నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు,డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేస్తానని చెప్పి... ఆ తర్వాత మాట మార్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ప్రసన్నకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వురు జాతీయ రహదారిపై ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఆ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, డ్వాక్రా మహిళలు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరీకి నిరసన తెలుపుతు నరకాసుర వధ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించాలని బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా గురువారం నుంచి మూడో రోజుల పాటు నరకాసుర వధ రాష్ట్రవ్యాప్తంగా జరుగనుంది. అందులోభాగంగా రెండు రోజైన నేడు రాష్ట్రవ్యాప్తంగా నరకాసుర వధ జరుగుతుంది.