soundher rajan
-
డిజిటల్ మొబైల్ వ్యాన్లను ప్రారంభించిన గవర్నర్ తమిళసై
-
మానవ సేవే మాధవ సేవ!
పరమ భక్తుడెప్పుడూ మోక్షాన్ని కోరడు. చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ‘నందబాలా చక్కని భార్య, లెక్కకు మించిన శిష్యగణం, ఆర్థిక సంపద, లౌకిక స్థిరత్వం వంటి భౌతిక సుఖాలేవీ నాకు వద్దు. నేను మళ్లీ మళ్లీ జన్మించవలసి వస్తే మాత్రం అన్ని జన్మలలోనూ నీపై భక్తితో ఉండాలని, అచంచల భక్తితో ఉండాలని ప్రార్థిస్తాను’ అన్నాడు. నిజమైన భక్తుడు ఆయన నామస్మరణ, ఆయన లక్షణాలకు ఆకర్షితుడవుతూ ముక్తిని గురించి పట్టించుకోడు. శ్రీ బిల్వమంగళ ఠాకూరు ఇలా చెప్పారు: ‘స్వామీ! నిన్ను అన్ని ప్రదేశాల్లో పొందగలను. అన్ని వస్తువుల్లోనూ నీవే. అంతటా నీవే. అప్పుడు ఇక ముక్తి నా వాకిలి ముందు నిలుచుని నన్ను సేవించడానికి ఎదురుచూస్తుంది’. కనుక నిజమైన భక్తులకు ముక్తి, ఆధ్యాత్మిక స్వేచ్ఛ, భౌతిక సుఖం ముఖ్యం కావు. భక్తులు ఐచ్ఛికంగా తమ సేవలందించే వినూత్న పద్ధతి చిలుకూరు ఆలయంలో కొనసాగుతున్నది. ఆలయంలో జరిగే వివిధ సేవలకు భక్తులు స్వచ్ఛందంగా రావలసిందిగా మైకులో మేము కోరుకుంటాము. భాగవత సేవయే భగవంతుని సేవ. స్వచ్ఛందంగా వచ్చే ఈ భక్తులు ఇతర భక్తులకు సహాయపడుతూ వారికి దర్శనం సులభతరం చేస్తారు. నేలను ఊడ్చి శుభ్రపరచడం, ప్రసాదాన్ని పంచడం వగైరా పనులు చేస్తారు. కొంతకాలం క్రితం జరిగిన ఆసక్తికరమైన ఘటన గురించి చెబుతాను. తన బంధువులతో వచ్చిన ఒక చిన్న అమ్మాయి గోపురం దగ్గర మెట్లపై కూర్చుని కనిపించింది. ఖాళీగా కనిపించిన ఆ అమ్మాయిని చూసి ‘అలా ఖాళీగా ఉండేబదులు ఇక్కడకొచ్చి భక్తులకు పూవులు పంచు’ అని మైకులో చెప్పాను. ఆమె సంతోషంతో రెండు గంటలపాటు ఆ పనిచేసింది. మూడు నెలల తర్వాత మళ్లీ వచ్చిన ఆ అమ్మాయి నా దగ్గరకొచ్చి తన అనుభవాన్ని చెప్పింది. అప్పట్లో పుణెనుంచి హైదరాబాద్‌లో ఉన్న బంధువుల ఇంటికి వచ్చిందట. వారితోపాటు చిలుకూరు వచ్చిందట. బంధువులు 108 ప్రదక్షిణలు చేస్తుండగా ఈమె పూలు పంచింది. అప్పటికే ఆమె ఎంబీఏ ఫైనల్ పరీక్షలు రాసి కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్లిందట. పుణె వెళ్లినవెంటనే ఆశ్చర్యంగా ఆమెకు ఒక పెద్ద సంస్థనుంచి ఉద్యోగంలో చేరమంటూ లేఖ అందిందట. ‘ఇదంతా ఆ భగవంతుని కృప. మీరు ఆయనకు సేవ చేసే అవకాశం ఇచ్చినందువల్లనే ఇది సాధ్యమైంది. మీకు ధన్యవాదాలు’ అంటూ సంతోషంగా చెప్పింది. భగవంతుడు ఆ చిన్నారిని ఆవిధంగా ఆశీర్వదించినందుకు నేను కూడా సంతోషించాను. భక్తులు హుండీల్లో వందలకొలదీ రూపాయలు వేస్తుంటారు. దానికి బదులు ఏ ఆలయానికి వెళ్లినప్పు డైనా తమ సేవలు అందించడానికి ప్రయత్నించాలి. గుడికొచ్చే భక్తులకు సహకరించడం, ఊడ్వడం వంటి సేవలు చేయాలి. ఆలయంలో ఊడిస్తే విష్ణులోకంలో నివసించేందుకు అర్హత లభిస్తుంది. భాగవతంలో శ్రీకృష్ణునితో ఉద్ధవుడు ఇలా చెబుతాడు: ‘స్వామీ! నీ సేవలో పడిన భక్తునికి ముక్తి, ఆర్థికాభివృద్ధి, మొదలైన వాటిపై ఆసక్తి ఉండదు. వీటన్నిటివల్లా కలిగే సుఖాలన్ని టినీ నీ సేవలో అతడు సులభంగా పొందగలు గుతాడు. నాది ఒకే ప్రార్థన. ఎన్ని జన్మలైనా నీపై నాకు అచంచల భక్తివిశ్వాసాలు సదా ఉండుగాక’. కనుక మానవసేవే మాధవసేవ అని అందరూ గుర్తుంచుకోవాలి. - సౌందర్‌రాజన్, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు -
దృష్టిని మలిచేది!
