![Alliance Government In Pakistan Under Former Pm Shareef - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/12/pakistan.jpg.webp?itok=6W--L_XD)
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమతో కలిసి వచ్చే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ), ముత్తహిదా ఖ్వామీ మూమెంట్(ఎమ్‌క్యూఎమ్)పార్టీలకు అధ్యక్ష, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ పదవులతో పాటు పలు మంత్రి పదవులిచ్చేందుకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్(పీఎంల్-ఎన్)అంగీకరించినట్లు తెలిసింది.
ఈ మేరకు ఆదివారం పీపీపీ, ఎంక్యూఎం పార్టీ నేతలతో నవాజ్ షరీఫ్ జరిపిన చర్చలు విజయవంతమైనట్లు సమాచారం. ప్రధాని పదవిని మాత్రం పీఎంఎల్(ఎన్) తీసుకోనుంది. ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)ను తప్ప మిగిలిన పార్టీలన్నింటినీ ప్రభుత్వ ఏర్పాటుకు నవాజ్‌షరీఫ్ ఆహ్వానించారు.
ఈసారి మిలిటరీ కూడా నవాజ్ షరీఫ్‌కే మద్దతు పలుకుతోందని సమాచారం. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ ఎన్‌కు 76 సీట్లు రాగా బిలావల్ బుట్టో నేతృత్వంలోని పీపీపీకి 54 సీట్లు,ఎంక్యూఎం పార్టీకి 17 సీట్లు వచ్చాయి. ఇక ఇమమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటిఐ పార్టీకి అత్యధికంగా 97 సీట్లు రావడం గమనార్హం. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో సంకీర్ణం అనివార్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment