ఎల్నాజ్ నౌరోజీ.. గ్లామర్, టాలెంట్ రెండూ ఉన్న నటి. ఇరాన్‌లో పుట్టింది. జర్మనీలో పెరిగింది. కెరీర్ వెదుక్కుంటూ భారత్‌కు చేరింది. సినిమా, సిరీస్‌లతో తగిన గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది! జర్మన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఉర్దూ, పంజాబీ, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది.
మోడలింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా ఎల్నాజ్‌కు చిన్నప్పటి నుంచీ ఆసక్తి. అందుకే తన పద్నాలుగో ఏటనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ట్వల్త్ క్లాస్ పాస్ అయ్యాక, ఓ ఏడాది పాటు థియేటర్‌లో ట్రెయినింగ్ తీసుకుంది. పర్షియన్ డాన్స్, హిప్ హాప్, కథక్‌లోనూ శిక్షణ పొందింది.
మోడలింగ్‌లో కొనసాగుతూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మోడలింగ్‌లో భాగంగా ఆసియా, యూరప్ దేశాలు చుట్టొచ్చింది. ఇండియాలో జరిగిన ఎన్నో యాక్టింగ్ వర్క్‌షాప్స్‌కి హాజరైంది. తనకు ఈ దేశం నచ్చడంతో ఇక్కడే స్థిరపడింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ లాంటి బాలీవుడ్ ఉద్దండులతో కలసి ఎన్నో టీవీ కమర్షియల్స్‌లో నటించింది.
‘మాన్ జావో నా’ అనే పాకిస్తానీ మూవీలో, ‘ఖిదో ఖుండీ’ అనే పంజాబీ చిత్రంలో, పంజాబీ మ్యూజిక్ సెన్సేషన్ గురు రంధావా ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. కానీ ఎల్నాజ్‌ను దేశమంతటికీ పరిచయం చేసింది మాత్రం నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రడ్ గేమ్స్’ సిరీసే! తర్వాత జీ5లో స్ట్రీమ్ అయిన ‘అభయ్’సిరీస్‌లోనూ నటించింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తాజా సిరీస్ ‘రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్’ జియోసినిమాలో స్ట్రీమ్ అవుతోంది.
‘జన గణ మన’ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకీ అడుగుపెట్టింది ఎల్నాజ్. ఇరానియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచీ ఆమెకు ఆఫర్లు వచ్చాయి. కానీ అక్కడున్న ఆంక్షల వల్ల వాటిని తిరస్కరించినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
"నాకు కొత్తకొత్త విషయాలను నేర్చుకోవడం చాలా ఇష్టం. అలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకొనే అవకాశం దొరుకుతూనే ఉంది ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో!" – ఎల్నాజ్ నౌరోజీ
ఇవి చదవండి: పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’
Comments
Please login to add a commentAdd a comment