ఆడవాళ్లూ, అమ్మాయిలూ అమ్మవారి ప్రతిరూపాలు. ‘యత్రాహం తత్ర పుణ్యాని యత్రాహం తత్ర కేశవః వనితాయాం అహం తస్మాత్ నారీ సర్వ జగన్మయీ’ అంటున్నది అమ్మవారు, ‘లక్ష్మీతంత్రం’లో. అంటే, ‘నేను ఎక్కడ ఉంటే అక్కడ పుణ్యం. నేను ఎక్కడ ఉంటే అక్కడ కేశవుడు (భగవంతుడు) ఉంటారు. నేను ఆడవాళ్లందరిలో ఉన్నాను. కాబట్టి వారిని నా రూపంగా గౌరవించండి!’ అని. ఈ దేశంలో రోజు రోజుకీ ఆడవాళ్ల పట్ల హింస పెరిగిపోతున్నది. మనందరం ఆలోచించే ధోరణి మారాలి. ధనుర్మాసంలో ఒక అమ్మాయి తెల్లవారుజామున తల్లిదండ్రులతో కలిసి చిలుకూరు ఆలయానికి వచ్చింది. ఏడెనిమిదేళ్లుంటాయి. దర్శనం కోసం బారులు తీరిన జనంలో పట్టు లంగా, జాకెట్టు, నిం డుగా గాజులు, జడలో కనకాంబరాలు ధరించి వెళుతోంది- గోదా అమ్మవారిలా. నేను దగ్గరగా పిలిచాను. నవ్వుకుంటూ వచ్చింది. రెండొందల వరకు ఉన్న భక్తులను ఉద్దేశించి మైక్‌లో అడిగాను. ‘‘ఈ అమ్మాయిని చూస్తే గోదాదేవిలా ఉందా? లేదా?!’’ అవునని ఆమోదించారంతా. ఆ అమ్మాయిని అడిగాను, ‘‘ఈ డ్రెస్సు వేసుకోమని ఎవరన్నారు?’’ వాళ్లమ్మను చూపిస్తూ అంది, ఆ అమ్మాయి, ‘‘మా అమ్మ చెప్పిం ది!’’ ఆ అమ్మాయి తల్లికి ముప్పయ్యేళ్లు ఉండవచ్చు. ఈ గుర్తింపుకి కొంచెం బెదిరినా, మన స్సులో ఆనందించినట్టే ఉంది. ఆ చిన్న అమ్మాయిని అభినందించిన విషయాన్ని గమనిస్తూ కొంచెం వెనకాలే ఉన్న జీన్స్ ప్యాంటు ధరించిన అమ్మాయి ‘నేనూ అలా తయారవుతానంటే ఎందుకు వద్దన్నావు?’ అంటూ తన నాన్నగారితో పోట్లాడడం విన్నాను. ఒక విధంగా ఆనందం. కొంచెం బాధ కూడా. దేశంలో విలువలు ఇంకా దిగజారకుండా ఉండాలంటే ఈ వయస్సులో పిల్లలకు జాగ్రత్తగా, అర్ధమయ్యేలా చెప్పాలి. ఒక అమ్మాయి నన్ను అడిగింది, ‘‘మీకు నచ్చిన దుస్తులే వేసుకోవాలా?!’’ అని. ఈ ప్రశ్నకూ నవ్వుకుంటూ సమాధానం ఇచ్చాను. ‘‘జీన్స్‌ప్యాంటు వేసుకున్నా నీవు అమ్మవారే... ఆఫీసుకో, విహారానికో ఎలా వెళ్లినా ఫర్వాలేదు. దేవాలయానికి ఒక దేవతలా తయారయి రామ్మా!’’ అన్నాను. ‘సరే’ అని మళ్లీ వచ్చినపుడు పరికిణీతో వచ్చింది. ఇదంతా గుర్తు చేసింది. జోత్స్నామివ స్త్రియం దృష్ట్వా యస్య చిత్తం ప్రసీదతి నాపధ్యాయతి యత్కించిత్ సమే ప్రియతమః మతః ‘ఎవరైతే లక్షణంగా ఉన్న అమ్మాయినిచూసి నన్నుగుర్తుకు తెచ్చుకుంటారో వారే నాకు ప్రియమైనవారు’ అన్నారు అమ్మవారు. ఎంతముఖ్యమైన సందేశం! మనపిల్లలకు పరిచయం చేయాలి కదా! మత్ తనుః వనితా సాక్షాత్ యోగీ కస్మాన్న పూజయేత్ నకుర్యాత్ వృజినం నార్యాః కువృత్తం నస్మరేత్ స్త్రియాః ‘ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, వికారంగా ఆలోచించడం కూడా సహించను’ అంటున్నారు అమ్మవారు. ఆడవాళ్లను గౌరవించని దేశం ఎంత భయంకరంగా ఉంటుందో, అమ్మవారికి ఆగ్రహం కలిగితే ఎలా ఉంటుందో చెప్పి పెంచారు మా పెద్దలు. మనం కూడా పిల్లలకు అదే చెబుదాం. ఆడవాళ్లుగా ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడేలా స్త్రీలను గౌరవిద్దాం! సౌందర్ రాజన్ (చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు)