2023 ఏడాదిని స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగించింది. సూచీలు అయిదు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇంధన, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టపోయి 72,240 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 47 పాయింట్లు పతనమై 21,731 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి.
ఒక దశలో సెన్సెక్స్ 328 పాయింట్లు క్షీణించి 72,083 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 21,677 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ టెలికం, ఆటో, సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. టాటా మోటార్స్ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.781 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఆరున్నర శాతం పెరిగి రూ.803 ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది నిఫ్టీ– 50 షేర్లలో రెట్టింపు లాభాలు(111%) పంచిన షేరు ఇదే.
లాభాల్లో ఇన్నోవా క్యాప్‌టాబ్
ఇన్నోవా క్యాప్‌టాబ్ లిస్టింగ్ రోజు ఇన్వెస్టర్లను మెప్పించింది. ఇష్యూ ధర రూ. 448తో పోలిస్తే బీఎస్‌ఈలో 2 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో 22 శాతం(రూ. 99)పైగా జంప్‌చేసి రూ. 547ను అధిగమించింది. చివరికి రూ. 97 లాభపడి రూ. 545 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలోనూ రూ. 452 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ముగిసేసరికి 21 శాతం ఎగసి రూ. 543 సమీపంలో నిలిచింది.
సెకండరీ మార్కెట్ కోసం యూపీఐ
సెకండరీ మార్కెట్‌లో లావాదేవీల కోసం కూడా యూపీఐ సదుపాయాన్ని వచ్చే వారం అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది.
రూ. 82,00,000 కోట్ల సంపద సృష్టి
ఈ ఏడాది సెన్సెక్స్ 19% ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మార్కెట్ విలువ 2022 డిసెంబర్ ఆఖరకు రూ.282.38 లక్షల కోట్లు ఉండగా.., ఈ ఏడాది చివరి ట్రేడింగ్ నాటికి రూ.82 లక్షల కోట్లు పెరిగి రూ.364.05 లక్షల కోట్లకు చేరింది. విలువ పరంగా 4 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచలోనే అతిపెద్ద నాలుగవ నాలుగవ ఈక్విటీ మార్కెట్‌గా దలాల్ స్ట్రీట్ అవతరించింది.
2023లో 58 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.54,000 కోట్లు సమీకరించాయి. లిస్టింగ్ నాటి నుంచి ఇరెడా(220%), సైయంట్ డీఎల్‌ఎం(154%), నెట్‌వెబ్ టెక్నాలజీ(137%), టాటా టెక్నాలజీ(136%), విష్ణు ప్రకాశ్ ఆర్(118%) అత్యధిక లాభాలు పంచాయి.
Comments
Please login to add a commentAdd a comment