హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్‌లో 1,123.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ ఏకంగా రూ.17.4 లక్షల కోట్లను తాకింది. ఈ వేగాన్నిబట్టి చూస్తే డిసెంబర్ నెల యూపీఐ లావాదేవీల విలువ రూ.20 లక్షల కోట్ల మార్కును చేరే అవకాశం ఉంది. నూతన సంవత్సర వేడుకల కోసం చేసే చెల్లింపులు ఇందుకు దోహదం చేయనున్నాయి. డిసెంబర్ 1–18 తేదీల మధ్య 703 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.11 లక్షల కోట్లు.
పండుగల సీజన్‌తో..
ఈ ఏడాది జూలై నుంచి సెపె్టంబర్ మధ్య యూపీఐ లావాదేవీల విలువ ప్రతి నెల రూ.15.3–15.8 లక్షల కోట్ల మధ్య నమోదైంది. పండుగల సీజన్ కారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో యూపీఐ లావాదేవీలతోపాటు విలువ కూడా అనూహ్యంగా పెరిగింది. గడిచిన రెండు మాసాల్లోనూ ప్రతి నెల విలువ రూ.17 లక్షల కోట్ల మార్కును తాకింది. 2023 అక్టోబర్‌లో 1,140.8 కోట్ల లావాదేవీలు జరగగా వీటి విలువ రూ.17.1 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2022 డిసెంబర్‌లో రూ.12.8 లక్షల కోట్ల విలువైన 783 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే ఏడాది నవంబర్‌లో రూ.11.9 లక్షల కోట్ల విలువైన 731 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.
తొలి స్థానంలో ఫోన్‌పే..
ప్రస్తుతం భారత్‌లో 516 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. థర్డ్ పార్టీ యాప్, డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తున్న ఫోన్‌పే నవంబర్ నెలలో రూ. 8,54,939 కోట్ల విలువైన 528 కోట్ల లావాదేవీలతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. లావాదేవీల విలువ పరంగా గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, క్రెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్స్, యెస్ బ్యాంక్ యాప్స్, భీమ్, అమెజాన్ పే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ యాప్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
చిన్న మొత్తాలే ఎక్కువ..
నవంబర్‌లో విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీలు ఏకంగా 74.31 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. వీటి విలువ రూ.12.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తుల నుంచి వర్తకులకు జరిగిన లావాదేవీలు 25.69 శాతం వాటాతో రూ.4.46 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఇక పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు 58.62 శాతం వాటాతో 658.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు 41.38 శాతం వాటాతో 464.9 కోట్ల లావాదేవీలు జరిగాయి. పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు చెల్లించిన మొత్తాల్లో రూ.500 లోపు లావాదేవీల సంఖ్య ఏకంగా 83.75 శాతం ఉంది. వ్యక్తుల నుంచి వ్యక్తులకు బదిలీ అయిన మొత్తాల్లో రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా 54.85 శాతం నమోదైంది. దీనినిబట్టి చూస్తే చిన్న మొత్తాలే అధిక సంఖ్యలో చేతులు మారుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment