'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..! | Arroju Dhanalaxmi: Silver Filigree Received National Level Award | Sakshi
Sakshi News home page

'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!

Published Fri, Mar 21 2025 10:16 AM | Last Updated on Fri, Mar 21 2025 10:16 AM

 Arroju Dhanalaxmi: Silver Filigree Received National Level Award

ఒకకళ... కలకాలం మనుగడలో ఉండాలన్నా కళ కళకళలాడాలన్నా రాజపోషణ కావాలి. రాజ్యాలనేలే మహారాజులు లేని ఈ రోజులలో మనసున్న మహారాజులే కళను బతికించాలి.

ఆభరణాలు, లోహపు వస్తువుల తయారీ వృత్తి సాధారణంగా మగవారికే పరిమితం. ఇటీవల చాలామంది మహిళలు ‘ఫలానా వృత్తిలో మహిళలు ఉండరు, అది మగవారి సామ్రాజ్యం’ అనే ‘హద్దు’లను చెరిపేస్తూ తాము ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు. అవార్డులతో గౌరవాలు పొందుతున్నారు. ఫిలిగ్రీ కళలో జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు అర్రోజు ధనలక్ష్మి. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో స్వదేశ్‌ చేతివృత్తుల సంగమ పురస్కారం కూడా ఆమెను వరించింది. ఈ సందర్భంగా ధనలక్ష్మి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

భర్త నేర్పించాడు!
ధనలక్ష్మి సొంతూరు కరీంనగర్‌ జిల్లా నర్సింగాపురం. తండ్రి తపాలా శాఖ ఉద్యోగి. టెన్త్‌ క్లాస్‌ తర్వాత చదువు మాన్పించి పెళ్లి చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులో అత్తగారింట్లో అడుగు పెట్టిన ధనలక్ష్మికి తన భర్త, మామగారు చేస్తున్న కళాత్మకమైన పని మీద ఆసక్తి కలిగింది. ఆమె ఆసక్తిని గమనించి పని నేర్పించారు. ఆమెకి పని త్వరగానే పట్టుపడింది. మూడేళ్ల సాధన తర్వాత ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఒక కుంకుమ భరిణె చేయగలిగారు ధనలక్ష్మి. ఆ తర్వాత రకరకాల కళాకృతుల తయారీ నేర్చుకున్నారు. ఫిలిగ్రీ కళకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఒక థీమ్‌తో ఏదైనా చేయాలనుకున్నారు. 

రెండు తబలాలు, డోలు, సన్నాయి, పన్నీరు బుడ్డీ, అత్తర్‌దాన్, కుంకుమ భరిణె, పసుపు పాత్ర, అక్షింతల గిన్నె ఇవన్నీ పెట్టడానికి ఒక పళ్లెం... ఇలా మ్యారేజ్‌ సెట్‌ తయారు చేశారామె. ఒకటిన్నర కేజీల వెండితో రెండు నెలలు శ్రమ పడితే ఇవన్నీ తయారయ్యాయి. ఆమె పనితనం నచ్చిన రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్‌ శాఖ జాతీయ స్థాయి అవార్డు ఎంపిక కోసం పంపింది. అంతకుముందే 2008లో రాష్ట్రస్థాయి పురస్కారం, 2010లో జాతీయ పురస్కారం అందుకున్నారు.

మార్కెట్‌ బాగుంది!
‘‘హస్త కళలకు ఆదరణ లేని రోజుల్లో మా వృత్తి పెద్దగా ఉపాధినివ్వలేదు. చాలామంది చదువుకుని ఉద్యోగాలకు వెళ్లారు. అలాంటి పరిస్థితిలో కూడా మా కుటుంబం ఈ కళను వదల్లేదు. ఇప్పుడు హస్తకళలకు మార్కెట్‌ బాగుంది. 

మెమెంటోలుగా పీకాక్‌ బొమ్మలు, గణేశ్, మ్యారేజ్‌ సెట్, పర్సులను ఎక్కువగా అడుగుతున్నారు. కొంతమంది తమ ఫొటో ఇచ్చి ఆ రూపాన్ని ఫిలిగ్రీ వర్క్‌లో చేయమని అడుగుతారు. సుమారు 200 గ్రాముల్లో తయారవుతుంది. మేకింగ్‌ చార్జ్‌ గ్రాముకు యాభై రూ΄ాయలు తీసుకుంటాం.

ప్రధాని ప్రశంస!
జీ 20 సదస్సు తర్వాత మా విశ్వకర్మకారుల సమస్యలను తెలియచేయడానికి ప్రధాని మోదీని కలిశాం. అప్పుడు ఆయన మా కళాఖండాలను చూశారు. అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాత్మకమైన వృత్తి ఇది. ఒక్కొక్క 

కుటుంబం ఒక్కో యూనివర్సిటీతో సమానం. కాలేజీల్లో ఈ కోర్సులు పెట్టినా సరే, ఆ స్టూడెంట్స్‌ ప్రాక్టికల్స్‌ కోసం మా దగ్గరకు రావాల్సిందే. అందుకే మా పిల్లలిద్దరూ బీటెక్‌ చేసినా సరే వారికి కూడా ఫిలిగ్రీ వర్క్‌ నేర్పించాం. నాకు, మా వారికి ఈ కళలో నైపుణ్యం మాత్రమే తెలుసు. ఈ కళను విదేశాలకు విస్తరింపచేయడంలో మా పిల్లల చదువు ఉపయోగపడుతుంది. మా పిల్లలే కాదు వారి పిల్లలు కూడా ఇదే కళతో గుర్తింపు ΄÷ందాలని నా ఆకాంక్ష’’ అన్నారు అర్రోజు ధనలక్ష్మి.

జీఐ ‍ట్యాగ్‌ వచ్చింది:
మెసపటోమియా నాగరకత కాలంలో విలసిల్లిన కళ. క్రీ.పూ మూడవ శతాబ్దం నుంచి మనదేశంలోనూ విరాజిల్లింది. తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్‌ ఈ కళకు కేంద్రం. కరీంనగర్‌ పట్టణంతోపాటు పరిసర గ్రామాలలో ఈ కళతో జీవిస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఆధునికత వెల్లువలో ఈ కళ కొంతకాలం కళ తప్పింది కానీ ఇప్పుడు సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా పుంజుకుంటోంది. సిల్వర్‌ ఫిలిగ్రీ క్రాఫ్ట్‌ క్లస్టర్‌కు 2007లో జీఐ (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ వచ్చింది.

భద్రమైన కళ
ఫిలిగ్రీ... గొప్ప పనితనంతో కూడిన ఆభరణాల తయారీ నైపుణ్యం. ఫిలిగ్రీ డిజైన్‌లలో బంగారు, వెండి ఆభరణాలను తయారు చేస్తారు. వెండిలో ఆభరణాలతో΄ాటు కీ చైన్‌లు, ఆభరణాలు భద్రపరుచుకునే బాక్సులు, గిఫ్ట్‌ బాక్సులు, అలంకరణ వస్తువులు, కుంకుమ భరిణెలు, అత్తర్‌దాన్, పాన్‌దాన్, ట్రేలు, పూజ సామగ్రి, ఫ్లవర్‌ వేజ్‌లు, పాత్రలు, వాల్‌ ఫ్రేమ్‌లు, టేబుల్‌ టాప్‌ షో పీస్‌లు, జంతువులు, పక్షుల బొమ్మలు, దేవుని ప్రతిమలు చేస్తారు.  

(చదవండి:

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement