2023లో పాకిస్తాన్‌లో చోటుచేసుకున్నరాజకీయాలు సినిమా సీన్‌లను తలపించాయి. యాక్షన్, సస్పెన్స్, డ్రామా అన్నీ కనిపించాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు పాక్‌లో చోటుచేసుకున్న రాజకీయ గందరగోళం మున్ముందు కూడా ఇలానే కొనసాగేలా కనిపిస్తోంది. 2023లో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగి రావడం సంచలనాలుగా నిలిచాయి.
పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మాజీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఈ ఏడాది పెను సంచలనం సృష్టించింది. ఈ నేపధ్యంలో ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టారు. విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయి. మే 9న జరిగిన నిరసనను పాక్ ఆర్మీ.. ఇదొక చీకటి అధ్యాయంగా అభివర్ణించింది. కాగా ఇమ్రాన్ ఖాన్ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించారని పాక్ మాజీ ప్రధాని షరీఫ్ ఆరోపించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఆగస్టులో దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. అనంతరం పాక్ ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్‌పై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది.
ప్రస్తుతం పాక్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థానంలో పీటీఐ కొత్త అధ్యక్షునిగా బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్టీలో ఎన్నికలు జరిగాయి. గౌహర్ ఖాన్‌ను స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ఈ పదవికి నామినేట్ చేశారు.
మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్‌కు తిరిగి వచ్చిన దరిమిలా రాజకీయాలు మరింత వేడెక్కాయి. నవాజ్ షరీఫ్ బ్రిటన్‌లో నాలుగేళ్ల పాటు ఉండి, అక్టోబర్ 21న దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు చేరుకున్నారు. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన ఎంట్రీ ఆసక్తికరంగా మారింది.
2024 ఫిబ్రవరిలోపు పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ అధికార పగ్గాలు తాత్కాలిక ప్రధాని చేతుల్లోనే ఉన్నాయి. నవాజ్ షరీఫ్ నాలుగేళ్లు దేశానికి దూరంగా ఉన్నా ఆయన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ బలహీనపడలేదు. నవాజ్ షరీఫ్ లేనప్పటికీ, కుమార్తె మరియం, నవాజ్ సోదరుడు షాబాజ్ షరీఫ్‌లు ఇమ్రాన్ ఖాన్‌ను అధికారం నుండి దించి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు.
అల్-అజీజియా మిల్స్, అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ కోర్టు నవాజ్ షరీఫ్‌ను దోషిగా నిర్ధారించి, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు 2017లో తన జీతం ప్రకటించనందుకు సుప్రీంకోర్టు అతనిపై జీవితకాల అనర్హత వేటు వేసింది. ఈ నేపధ్యంలో షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో ఇమ్రాన్ ఖాన్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్ వైద్య చికిత్స కోసం 2019లో లండన్ వెళ్లేందుకు అనుమతి కోరారు. దీనిపై లాహోర్ హైకోర్టు నాలుగు వారాల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతించింది. అయితే నాలుగు వారాలకు బదులుగా నవాజ్ షరీఫ్ నాలుగు సంవత్సరాల తర్వాత లండన్ నుండి పాకిస్తాన్ తిరిగి వచ్చారు.
ఇది కూడా చదవండి: సన్యసించి, కాశీ వెళ్లిన పెరియార్ నాస్తికుడెలా అయ్యారు?
Comments
Please login to add a commentAdd a comment