అలరించిన నాట్యోత్సవం
కూచిపూడి, న్యూస్‌లైన్ : తానీషా యువ నాట్యోత్సవ్ ముగింపు వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. కూచిపూడిలోని కళావేదికపై అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులనుంచి నిర్వహిస్తున్న ఈ నాట్యోత్సవాల్లో కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత నాట్యాచార్య పసుమర్తి రత్తయ్యశర్మను ఘనంగా సత్కరించారు. ఆయనకు రూ. 5,116లు నగదు, దుశ్శాలువ, మెమెంటోను అందించారు.
ఈ కార్యక్రమంలో కూచిపూడితో పాటు సోదర నాట్యాలైన భరతనాట్యం, మణిపురి, మోహినీఆట్టం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చెన్నైకు చెందిన భరతనాట్య కళాకారిణిమురుగ శాంకరీ శంకర శ్రీగిరి...అంటూశివతాండవం (హంసనందిని) ను నర్తించింది. తంజావూరులోని బృహదీశ్వరుని స్తుతిస్తూ మనవి చేసుకొనరాదా చక్కని స్వామి (శంకరాభరణం), పట్టాభిరాముని ప్రార్థిస్తూ నే మాటలే మాయనురా (పూర్వకల్యాణి) అంశాలను ప్రదర్శించారు. కలకత్తాకు చెందిన మణిపురి నాట్యకళాకారుడు సుదీప్ ఘోష్ తొలి అంశం బసంత రాసలీలలులో చూపిన హావభావాలు ఆకట్టుకున్నాయి.
శ్రీ కృష్ణునిపై భక్తి భావాలుగల ఈ అంశంలో 108 మంది గోపికలతో మహరాస్, బసంతరాస్ (హోళీ) కుంజరాస్, దిబారాస్, నృత్తరాస్‌లను నర్తించారు. వీటిల్లో ఈ నృత్యాచార్యుడుబసంత్‌రాస్ ప్రత్యేకతను తన ప్రదర్శన ద్వారా చూపారు. రెండవ అంశంలో అభినయ్‌లో రాధాకృష్ణుల శృంగార, ప్రణయ సన్నివేశాలను ప్రదర్శించారు. నర్తకుడు ఆ రెండు పాత్రలు తనే అయి సంచార భావంలో హావభావాలు ప్రదర్శించారు. తర్వాత దశావతారాల్లో శ్రీ కృష్ణుని అవతారానికి బదులు బలరామావతారంతో మిగిలిన తొమ్మిది అవతారాలను ప్రదర్శించారు. బెంగుళూరుకు చెందిన రేఖారాజ్ మోహిని ఆట్టం నృత్యాలను ప్రదర్శించారు. నృత్తానికి, పాదాభినయానికి ప్రాధాన్యత నిచ్చిన చొళ్లుకట్టు (జతిస్వరం)కు ప్రేక్షకుల కరతాళధ్వనులు లభించాయి.
అమీర్ కళ్యాణ్ రాగంలో తాం..దితితాం....అంటూ జతుల తోనే ప్రదర్శించారు. నల, దమయంతుల మధ్యగల ప్రేమ, శృంగారంలకు చెందిన ప్రాణ ప్రియనానానళవై ఓర్టెన్ (శుద్ధసన్యాసి)ను, స్వాతి తిరునాళ్ కీర్తన చెలియ కుంజ నమో....(బృందావన సారంగ) అంటూ రాధాకృష్ణుల ప్రణయాన్ని సంచార భావం ద్వారా వెల్లడించారు. అయ్యప్ప భక్తి గీతం హరివరాసనం-విశ్వమోహనం (మధ్యమావతి)లో ఆమె చూపిన హస్త, భావ, పాద విన్యాసాలు కార్యక్రమానికే తలమానికం. రాజమండ్రికి చెందిన లలితా సింధూరి కూచిపూడి నాట్యాంశాలైన ఆనంత తాండవ మాడే ..శివుడు (రాగమాలిక), శ్రీ గణపతిని సేవింపరారే-త్యాగరాజ కీర్తన, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన జాయతే వనమాలిలను నర్తించారు.
జగ్గయ్యపేటకు చెందిన పండిట్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారీ కురవి సుబ్రహ్మణ్య ప్రసాద్ ప్రదర్శించిన నాట్యాంశాలు సంప్రదాయ రీతిలో సాగాయి. ఈయన నర్తించిన అంశాలకు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి నట్టువాంగం చేయగా గాత్రంపై వీవీ దుర్గాభవాని, మృదంగంపై పసుమర్తి హరనాథశాస్త్రి, వయోలిన్‌పై పాలపర్తి ఆంజనేయులు సహకరించి జీవం పోశారు. వీరికి అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ పర్యవేక్షణలో ముఖ్యఅతిథి జ్ఞాపికలనందించారు.
తొలుత బందరు పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణరావు జ్యోతి ప్రజ్వలనచేశారు. ఎస్‌బీఐ మేనేజర్ రమణారావు, టూరిజం శాఖ మేనేజర్ జి. రామలక్ష్మణరావు, ఇంజినీర్ ఎన్. శివన్నారాయణ, రిటైర్డ్ ఆంధ్యా బ్యాంక్ ఉన్నతాధికారి వెహైచ్ రామకృష్ణ, నాట్యాచార్య చింతా రవిబాలకృష్ణ, వేదాంతం రత్తయ్యశర్మ, సర్పంచి కందుల జయరామ్ పాల్గొన్నారు.