కాంగ్రెస్‌ది నీచమైన ఎత్తుగడ: అంబటి రాంబాబు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేకవాదా? లేదా తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకున్నారా? అనేది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు వైఎస్ బీజం వేశారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా మరి కొందరు నేతలు, వైఎస్ కల సాకారం అవుతోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని మండిపడ్డారు. ఇటు రాష్ట్ర నేతలు, అటు అధిష్టావర్గం ప్రతినిధులు నీచమైన రాజకీయ ఎత్తుగడతోనే వైఎస్‌పై ఇలా బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాకుండా వైఎస్ అడ్డంగా ఉన్నారని అసెంబ్లీలోనూ, బయటా కొందరు కాంగ్రెస్ నేతలు, టీఆర్‌ఎస్ నాయకులు గతంలో వ్యాఖ్యలు చేసిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు.
వైఎస్ స్వయంగా తెలంగాణ ఫోరం పేరుతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సోనియాగాంధీకి లేఖ ఇప్పించారని కొందరు చేసిన ఆరోపణలపై ఆయన అభ్యంతరం తెలిపారు. చేవెళ్ల నుంచి వైఎస్ ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించినప్పుడు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలని సాక్షాత్తూ తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్ జి.చిన్నారెడ్డి లేఖ రాశారని, అలాగే తెలంగాణలో పర్యటించేటప్పుడు సమైక్యవాది వైఎస్ గోబ్యాక్ అనే నినాదాలు కూడా చేశారని, అందుకు వైఎస్ వెంట పాదయాత్రలో ఉన్న తానే సాక్షినని వివరించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నందువల్లనే ఇప్పుడు వైఎస్‌ను తెరపైకి తెచ్చి ఆయనే తెలంగాణ ఏర్పాటుకు కారణమవుతున్నారని చెబుతూ దాన్ని జగన్‌పై రుద్దాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
వైఎస్ ఉన్నప్పుడు 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేసి ఆ తరువాత తెలంగాణ అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్నట్లు చేర్చారని, టీఆర్‌ఎస్‌తో పొత్తుకు కూడా అప్పట్లో దీన్నే ప్రాతిపదికగా తీసుకున్నారని అప్పటి ఆ పార్టీ నేత నరేంద్ర కూడా దీనిపై సంతకం చేశారని అంబటి వెల్లడించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానవర్గం రెండో ఎస్సార్సీని వేయడంగానీ, విసృ్తత స్థాయిలో సంప్రదింపులు జరపడం గానీ చేయలేదన్నారు. ఇన్నాళ్లు అధిష్టానం ఏమీ చేయకుండా తీరా ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం విభజించి ఆ నె పాన్ని వైఎస్‌పై తోసే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తమ పదవులకు రాజీనామాలు చేసిన తర్వాత దిగ్విజయ్‌సింగ్... తెలంగాణ ఏర్పాటు వైఎస్ కల అని చెప్పడం తెలుగు ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడమేనన్నారు.
బాబూ.. అధికార దాహ యాత్ర చేస్తారా?
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, గద్దె దించి ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు ఇప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని ఇది చూసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదని అంబటి అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో యాత్ర ప్రారంభానికి ముందుగా బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం వెలువడ్డాక తెలుగు జాతి రెండుగా చీలినా ఐక్యంగా ఉండాలని బాబు చెప్పారనీ, అదెలా సాధ్యమో చెప్పాలని ప్రశ్నించారు. కొత్త రాజధాని కట్టుకోవడానికి నాలుగైదు లక్షల కోట్లు కావాలని బాబు అడిగి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని మంట కలిపింది చాలక.. ఇంకా ఎందుకు యాత్ర చేయాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖనే అధిష్టానం కత్తిగా చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందన్నారు. విభజన విషయంలో బాబు చేసిన చర్చలుగానీ, ఇచ్చిన లేఖలను గానీ చూస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఆయనేననేది తేటతెల్లమవుతుందని అంబటి దుయ్యబట్టారు.
అలాంటి వ్యక్తి చేసేది అధికార దాహ యాత్రే అవుతుంది తప్ప ఆత్మగౌరవ యాత్ర ఎంత మాత్రం కాజాలదని అన్నారు. వైఎస్ తెలంగాణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా.. రాష్ట్రంలోని ముస్లిం సోదరుల భయాందోళనలను నివృత్తి చేయాలని, అలాగే అందరిదీ అయిన హైదరాబాద్ భవితవ్యాన్ని తేల్చాలని, ఇందులోని భాగస్వాములందరితో చర్చించి వారిని ఒప్పించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పారని అంబటి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా నాడు వైఎస్ చెప్పిన దాన్నే తెలంగాణ విషయంలో తన విధానంగా చేసుకుందని, హోంమంత్రి షిండేకు ఇచ్చిన లేఖలో ఇదే చెప్పామని ఆయన వివరించారు. ఇలాంటి అడ్డగోలు విభజనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందే తప్ప తెలంగాణకు ప్రతికూలం కాదన్నారు.