పేమెంట్ బ్యాంక్‌గా ఇండియా పోస్ట్!
ముంబై: పేమెంట్ బ్యాంక్‌గా ఇండియా పోస్ట్ అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శి (సేవలు) జీఎస్ సంధూ సోమవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సంకేతాన్ని ఇచ్చారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం- రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల సేకరణ, ఇందుకు సంబంధించి చెల్లింపుల (ఒన్ సైడ్ బ్యాంకింగ్) విభాగంలో పోస్టల్ శాఖకు అపార అనుభవం ఉంది. రుణ పంపిణీకి సంబంధించిన విభాగంలో ఈ సంస్థ పనిచేయడం లేదు.
ఈ పరిస్థితుల్లో పేమెంట్ బ్యాంక్‌గా ఇండియా పోస్ట్ మంచి పనితీరును కనబర్చే అవకాశం ఉందని మంత్రిత్వశాఖ భావిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో నెట్‌వర్క్ కలిగి ఉండడం కూడా ఈ విషయంలో ఇండియా పోస్ట్‌కు కలిసి వచ్చే అంశం. పేమెంట్ బ్యాంక్‌గా ఇండియా పోస్ట్ మంచి సేవలు అందిస్తుందన్న అభిప్రాయాన్ని సంధు వ్యక్తం చేశారు. సంధు వెల్లడించిన అభిప్రాయం ప్రకారం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, ఇండియా పోస్ట్- పూర్తి స్థాయి యూనివర్సల్ బ్యాంక్‌కన్నా పేమెంట్ బ్యాంక్‌గా కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోస్టల్ శాఖకు దేశ వ్యాప్తంగా 1.35 లక్షల పోస్టల్ కార్యాలయాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించడానికి పోస్టల్ శాఖ ప్రయత్నం చేసింది. యూనివర్సల్ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసింది. అయితే గత యేడాది ఏప్రిల్ కొత్త బ్యాంకులకు లెసైన్స్ మంజూరు చేసిన సమయంలో ఇండియా పోస్ట్ దరఖాస్తు విషయంపై నిర్ణయం తీసుకునే అంశాన్ని ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ వదిలివేసింది.