శ్రీసూర్యనారాయణా...
శ్రీసూర్యనారాయణా...
Published Thu, Feb 6 2014 2:52 AM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM
‘దేవుడున్నాడా, లేడా?’ అని అనుమానం వస్తే, తొలిసంజెలో తూర్పుదిక్కు చూడండి. ప్రతిరోజూ ఈ విశ్వాన్ని నియంత్రిస్తూ, రక్షిస్తూ, క్రమం తప్పక ‘ఉదయించే’, ఊహకు కూడా అందనంత అమేయశక్తి శాలి అయిన ఒక అరుణగోళం ఆ సందేహానికి సమాధానం ఇస్తుంది. ఈ చరాచర ప్రాణికోటికీ సాక్షాత్తూ ప్రాణదాత అయిన భువనేశ్వరుడు భాస్కర రూపంలో ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తాడు.
సూర్యుడు లేకపోతే ప్రకాశం లేదు. అది లేకపోతే నీరు కానీ, ఆహార చక్రం గానీ సాధ్యం కావు. అవి లేకపోతే జీవనం లేదు. కనుకనే సూర్యుడు చరాచర ప్రాణికోటికి ప్రాణదాత. సృష్టి స్థితిలయాలకు మూలం.
ప్రాణికోటిని సృష్టించి, పోషించి, పెంచి, నియంత్రించి, రక్షించే అమే యమైన అచింత్యమైన, అనూహ్యమైన, సర్వసమర్థతగల శక్తినే గదా దేవు డంటాం. అందుకే సూర్యుడు, నిజానికి సూర్య భగవానుడు!
ఆదిత్య హృదయం సూర్యుడిని,
ఏషః- బ్రహ్మ చ, విష్ణుశ్చ, శివః, స్కందః ప్రజాపతిః
మహేంద్రః-, ధనదః-, కాలః -, యమః-, సోమః- (హి) అపాంపతిః॥
(ఈయనే బ్రహ్మ, విష్ణువు, శివుడు, కార్తికేయుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలదేవత, దక్షిణ దిక్పాలకుడయిన యమధర్మరాజు, చంద్రుడు, జలాధిపతి అయిన వరుణ దేవుడు) అని కొనియాడటం చాలా వరకు స్వభావోక్తి.
మయూరుడనే మహాకవి ఉన్నాడు. ఈయన హర్షవర్ధన చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు. అంటే క్రీ.శ. ఏడవ శతాబ్దంలో. ఈయనకు ఏ కార ణం చేతో కుష్ఠువ్యాధి సంక్రమించిందట. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా, రోగవిముక్తికి సూర్యుడిని ఆరాధించాలని జనశ్రుతి.
ఆరోగ్యం భాస్కరాత్ - ఇచ్ఛేత్, శ్రీయం-ఇచ్ఛేత-హుతాశనాత్
జ్ఞానం మహేశ్వరాత్ ఇచ్ఛేత్, మోక్షం - ఇచ్ఛేత్ - జనార్దనాత్॥
(ఆరోగ్యం సూర్యుడి నుంచి, సంపద అగ్నిదేవుడి నుంచి, జ్ఞానం శివుడి నుంచీ, మోక్షం జనార్దనుడి నుంచి కోరాలి).
అందువల్ల మయూరుడు సూర్యుడిని నూరు ప్రౌఢమైన శ్లోకాల సూర్య శతకంతో స్తుతించాడు. ఆరోగ్యమూ, దాంతోపాటు సంస్కృత సాహిత్యంలో చిరస్థాయి అయిన కీర్తీ కూడా సంపాదించుకున్నాడు.
సూర్యదేవుడి ఆరాధకులకు పరమ పవిత్రమైన రథసప్తమి సందర్భంగా మయూరుడి సూర్యశతకంలో ఒక్క శ్లోకం అన్నా గుర్తు చేసుకోవటం సంద ర్భోచితంగా ఉంటుంది. దాదాపు నలభై శ్లోకాలలో సూర్యకాంతినీ, ముప్ఫయి శ్లోకాలలో సూర్యుడి రథాన్నీ, పాతిక శ్లోకాలలో సూర్యుడి మహత్మ్యాన్నీ వర్ణించిన మయూరుడు, శతకానికి ముక్తాయింపుగా మనోహరమైన ఈ నూరో శ్లోకం అందించాడు.
‘దేవః కిం? బాంధవః స్యాత్? ప్రియ సుహృస్పిత్, అథ వా-
(ఆ) ,ఆనకచః ఝ - ఆహోస్పిత్, - అర్యః?
రక్షా? చక్షుః ను? దీపంః ? గురుః? - ఉత జనకః? జీవితం? బీజం? - ఓజంః?’
ఏవం నిర్ణీయతే యః కః యివ న; జగతాం సర్వధా, సర్వదా - అ సౌ
సర్వాకారోపకారీ; దిశతు దశ శత-
(అ) భీషుః అభ్యర్థితం వః!
ప్రౌఢంగా ఉన్నా, శ్రద్ధగా చదువుకొంటే అర్థమయ్యే శ్లోకమే.
‘ఈయన దేవుడా? లోకబాంధవుడా? ప్రియమిత్రుడా? లేక ఆచా ర్యుడా? అదీ కాకుంటే (ఆహోస్విత్), ప్రభువా? రక్షకుడా? నేత్రమా? శక్తా?’ - యిలా ఫలానా అని ఎవరు నిర్ణయించబడజాలడో, ఆ సూర్యుడు లోకాలకు అన్నివిధాలా, అన్నివేళలా, అన్ని దేవతల రూపాలలోనూ ఉపకారాలు చేస్తాడు. ఆ సహస్ర కిరణుడు మీరు అభ్యర్థించినవన్నీ ఇచ్చుగాక!’
తథాస్తు!
- ఎం. మారుతిశాస్త్రి
(నేడు రథసప్తమి, సూర్యజయంతి)
Advertisement
Advertisement