మానవ సేవే మాధవ సేవ!
పరమ భక్తుడెప్పుడూ మోక్షాన్ని కోరడు. చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ‘నందబాలా చక్కని భార్య, లెక్కకు మించిన శిష్యగణం, ఆర్థిక సంపద, లౌకిక స్థిరత్వం వంటి భౌతిక సుఖాలేవీ నాకు వద్దు. నేను మళ్లీ మళ్లీ జన్మించవలసి వస్తే మాత్రం అన్ని జన్మలలోనూ నీపై భక్తితో ఉండాలని, అచంచల భక్తితో ఉండాలని ప్రార్థిస్తాను’ అన్నాడు. నిజమైన భక్తుడు ఆయన నామస్మరణ, ఆయన లక్షణాలకు ఆకర్షితుడవుతూ ముక్తిని గురించి పట్టించుకోడు. శ్రీ బిల్వమంగళ ఠాకూరు ఇలా చెప్పారు: ‘స్వామీ! నిన్ను అన్ని ప్రదేశాల్లో పొందగలను. అన్ని వస్తువుల్లోనూ నీవే. అంతటా నీవే. అప్పుడు ఇక ముక్తి నా వాకిలి ముందు నిలుచుని నన్ను సేవించడానికి ఎదురుచూస్తుంది’. కనుక నిజమైన భక్తులకు ముక్తి, ఆధ్యాత్మిక స్వేచ్ఛ, భౌతిక సుఖం ముఖ్యం కావు.
భక్తులు ఐచ్ఛికంగా తమ సేవలందించే వినూత్న పద్ధతి చిలుకూరు ఆలయంలో కొనసాగుతున్నది. ఆలయంలో జరిగే వివిధ సేవలకు భక్తులు స్వచ్ఛందంగా రావలసిందిగా మైకులో మేము కోరుకుంటాము. భాగవత సేవయే భగవంతుని సేవ. స్వచ్ఛందంగా వచ్చే ఈ భక్తులు ఇతర భక్తులకు సహాయపడుతూ వారికి దర్శనం సులభతరం చేస్తారు. నేలను ఊడ్చి శుభ్రపరచడం, ప్రసాదాన్ని పంచడం వగైరా పనులు చేస్తారు.
కొంతకాలం క్రితం జరిగిన ఆసక్తికరమైన ఘటన గురించి చెబుతాను. తన బంధువులతో వచ్చిన ఒక చిన్న అమ్మాయి గోపురం దగ్గర మెట్లపై కూర్చుని కనిపించింది. ఖాళీగా కనిపించిన ఆ అమ్మాయిని చూసి ‘అలా ఖాళీగా ఉండేబదులు ఇక్కడకొచ్చి భక్తులకు పూవులు పంచు’ అని మైకులో చెప్పాను.
ఆమె సంతోషంతో రెండు గంటలపాటు ఆ పనిచేసింది. మూడు నెలల తర్వాత మళ్లీ వచ్చిన ఆ అమ్మాయి నా దగ్గరకొచ్చి తన అనుభవాన్ని చెప్పింది. అప్పట్లో పుణెనుంచి హైదరాబాద్‌లో ఉన్న బంధువుల ఇంటికి వచ్చిందట. వారితోపాటు చిలుకూరు వచ్చిందట. బంధువులు 108 ప్రదక్షిణలు చేస్తుండగా ఈమె పూలు పంచింది. అప్పటికే ఆమె ఎంబీఏ ఫైనల్ పరీక్షలు రాసి కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్లిందట. పుణె వెళ్లినవెంటనే ఆశ్చర్యంగా ఆమెకు ఒక పెద్ద సంస్థనుంచి ఉద్యోగంలో చేరమంటూ లేఖ అందిందట. ‘ఇదంతా ఆ భగవంతుని కృప. మీరు ఆయనకు సేవ చేసే అవకాశం ఇచ్చినందువల్లనే ఇది సాధ్యమైంది. మీకు ధన్యవాదాలు’ అంటూ సంతోషంగా చెప్పింది.
భగవంతుడు ఆ చిన్నారిని ఆవిధంగా ఆశీర్వదించినందుకు నేను కూడా సంతోషించాను. భక్తులు హుండీల్లో వందలకొలదీ రూపాయలు వేస్తుంటారు. దానికి బదులు ఏ ఆలయానికి వెళ్లినప్పు డైనా తమ సేవలు అందించడానికి ప్రయత్నించాలి. గుడికొచ్చే భక్తులకు సహకరించడం, ఊడ్వడం వంటి సేవలు చేయాలి. ఆలయంలో ఊడిస్తే విష్ణులోకంలో నివసించేందుకు అర్హత లభిస్తుంది. భాగవతంలో శ్రీకృష్ణునితో ఉద్ధవుడు ఇలా చెబుతాడు: ‘స్వామీ! నీ సేవలో పడిన భక్తునికి ముక్తి, ఆర్థికాభివృద్ధి, మొదలైన వాటిపై ఆసక్తి ఉండదు. వీటన్నిటివల్లా కలిగే సుఖాలన్ని టినీ నీ సేవలో అతడు సులభంగా పొందగలు గుతాడు. నాది ఒకే ప్రార్థన. ఎన్ని జన్మలైనా నీపై నాకు అచంచల భక్తివిశ్వాసాలు సదా ఉండుగాక’. కనుక మానవసేవే మాధవసేవ అని అందరూ గుర్తుంచుకోవాలి.
- సౌందర్‌రాజన్,
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు