ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేశాం. ఎకో ఫ్రెండ్లీ ఆభరణాలను చూశాం. ప్రకృతి– పర్యావరణాల బంధానికి... ఇకపై... ఎకో ఫ్రెండ్లీ రక్షాబంధనం. బంధాల అల్లిక రాఖీ పండుగకు... అనుబంధాల లతలల్లింది శ్రీలత.
నిజామాబాద్‌కు చెందిన శ్రీలత సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. గృహిణిగా ఇంటి నాలుగ్గోడలే జీవితం అనుకోలేదామె. నాలుగు గోడలను సృజనాత్మకతతో తీర్చిదిద్దారు. శ్రీలత తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఏ గోడను చూసుకున్నా తాను చేసిన ఫ్లవర్ వాజ్, కార్నర్ స్టాండ్, తలమీద కుండలు పేర్చుకుని భవనంలోకి అడుగుపెడుతున్న ఎంబ్రాయిడరీ గొల్లభామ, రాధాకృష్ణుల వాల్ హ్యాంగింగ్‌లు కనిపిస్తాయి. తలెత్తి చూస్తే షాండ్లియర్ కనువిందు చేస్తుంది. బీరువా తెరిస్తే తాను పెయింటింగ్ చేసుకున్న చీరలు. ఏక్‌తార మీటుతున్న భక్త మీరాబాయి ఆమె కుంచెలో ఒదిగిపోయి చీర కొంగులో జాలువారి ఉంది. మెడలో ధరించిన టెర్రకోట ఆభరణంలో రాధాకృష్ణులు వయ్యారాలొలికిస్తుంటారు.
మరోదిక్కున వర్లి జానపద మహిళలు కొలువుదీరిన మినీ టేబుల్ స్టాండ్. డాబా మీదకెళ్తే మొక్కల పచ్చదనం, చుట్టూ ఎర్రటి పిట్టగోడల మీద తెల్లటి చుక్కల ముగ్గులు... ఖాళీ సమయాన్ని ఇంత ఉపయుక్తంగా మార్చుకోవచ్చా... అన్న విస్మయం, అందరికీ రోజుకు ఇరవై నాలుగ్గంటలే కదా ఉంటాయి... ఇన్ని రకాలెలా సాధ్యం అనే ఆశ్చర్యం ఏకకాలంలో కలుగుతాయి. ఇప్పుడామె రాబోతున్న రాఖీ పండుగకు పర్యావరణహితమైన టెర్రకోట రాఖీల తయారీకి సిద్ధమయ్యారు. తన కళాభిరుచిని సాక్షితో పంచుకున్నారు శ్రీలత.
రంగు... బ్రష్ ఉంటే చాలు!
‘‘మా సొంతూరు దోమకొండ. మా చిన్నప్పుడే నిజామాబాద్‌కి వచ్చేశాం. అత్తగారిల్లు బాన్సువాడ, కానీ మావారి వ్యాపారరీత్యా నిజామాబాద్‌లోనే స్థిరపడ్డాం. అత్తగారిల్లు ఉమ్మడి కుటుంబం, ఇంటి బాధ్యతల కోసం పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం ఉండేది. దాంతో ఉద్యోగం మానేయక తప్పలేదు. అయితే నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత ఖాళీ సమయం ఎక్కువగా ఉంటోంది. పిల్లలు ముగ్గురూ స్కూళ్లకు, కాలేజ్‌కి, మా వారు బయటకు వెళ్లిన తర్వాత రోజంతా ఖాళీనే. టీవీ చూస్తూ గడిపేయడం నాకు నచ్చేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్న కళలన్నీ గుర్తుకు వచ్చాయి.
నా క్రియేటివ్ జర్నీ అలా మొదలైంది. వీటన్నింటినీ చేయడానికి ముడిసరుకు కోసం మార్కెట్‌కెళ్లే పనే ఉండదు. ఇంటికి వచ్చిన పెళ్లి పత్రిక, చాక్లెట్ బాక్సులు, కేక్ కట్ చేసిన తర్వాత మిగిలిన అట్టముక్క... దేనినీ వదలను. రంగులు, బ్రష్‌లు కొంటే చాలు ఇక నాకు చేతినిండా పని. నా మెదడు చివరికి ఎంతగా ట్యూన్ అయిపోయిందంటే... ఉపయోగంలో లేని ఏ వస్తువును చూసినా దాంతో ఏమి చేయవచ్చు... అనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఆలోచనలకు ఒక రూపం వచ్చిందంటే పని మొదలు పెట్టడమే. వచ్చిన ఐడియాని మర్చిపోతానేమోనని ఒక్కోసారి ఒకటి పూర్తికాకముందే మరొకటి మొదలు పెడతాను.
మట్టితో రాఖీ!
కోవిడ్ లాక్‌డౌన్ సమయం నాకు బాగా కలిసి వచ్చింది. ఒక్కరోజు కూడా బోరు కొట్టలేదు. అప్పటివరకు ఇంటి అలంకరణ వస్తువులు, ఆభరణాలు మాత్రమే చేసిన నేను రాఖీల తయారీ కూడా మొదలు పెట్టాను. మొక్కల కోసం తెప్పించుకునే ఎర్రమట్టిని రాఖీలు, ఆభరణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకుంటాను. మట్టిని నీటిలో నానబెట్టి కరిగిన తరవాత సన్నని చిల్లులున్న జల్లెడలో వేసి బకెట్‌లోకి వడపోయాలి. రాళ్లు, నలకలు, పుల్లల వంటివి జల్లెడ పైన ఉండిపోతాయి. ఓ గంట సేపటికి బకెట్‌లో నీరు పైకి తేలుతుంది. అడుగుకు చేరిన మట్టిని తీసి ఎండబెట్టాలి. తేమ ఆరిపోతూ ముద్దగా ఉన్నప్పుడు ఆభరణాలు తయారుచేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత కొబ్బరిపీచు, వరిపొట్టులో వేసి కాల్చాలి. ఇటుకలు కాల్చినట్లేనన్నమాట. వేడి చల్లారిన తర్వాత రంగులు వేసి, దారాలు చుడితే రాఖీ రెడీ. లాకెట్‌లు, చెవుల జూకాలు కూడా ఇలాగే చేస్తాను.
మొక్క నాటుతాం!
రాఖీలను మొదట్లో మా ఇంట్లో వరకే చేశాను. ఇప్పుడు నా రాఖీలు కావాలని బంధువులు, స్నేహితులు అడుగుతున్నారు. ఓ వంద రాఖీలు అవసరమవుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఆగస్టు మొదటివారం నుంచే పని మొదలుపెట్టాను. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కలిగినప్పటి నుంచి మట్టి వినాయకుడి బొమ్మనే తెచ్చుకుంటున్నాం. పండుగ తరవాత గణపతిని పూలకుండీలో పెట్టి నీరు పోసి కరిగిన తరవాత మొక్క నాటుతాను. మరో విషయం... మా ఇంట్లో ఏటా పుట్టినరోజులు, పెళ్లిరోజుకు కొత్త మొక్కను నాటుతాం’’ అని చెప్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియచేశారు శ్రీలత.
– వాకామంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment