Pratima Raparthi: ధోతీ కట్టు.. మూడు రంగుల్లో ముగ్గు! | Pratima Raparthi Success Story In Dhoti Kattu And Three Colors | Sakshi
Sakshi News home page

Pratima Raparthi: ధోతీ కట్టు.. మూడు రంగుల్లో ముగ్గు!

Published Fri, Aug 9 2024 10:31 AM | Last Updated on Fri, Aug 9 2024 10:31 AM

Pratima Raparthi Success Story In Dhoti Kattu And Three Colors

మై వార్డ్‌రోబ్‌

హస్త కళలపై ఇష్టంతో చిత్రలేఖనం, బ్లాక్‌ప్రింటింగ్‌ నేర్చుకుంది. చదివింది ఆర్కిటెక్చరల్‌ ఇంజినీరింగ్‌. చేనేతకారులకు అండగా ఉండాలని చర్ఖా సంస్థను ప్రారంభిం చింది. మువ్వన్నెల జెండా రంగులు... మధ్యన మన సంస్కృతికి చిహ్నమైన ముగ్గును చిత్రించి, చేనేత వస్త్రంతో కండువాను డిజైన్‌ చేసింది. పేటెంట్‌ హక్కునూ పొందింది. తన హ్యాండ్లూమ్‌ చీరలను ధోతీ కట్టులా డిజైన్‌ చేసి, వాటినే తన రోజువారీ డ్రెస్‌గా మార్చుకుంది. సికింద్రాబాద్‌ మారేడుపల్లిలో ఉంటున్న ప్రతిమ రాపర్తి తన వార్డ్‌రోబ్‌ను సరికొత్తగా మార్చుకుంది.

‘ప్రపంచానికి కాటన్‌ దుస్తులను మన దేశమే పరిచయం చేసింది. మనదైన సంస్కృతిని మనమే  పరిచయం చేసుకోవాలి. అలాగే మనల్ని అందరూ గుర్తించాలి. ఈ ఆలోచనే చేనేతలకు దగ్గరగా ఉండేలా చేసింది.  2018లో ‘చర్ఖా’ పేరుతో చేనేతలకు మద్దతుగా నిలవాలని సంస్థను ప్రారంభించాను.

ట్రై కలర్స్‌లో ముగ్గు..
స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ట్రై కలర్స్‌ డ్రెస్‌ ధరించి వెళ్లడానికి చాలా కష్టపడేదాన్ని. ఆరెంజ్, బ్లూ, గ్రీన్‌ కలర్స్‌ ఉండేలా డ్రెస్సింగ్‌ చేసుకునేదాన్ని. అలా కాకుండా ఆ రోజుకి ఏదైనా ప్రత్యేకమైన యునిఫామ్‌ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. చేనేత క్లాత్‌ను ఎంపిక చేసుకొని, అంచుగా వాటికి నేచురల్‌ కలర్స్‌ని జత చేశాను. మూడు రంగుల మధ్యలో ఉండే ధర్మచక్ర మన అడ్మినిస్ట్రేషన్‌కి, విజ్‌డమ్‌కి ప్రతీక. ధర్మచక్రను మన డ్రెస్సుల్లో వాడకూడదని, దాని బదులుగా ముగ్గు డిజైన్‌ చేశాను. ముగ్గు అనేది మన సంస్కృతికి, స్త్రీల కళా హృదయానికి ప్రతీక.

25 చుక్కలు..
మధ్య చుక్క ఈ డ్రెస్‌ ఎవరు ధరిస్తారో వారికి ప్రతీక. మిగతా 24 చుక్కలు మన పూర్వీకులు, కాలానికి ప్రతీకగా అనుకోవచ్చు. అలాగే, ఆ చుక్కలన్నీ కలుపుతూ వెళితే మన సమాజ వృద్ధికి, రాబోయే తరానికి సూచికగానూ ఉంటాయి. ఈ డిజైన్‌ని కండువా, శారీ, ధోతీ, ఘాఘ్రా చోళీకి తీసుకున్నాను. దీనికి పేటెంట్‌ రైట్‌ కూడా తీసుకున్నాను. ఈ డిజైన్‌ కండువాను ఎవరైనా ధరించవచ్చు.

చేనేత చీరలతో ధోతీ కట్టు..
నా దగ్గర ఎక్కువగా ఉన్న హ్యాండ్లూమ్‌ చీరలని ప్రత్యేక కట్టుగా మార్చుకోవాలనుకున్నాను. సౌకర్యంగా ఉండేలా చీరలను ధోతీగా కన్‌వర్ట్‌ చేసుకున్నాను. సెల్, మనీ, కార్డ్స్‌ పెట్టుకోవడానికి ఈ ధోతీకి పాకెట్స్‌ కూడా ఉంటాయి. పూర్వం రోజుల్లో గోచీకట్టు చీరలను వాడేవారు. ఆ డిజైన్‌ ప్రతిఫలించేలా నాకు నేను కొత్తగా డిజైన్‌ చేసుకున్న డ్రెస్సులివి. టూర్లకు, బయటకు ఎక్కడకు వెళ్లినా ఇలాంటి డ్రెస్‌తోనే వెళతాను. నాకు నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను. వీవర్స్, టైలర్స్, బ్లాక్‌ప్రింట్, హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ వారితో కలిసి వర్క్‌ చేస్తాను. ఇకో ఫ్రెండ్లీ హ్యాండీ క్రాఫ్ట్, టైలరింగ్, పెయింటింగ్‌... వంటివి గృహిణులకు నేర్పిస్తుంటాను’’ అని వివరించారు ప్రతిమ. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement