tulabharam
-
ధరల మంట.. టమాటాలతో తులాభారం.. కూతురు మొక్కు తీర్చుకున్న వ్యాపారి
సాక్షి, అనాకపల్లిటౌన్: గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ ఆవరణలో ఆదివారం వినూత్నరీతిలో తులాభారం నిర్వహించారు. వ్యాపారవేత్త మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతులు తమ కుమార్తె భవిష్యకు తులాభారం వేస్తామని అమ్మవారికి గతంలో మొక్కుకున్నారు. టమాటాలు, బెల్లందిమ్మలు, పంచదార 51 కిలోల చొప్పున తులాభారం వేసి అమ్మవారికి సమర్పించారు. వీటితోపాటు జీడిపప్పు, కిస్మిస్ కూడా అందజేశారు. ఆలయ ఈవో బండారు ప్రసాద్, ఆలయ అర్చకులు శ్రీను, ఆలయ సిబ్బంది తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. టమాట ధరల మంటతో జనం అల్లాడుతున్న సంగతి తెలిసిందే. టమాటాల తులాభారం అనేసరికి ఈ వార్త వైరల్‌గా మారింది. (చదవండి: టమాట కేజీ రూ. 300?.. ఎందుకంటే..) -
కృష్ణుడు ఇంత బరువు ఉంటాడా!
‘‘వ్రతం ముగిసింది. ఇంకా దానాలు ఉన్నాయి. ముందు పతిదానం కానిద్దామా’’ అన్నది సత్యభామ. ‘‘అలాగే కానివ్వండి. అయితే దంపతులిద్దరు పారిజాతవృక్షం దగ్గరకు రావాలి. మహర్షి! దానగ్రహీతలు తమరు కూడా దయచేయండి’’ అన్నాడు బ్రాహ్మణుడు. ‘‘అవశ్యం’’ అని బయలుదేరాడు నారదుడు. ‘‘కొంచెం జలం అక్షతల్లోకి తీసుకొని దారాదత్తం చేయండి’’ అన్నాడు బ్రాహ్మణుడు. అలాగే చేసింది సత్యభామ. ‘‘భాగ్యమన్న నాదే భాగ్యం... మహాభాగ్యం’’ సంబరపడిపోయాడు నారదుడు. ‘‘అమ్మా! ఇక బ్రాహ్మణులకు దానాలు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారా’’ అడిగాడు బ్రాహ్మణుడు. ‘‘అబ్బా! ఇంకా అదొక ఆలస్యం ఉందా!’’ అన్నది సత్యభామ. ఈలోపు నారదమహర్షి అందుకొని– ‘‘అంత తొందరపడతారేం ఆచార్యా! బ్రాహ్మణులను ఉండనివ్వండి. శ్రీకృష్ణతులాభారం కన్నుల పండుగగా చూసి మరీ వెళతారు’’ అన్నాడు. ‘‘అవును మహర్షి! ముందు తులాభారం తూచి నా పతిని తిరిగి స్వీకరించిన తరువాతే వారిని సత్కరిస్తాను’’ అన్నది సత్యభామ. కృష్ణుడిని త్రాసులో కూర్చోబెట్టారు. ‘‘నళినీ... నా అలంకార మందిరం నుండి ఒక్క వారం నగలు తెచ్చి త్రాసులో ఉంచండి’’ అని చెలికత్తెను ఆదేశించింది సత్యభామ. ‘‘అయ్యయ్యో! ఒక్క వారం నగలే. కృష్ణయ్యబాబు ఇంతేనా!’’ నోరెళ్లబెట్టాడు వసంతయ్య. ‘‘స్వామీ! మీ మిత్రుని నోటికి కొంచెం తాళం వేయమని చెప్పండి’’ అంటూ కోపగించుకుంది సత్యభామ. ‘‘విన్నావా వసంతయ్య’’ అన్నాడు కృష్ణుడు చిరునవ్వుతో. ‘‘విన్నాను... వేశాను’’ అని నోటికి తాళం వేసినట్లుగా నటించాడు వసంతయ్య. ఆ బరువుకు కృష్ణుడు తూగలేదు. ‘‘నళినీ... మిగతా ఆరువారాల నగలు కూడా తెచ్చి వేయండి’’ అని చెలికత్తెని ఆదేశించింది సత్యభామ. అలాగే చేసింది నళిని. కానీ ఏంలాభం! ఈ బరువుకూ కృష్ణుడు తూగలేదు. దీంతో సత్యభామకు సహనం నశించింది. అనుమానం వచ్చింది. ‘‘వసంతయ్య! త్రాసులో ఏమీ మోసం లేదుకదా’’ అని అడిగింది. తనిఖీ చేసి– ‘‘త్రాసులో ఏమీ దోషం లేదమ్మా. మరి ఉన్న మోసమంతా ఎక్కడో’’ అన్నాడు నర్మగర్భంగా. ‘‘అవన్నీ నన్నేం చేయవు. శమంతకమణి ప్రసాదించిన బంగారాన్ని వెయ్యి. వసంతయ్యా... వాళ్లతో పాటు నువ్వు కూడా వెళ్లు’’ అని ఆదేశించింది సత్యభామ. ‘‘గోవిందా గోవిందా’’ అనుకుంటూ పనివాళ్లతో పాటు వెళ్లాడు వసంతయ్య. తెచ్చిన బంగారాన్ని త్రాసులో వేశారు. అయినప్పటికీ కృష్ణుడు తూగలేదు. ‘‘ఏమిటి మాయా! నా స్వామి ఇంత బరువు ఉన్నాడా!’’ ఆశ్చర్యపోయింది సత్యభామ. ‘‘ఆయన బరువు నాకేం తెలుసమ్మా’’ అన్నాడు నారదుడు. ‘‘అయ్యో ఇప్పుడేమీ చేయడం’’ ఆలోచనలో పడింది సత్యభామ. ఇద్దరు బ్రాహ్మణులు మెల్లగా ఇలా గొణుక్కుంటున్నారు... ‘‘మన సంభావన కూడా ఏమీ మిగిలేటట్లు లేదే’’ అన్నారు ఒకరు. ‘‘మన చేతులు, చెవులకు ఉన్న బంగారాన్ని తీసి అక్కడ పెట్టమనకపోతే అదే పదివేలు’’ అన్నారు ఇంకొకరు. ‘‘దేవీ! నీ వద్ద ఉన్న ధనం ఇదేనా? నేను ఈయనకు బానిస కావాల్సిందేనా’’ అన్నాడు కృష్ణుడు. ‘‘నీవు లేనిదే నేను జీవించలేను’’ అన్నాడు. ‘‘ఆందోళనపడకండి స్వామీ! మిమ్మల్ని వదిలి నేను మాత్రం జీవించగలనా! ధైర్యంగా ఉండండి’’ అన్నది సత్యభామ. ‘‘ఏమో ప్రియా! మనకు ఎడబాటు తప్పదేమో’’ అన్నాడు కృష్ణుడు. ‘‘తపస్వీచంద్రమా! ధనేతరాలతో కూడా తూచవచ్చాన్నారు కదా?’’ అడిగింది సత్యభామ. ‘‘సాధ్యమైతే అలాగే ప్రయత్నించండి’’ అన్నాడు నారదుడు. ‘‘నళిని, మల్లిక, వసంతయ్య... మందిరంలో గల విలువైన వస్తువులన్నీ తీసుకురండి’’ అని ఆదేశించింది సత్యభామ. అయినప్పటికీ ఫలితం లేదు!! ‘‘మునీంద్రా! ఇందులో ఏదో తంత్రం ఉంది. నా నాథుడు ఇంత బరువు ఉంటాడని నేను నమ్మలేకుండా ఉన్నాను’’ అన్నది సత్యభామ. ‘‘పిచ్చితల్లీ! గోవర్ధన పర్వతాన్ని కొనగోటిపై నిలిపిన ఈ గోపాలదేవుని బరువును ఇంత అని నిర్ణయించగలవారు ఎవరని!’’ అన్నాడు నారదుడు. ‘‘నా నాథుడు ఇంత బరువు ఉంటాడని ఆనాడే ఎందుకు చెప్పలేదు మహర్షి!’’ అలక స్వరంతో అడిగింది సత్యభామ. ‘‘నారాయణ నారాయణ! నా మీద అపనింద వేయడం భావ్యం కాదు సత్యాదేవి. నా సందేహాన్ని ముందుగానే వెల్లడించాను. మాధవుడు నీ నాథుడనే భ్రమించావుగాని జగన్నాథుడని గ్రహించలేక పోయావు. అది నా అపరాధమేనంటావా!’’ అన్నాడు నారదుడు. ‘‘మహానుభావా! గతాన్ని తరచి లాభం లేదు. అనంతమైన అపరంజిని ప్రసాదించే నా శమంతకమణిని స్వీకరించి నా స్వామిని నాకు ప్రసాదించండి’’ అని నారద మహర్షిని వేడుకుంది సత్యభామ. ‘‘సత్యాదేవి! అహంకారభూయిష్టమైన శమంతకమణికి, ఆశ్రిత చింతామణి అయిన వాసుదేవుణ్ణి వెలబోయమంటావా! అంగడి వీధుల్లో పెట్టి సరిౖయెన వెలకు విక్రయిస్తాను. పిచ్చితలీ!్ల చేతనైతే తుల తూచి తీసుకుపో’’ కరాఖండిగా చెప్పాడు నారదుడు. సమాధానం: శ్రీకృష్ణతులాభారం -
బూరెలతో మొక్కు తీర్చుకున్నారు..
సాక్షి, తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు ఆయనపై తమకున్న అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని చాలా మంది తమ ఇష్ట దైవాలకు మొక్కుకున్నారు. ఆ కోరిక నెరవేరడంతో ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన చిర్ల సత్తిరెడ్డి, పద్మావతి దంపతులు తమ కోరిక నెరవేరడంతో ఆదివారం మొక్కు చెల్లించుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే బూరెలతో తులాభారం వేస్తామని సత్తిరెడ్డి దంపతులు మొక్కుకున్నారు. ఇప్పుడు వారి మొక్కు ఫలించడంతో అనపర్తి వీరుళ్లమగుడి ప్రాంగణంలో ఆదివారం 500 బూరెలతో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి తులభారం వేసి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ అభిమానులు హాజరయ్యారు. -
శంకర్‌పల్లితో వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధం
శంకర్పల్లి : శంకర్‌పల్లితో మాజీ ప్రధాని అటల్‌బిహరీ వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధం ఉంది. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో ఉన్న వాజ్‌పేయిని 1982 మార్చి 13న శంకర్పల్లి పట్టణ వ్యాపారస్తులు శంకర్‌పల్లికి పిలిపించుకొని తులాభార కార్యక్రమం నిర్వహించారు. వాజ్‌పేయ్ రాష్ట్ర పర్యటకు వచ్చినప్పుడు వ్యాపారులు పాండురంగం గుప్తా, మిర్యాల కాశీనాథం, దండు రాజేశ్వర్ గుప్తా, సాత ఆత్మలింగం, సాత విశ్వనాథం, సత్యనారాయణ, ప్రకాశ్‌గుప్తా, మిర్యాల సత్యనారాయణ, మిర్యాల కవిత, సుధా, నళిని, గార్లపాటి వీరేశం తదితరులు బంగారు లక్ష్మణ్ సహకారంతో వాజ్‌పేయిని శంకర్‌పల్లికి తీసుకొచ్చారు. మంచి వ్యక్తిత్వం గల మనిషిని సన్మానించాలని తీసుకువచ్చామని వ్యాపారులు తెలిపారు. శంకర్‌పల్లికి వచ్చిన ఆయనను ఘనంగా ఉరేగించి స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో తులాభారం నిర్వహించారు. రూపాయి నాణేలతో తులాభారం వేయగా వాజ్‌పేయి 82 కేజీలు తుగారు. మొత్తం రూ.10వేలను పార్టీ నిధికి విరాళం ఇచ్చారు. -
శ్రీమఠం పీఠాధిపతి తులాభారం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులకు తులాభారం వేడుక వైభవంగా జరిగింది. శ్రీమఠంలో శనివారం రాత్రి 9గంటలకు బెంగళూరు నగరానికి చెందిన అలసురమ్మ కుటుంబం సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫలాలు, ధాన్యంతో పీఠాధిపతిని తూగించారు. రాయరు అనుగ్రహ సందేశంతో పాటు ఫలపూల మంత్రాక్షితలతో పీఠాధిపతి ఆశీర్వదించారు. వేడుకల్లో ఏఏఓ మాధవశేట్టి, మేనేజరు శ్రీనివాసరావు, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులకు బుధవారం రాత్రి తులాభారం నిర్వహించారు. శ్రీమఠం ప్రాకారంలో ఈశాన్య భాగంలోని తులాభారం కౌంటర్లో పండ్లు, రూపాయి నాణేలతో తక్కెడలో తూచారు. ఆదోనికి చెందిన రాఘవేంద్రరావు దాతృత్వంతో తులాభారం గావించారు. తులాభారం వేడుక భక్తులను కనువిందు చేసింది. అలాగే గురువారం నిర్వహించే అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా వెండి విగ్రహ రథాన్ని కానుకగా రాఘవేంద్రరావు పీఠాధిపతికి అందజేశారు. మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.