విభజనకు సీమాంధ్రులు సోదరభావంతో సహకరించాలి: కోదండరాం
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, విభజనకు సీమాంధ్రులు సోదరభావంతో సహకరించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సోమవారం తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం సదస్సులో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే వరకు తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నిరసన ప్రదర్శనలు సాగిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులపై ఒత్తిడి తెచ్చేలా తమ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సీమాంధ్ర నేతలు ప్రసంగించడం సరికాదన్నారు. తెలంగాణ వస్తే పాలస్తీనా పాకిస్థాన్ అవుతుందని అంటున్న నేతలు ఇక అటువంటి పాలస్తీనా పాకిస్తాన్‌లో వారు ఎలా కలిసుంటారని ప్రశ్నించారు.
ఆంధ్రావారు ఆఖరి సమయంలో తెలంగాణ బిల్లుపై సంతకం పెట్టే రాష్ట్రపతి పెన్ను లో కూడా ఇంకు లేకుండా చేస్తారని ఎద్దేవా చేశారు. పదేళ్లుగా తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమాలతో ఈ ప్రాంత ప్రజలే నష్టపోలేదని, రెండు ప్రాంతాలవారూ నష్టపోయారన్నారు. సీమాంధ్ర ఉద్యమాల వల్ల ఒరిగేదేమీ లేదని, అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారమే జరపాలని, లేకుంటే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మాట్లాడుతూ సమ్మెకు పిలుపునిచ్చిన వారి పేర్ల జాబితాను తయారు చేస్తామని, వారంతా ఆంధ్రాకు వెళ్లిపోయి పని చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 610ని వీరంతా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. సదస్సుకు తెలంగాణ విశ్రాంతఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షత వహించగా టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, తెలంగాణ నేతలు శ్రీధర్ దేశ్‌పాండే, రూపని లోకనాథం, లక్ష్మయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.