2023 సంవత్సరం ముగియబోతోంది. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో ప్రవేశించనుంది. 2023లో భారతీయ రైల్వే అనేక విజయాలను నమోదు చేసుకుంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే భారతీయ రైల్వే 2023లో ఏమి సాధించిందో ఇప్పుడు చూద్దాం.
అత్యంత పొడవైన రైల్వే స్టేషన్..
ప్రపంచంలో భారీ నెట్‌వర్క్ కలిగిన రవాణా సాధనాలలో భారతీయ రైల్వే ఒకటి. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్‌గా భారత్‌లోని ఒక రైల్వే స్టేషన్ రికార్డు సృష్టించింది. గతంలో యూపీలోని గోరఖ్‌పూర్ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్‌గా రికార్డు సృష్టించింది. దీని పొడవు 1,366.4 మీటర్లు. అయితే ఈ సంవత్సరం మార్చి లో హుబ్లీ రైల్వే స్టేషన్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారం కలిగిన స్టేషన్‌గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్లాట్‌ఫారమ్ పొడవు 1,507 మీటర్లు. ఈ ప్లాట్‌ఫారం ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
అమృత్ భారత్ స్టేషన్
అమృత్ భారత్ స్టేషన్ల ద్వారా భారతీయ రైల్వే రూపురేఖలు మారనున్నాయి. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆగస్టు 6న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ.24,470 కోట్లు ఖర్చుకానుంది. ఈ పథకం ద్వారా దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లు మరింత అభివృద్ధి చెందనున్నాయి.
మూడువేల కొత్త రైళ్లు..
పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా భారతీయ రైల్వే రాబోయే నాలుగైదు సంవత్సరాలలో మూడువేల అదనపు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రైల్వే ఏటా ఎనిమిది వందల కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నదని అన్నారు. ప్రయాణికుల పెరుగుదల దృష్ట్యా మరో మూడువేల రైళ్లు అవసరమని అన్నారు. ప్రతి సంవత్సరం 200 నుండి 250 కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. 400 నుండి 450 వందే భారత్ రైళ్లకు ఇవి అదనం అని పేర్కొన్నారు.
లిఫ్ట్‌లు/ఎస్కలేటర్‌లు
సుగమ్య భారత్ అభియాన్‌లో భాగంగా భారతీయ రైల్వేలు రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలో వికలాంగులు, వృద్ధులు, పిల్లలకు ఉపయోగపడేలా లిఫ్టులు, ఎస్కలేటర్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. 2021-22లో 208 లిఫ్టులు, 182 ఎస్కలేటర్లు ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 215 లిఫ్టులు, 184 ఎస్కలేటర్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.
13 లక్షల మందికి పైగా ఉద్యోగులు
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగివుంది. ఉపాధి కల్పన విషయంలో భారతీయ రైల్వే చాలా దేశాల కంటే ముందుంది. భారతీయ రైల్వేలో 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం!
Comments
Please login to add a commentAdd a comment