అలేఖ్య పుంజాల... శాస్త్రీయనాట్య పుంజం. ఆమెది యాభై ఏళ్ల నాట్యానుభవం... ముప్పై ఏళ్ల బోధనానుభవం. ఆమె మువ్వలు... కథక్... ఒడిస్సీ.. భరతనాట్యం... కూచిపూడి... అడుగులను రవళించాయి. రాష్ట్రపతి నుంచి పురస్కారం... ఆమెలో సాక్షాత్తూ అమ్మవారిని చూస్తూ ప్రేక్షకులు చేసిన అభివందనం... ఇప్పుడు సంగీతనాటక అకాడెమీకి వన్నెలద్దే బాధ్యతలు... ఆమె నాట్యముద్రలతో పోటీ పడుతున్నాయి. తెలంగాణ సంగీతనాటక అకాడెమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ’సాక్షి ఫ్యామిలీ’తో ఆమె చెప్పిన సంగతులివి.
‘‘తెలంగాణలో కళారీతులు వందల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రజాబాహుళ్యంలోకి వచ్చాయి. మరుగున పడిన మరెన్నో కళారీతులను అన్వేíÙంచాల్సి ఉంది. నా వంతుగా పరిశోధనను విస్తరించి మరిన్ని కళారీతులను ప్రదర్శన వేదికలకు తీసుకు రావాలనేదే నా లక్ష్యం. సంగీత, నాటక అకాడెమీ కళాకారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. కళాకారులందరినీ ఒక త్రాటి మీదకు తీసుకురావాలి. అసలు తెలంగాణ ఉనికి కళలే.
ఒక ప్రదేశం గుర్తింపు, అక్కడ నివసించే ప్రజల గుర్తింపు కూడా ఆ సంస్కృతి, కళలతో ముడిపడి ఉంటుంది. తరతరాలుగా కళాకారులు గడ్డు పరిస్థితుల్లో కూడా కళను వదిలేవారు కాదు. కళను బతికించడమే తమ పుట్టుక పరమార్థం అన్నట్లుగా కళాసాధన చేశారు. ప్రస్తుతం మన విద్యావిధానంలో కళలకు సముచిత స్థానం కల్పిస్తూ కరిక్యులమ్ రూ΄÷ందాలి. అందుకోసం కళారీతుల గురించి అధ్యయనం చేస్తున్నాను. కళాంశాన్ని పాఠ్యాంశంగా రూ΄÷ందించాలి. పిల్లలు జీవన శాస్త్రీయ విషయాలతోపాటు శాస్త్రీయ కళలను కూడా పాఠాలుగా చదవాలి.
సోషల్ మీడియా దన్ను
మా తరంలో కళాసాధనను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకోవడానికి భయపడే వాళ్లు, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. టెక్నాలజీ విస్తృత మైంది. ఇప్పుడు కళాకారులు సోషల్ మీడియానే పెద్ద కళావేదికగా మలుచుకుంటున్నారు. మా తరంలో కళాకారుల్లో సగానికి పైగా కళాసాధనలోనే జీవితాన్ని వెతుక్కునేవారు. కొంతమంది కళకు దూరమై బతుకుతెరువు బాట పట్టేవారు. ఈ తరంలో నా దృష్టికి వచి్చన విషయాలేమిటంటే... కళాసాధనలో అనతికాలంలోనే గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. సంతృప్తికరమైన గుర్తింపు లేకపోతే కళను వదిలేస్తున్నారు.
కొనసాగేవాళ్లు పదిశాతానికి మించడం లేదు. నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తెలిస్తే గుర్తింపు కూడా అనతికాలంలోనే వస్తుంది. ఈ టెక్నాలజీ యుగంలో వృత్తి–ప్రవృత్తి రెండింటికీ న్యాయం చేసే అవకాశం ఉంది. జీవిక కోసం ఒక ఉద్యోగం చేసుకుంటూ కళాసాధన, కళాప్రదర్శనలు కొనసాగించండి. కళ కోసం చదువును నిర్లక్ష్యం చేయవద్దు. చదువు కోసం కళకు దూరం కావద్దు. రాబోయేతరాల కోసం ఈ వంతెనను నిలబెట్టండి. ఇప్పుడు మన శాస్త్రీయ కళారీతులు విశ్వవ్యాప్తమయ్యాయి. విదేశాల్లో ప్రదర్శనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కళాసాధనలో సవాళ్లు
మహిళలకు ఎదురయ్యే సవాళ్లు దేహాకృతిని కాపాడుకోవడంలోనే. సంగీతసాధనకు దేహాకృతి పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి కాదు, నాట్యకారులకు దేహాకృతితోపాటు శారీరక దారుఢ్యం కూడా అవసరం. ప్రసవం, పిల్లల పెంపకం కోసం ఎక్కువ విరామం తీసుకుంటే కళాసాధనకు దూరమైపోతాం. పిల్లలను పెంచుకుంటూ తమ మీద తాము కూడా శ్రద్ధ తీసుకున్న నాట్యకారులే ఎక్కువ కాలం కొనసాగగలరు. మహిళలకు ఎదురయ్యే పెద్ద చాలెంజ్ ఇదే. కుటుంబం సహకరిస్తే కళకు సంబంధం లేని ఉద్యోగం చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ కూడా కళాసాధన కొనసాగించవచ్చు.’’
లకుమాదేవి గొప్ప వ్యక్తిత్వం గల మహిళ
డాక్టర్ సి. నారాయణరెడ్డిగారితో కలిసి ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన రాసిన ‘కర్పూర వసంతరాయలు’ గేయకావ్యాన్ని విన్నాను. 14వ శతాబ్దంలో కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానంలో నర్తకి లకుమాదేవి. కావ్యంలో లకుమాదేవి పాత్ర అద్భుతంగా ఉంది. ఆ పాత్రను ప్రదర్శించడానికి నారాయణరెడ్డి గారి అనుమతి తీసుకున్నాను. నాకిష్టమైన పాత్రల్లో మండోదరి, దుస్సల, రుద్రమదేవి, వేలు నాచియార్ పాత్రలు ముఖ్యమైనవి. వేలు నాచియార్ తమిళనాడులో ప్రఖ్యాతి చెందిన మహిళా పాలకురాలు, బ్రిటిష్ పాలకులతో పోరాడిన యోధ. ఆ పాత్రను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ‘వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్’ నాట్యరూపకంలో ప్రదర్శించాను. నేను అమ్మవారి పాత్ర ప్రదర్శించినప్పుడు నాలో అమ్మవారిని చూసుకుని ఆశీర్వాదం కోసం సాష్టాంగ ప్రణామం చేసిన ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పది. వారి అభిమానానికి సదా కృతజ్ఞతతో ఉంటాను.
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment