రెండు రాష్ట్రాలకు బడ్జెట్ విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో ఇక విభజన ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్రం జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న విషయం తెలిసిందే. అయితే ఆ తేదీ తర్వాత ఏ రాష్ట్రమూ ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా ఉండేందుకు గాను విభజనకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆదేశాలను ప్రస్తుత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే జారీ చేస్తోంది. జూన్ నుంచి ఆగస్టు వరకు గల ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఇరు రాష్ట్రాలకు విభజించిన ఆర్థిక శాఖ.. తెలంగాణ ప్రభుత్వానికి మూడు నెలల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)ను కూడా జారీ చేయనుంది. బడ్జెట్ విభజనలో భాగంగా ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద తెలంగాణ ప్రభుత్వానికి జూన్ నుంచి ఆగస్టు వరకు రూ.26 వేల కోట్లు కేటారుుంచింది.
అదే కాలానికి సీమాంధ్రకు రూ.36 వేల కోట్ల బడ్జెట్‌ను కేటారుుంచింది. ఇందుకు సంబంధించిన ఫైలును గవర్నర్ నరసింహన్ ఆమోదానికి పంపింది. గవర్నర్ ఆమోదం లభించగానే తెలంగాణ ప్రభుత్వానికి నిధుల వ్యయానికి అనుమతిస్తూ బీఆర్వోను ఆర్థిక శాఖ జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ విధంగా బీఆర్వో జారీ చేయకపోతే జూన్ 2వ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమస్య ఎదుర్కొంటుందనే ముందు చూపుతో ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు సీమాంధ్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి ఆగస్టు వరకు తమకు కేటాయించిన బడ్జెట్ నిధులను వ్యయం చేసుకునేందుకు అవకాశం చిక్కనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ కారణంగా వచ్చే సెప్టెంబర్ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమల్లో ఉండనుంది. ఇక సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం, సీమాంధ్ర ప్రభుత్వాలు వేర్వేరుగా పూర్తి స్థాయి బడ్జెట్‌లను తమ తమ రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంటాయి.