అన్నిటికి మూలం ఆ ప్రాణశక్తి!
ప్రశ్నోపనిషత్
పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోవడానికి పిప్పలాద మహర్షి దగ్గరకు వెళ్లిన ఆరుగురు ఋషులలో రెండవవాడు విదర్భదేశానికి చెందిన భార్గవుడు. ‘‘మహర్షీ! ఎంతమంది దేవతలు ఒక జీవిని పోషిస్తున్నారు? వారిని గురించి ఎలా తెలుసుకోవాలి?వారిలో గొప్పవాడు ఎవరు?’ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం పిప్పలాద మహర్షి ఇలా చెబుతున్నాడు.
‘‘భార్గవా! ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, నేల, వాక్కు, మనస్సు, కన్ను, చెవి అనే తొమ్మిదిమంది దేవతలు జీవిని ఏర్పరచి నడిపిస్తున్నారు. ‘‘మేమే ఒక శరీరంగా ఏర్పడి నడిపిస్తున్నాము’ అని వారు స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన విన్న ప్రాణశక్తి వారి మాటను ఖండించింది.
‘మీరు శరీరాన్ని శక్తిమంతం చేస్తున్నామని భ్రమపడకండి. నన్ను నేను అయిదుభాగాలుగా చేసుకొని పంచప్రాణాలుగా శరీరంలో ఉండి నడిపిస్తున్నా’ అన్న ప్రాణశక్తి మాటను దైవశక్తులు నమ్మలేదు. వారు తన మాట నమ్మడం లేదని గ్రహించిన ప్రాణశక్తి వాళ్లకు జ్ఞానం కలిగించాలని భావించింది. వారిలో నుంచి వెళ్లిపోయింది. ప్రాణశక్తి నిష్ర్కమించడంతో శరీరంలోని ఇంద్రియాలు అన్నీ చలన రహితం అయిపోయాయి. ప్రాణశక్తి తిరిగి రాగానే పనిచేయటం మొదలెట్టాయి. తేనెపట్టులో నుంచి రాణి ఈగ వెళ్లిపోతే అన్ని ఈగలూ వెళ్లిపోతాయి. తిరిగి వస్తే మళ్లీ అన్నీ వస్తాయి. అలాగే ఇంద్రియాలన్నీ ప్రాణశక్తిపై ఆధారపడి ఉన్నాయని వాటికి తెలిసింది. వాక్కు, మనస్సు, కన్ను, చెవి అన్నీ ప్రాణశక్తిని కీర్తించాయి.
భార్గవా! ప్రాణశక్తియే అగ్ని, సూర్యుడు, మేఘుడు, ఇంద్రుడు, వాయువు, భూమి ఏ పదార్థమైనా, సజీవమైనా, చలనరహితమైనా అన్నిటిలోనూ ఉంటుంది. అదే స్థూల, సూక్ష్మరూపాల్లో అశాశ్వతమైన పదార్థాలు అన్నిటిలో శాశ్వతమై, మరణ రహితమై ఉంటుంది. రథచక్రం ఇరుసుతో ఆకులు ( చువ్వలు) అన్నీ కలిసి ఉన్నట్టు ఋక్, యజుస్, సామవేదాలు, యజ్ఞయాగాదులు, పరాక్రమం, బ్రహ్మజ్ఞానం అన్నీ ప్రాణశక్తితోనే ముడిపడి ఉన్నాయి.
ఓ ప్రాణశక్తీ! గర్భంలో సజీవంగా ఉండేది నువ్వే. శిశువుగా జన్మించేదీ నువ్వే. అన్ని జీవుల ఇంద్రియాలలో ఉన్న నీకు జీవులన్నీ ఆహారాన్ని (బలి) సమర్పించుకుంటాయి. నీవు తనలో ఉండబట్టే అగ్నిహోత్రుడు దేవతలకు దూత కాగలుగుతున్నాడు. పితృదేవతలకు స్వధాకారంతో నువ్వే ఆహారాన్ని అందిస్తున్నావు. అధర్వుడు, అంగీరసుడు మొదలైన ఋషుల్లో సత్యాన్వేషణ, పరిశోధన నీవల్లే సాధ్యమవుతున్నాయి.
ఓ ప్రాణమా! నువ్వే దేవతల రాజైన ఇంద్రుడివి. తేజోమయమైన రుద్రుడివి నువ్వే. అంతరిక్షంలో తిరిగే గ్రహరాజు సూర్యుడివీ నువ్వే. అన్నిటినీ కాపాడేది నువ్వే. నువ్వు వర్షంగా భూమి మీద కురిసినప్పుడు పంటలు పండి ఆహారం లభిస్తుందని జీవులందరూ ఆనందంతో ఉంటారు. నువ్వు సర్వదా పవిత్రుడివి. యజ్ఞంలో అగ్నిరూపంలో ఉండి ఆహుతుల్ని స్వీకరించే భోక్తవు నువ్వే. విశ్వానికి అధిపతివి నువ్వే. వాయుదేవుడికి తండ్రివి నువ్వే. మేము ఆహుతులను సమర్పించేది నీకే.
ఓ ప్రాణశక్తీ! వాక్కులో, వినికిడిలో, చూపులో, మనసులో నీ అంశలను ఎప్పుడూ అలాగే ఉంచు. వాటిని శుభప్రదంగా, మంగళకరంగా అలాగే ఉండనివ్వు. వాటినుంచి వెళ్లిపోకు.
అంటూ తొమ్మిది దైవశక్తులూ సత్యదర్శనంతో తమ గర్వాన్నీ, అహంకారాన్నీ, అజ్ఞానాన్నీ పోగొట్టుకుని ప్రాణశక్తిని పొగ డ్తలతో ముంచెత్తాయి. తమను ఎప్పుడూ విడిచి వెళ్లొద్దని ప్రార్థించాయి.
భార్గవా! ముల్లోకాలలో ఉన్నవి అన్నీ ప్రాణశక్తిపైనే ఆధారపడి ఉన్నాయి. పంచభూతాలు, నోరు, కన్ను, చెవి, మనస్సులతో మనిషి ఏర్పడినా వాటిని చైతన్యపరిచేది ప్రాణశక్తి మాత్రమే అని తెలుసుకో. అని అతని ప్రశ్నకు పిప్పలాద మహర్షి సమాధానం చెప్పి, ప్రాణశక్తిని ఇలా ప్రార్థించాడు. ‘మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞా చ విదేహీ న ఇతి’ ఓ ప్రాణశక్తీ! తల్లి బిడ్డలను రక్షించినట్టు మమ్మల్ని కాపాడు. సంపదలను, ప్రజ్ఞను ప్రసాదించు) ఈ ప్రాణం ఎక్కడినుంచి వచ్చింది? అనే ఆశ్వలాయనుడి ప్రశ్నకు పిప్పలాదుడు ఏం సమాధానం చెబుతాడో వచ్చేవారం తెలుసుకుందాం.
- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్