వార్(ఇండియా పాక్ వార్) సమయంలో ఆ వార్ ప్రాంతంలో ప్రయాణించిన తొలి ఇండియన్ ఎయిర్ ఫైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా జాన్వీ కపూర్ నటించిన `గుంజన్ సక్సేనా` లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్. మహిళా శక్తిని చాటే చిత్రాలుగా నిలిచాయి. వీటితోపాటు తాప్సీ నటించిన `పింక్` చిత్రం ఇటీవల కాలంలో ఎంతో ప్రభావితం చేసిన సినిమాగా నిలిచింది. అత్యంత చర్చనీయాంశంగానూ మారింది. అలాగే శ్రీదేవి `మామ్`, ఐశ్వర్య రాయ్ `సర్బ్జిత్`, తాప్సీ `తాప్పడ్` వంటి సినిమాలు కూడా మహిళా శక్తి సామర్థ్యాలను ఆవిష్కరించిన చిత్రాలే.
దీపికా పదుకొనె ప్రధాన పాత్రతో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హిస్టారికల్ మూవీ `పద్మావత్`, అలియాభట్ నటించిన `గంగూభాయ్` ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి ప్రతిరూపాలు. కథియవాడి ఏరియాలో వేశ్య వృత్తి చేసుకునే గంగూభాయ్.. లేడీ డాన్‌గా, రాజకీయాలను శాషించే స్థాయికి ఎదగడమనే కథాంశంతో వచ్చిన `గంగూభాయ్` సినిమా విశేషం ఆదరణ పొందింది. ఇలా ఇప్పటికే బాలీవుడ్లో మంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వస్తూ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇన్స్పైర్ చేస్తున్నాయి. మరిన్ని రూపుదిద్దుకుంటున్నాయి.