సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మావోయిస్టు, ఉగ్రవాద వ్యతిరేక విభాగాలైన గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లనూ సీమాంధ్ర, తెలంగాణలకు పంచాలని ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నారు. పోలీసుశాఖలో శక్తిమంతమైన అత్యాధునిక ఆయుధాలు ఈ రెండింటి వద్దే ఉండటంతో వాటితో సహా ప్రతి తూటానూ 58.37 : 41.63 నిష్పత్తిలో పంచడానికి జాబితా సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు సిబ్బంది పంపకాల మార్గదర్శకాలనూ పూర్తి చేశారు.
- దట్టమైన అటవీ ప్రాంతాల్లో, గెరిల్లా ఆపరేషన్స్ చేసే గ్రేహౌండ్స్, అర్బన్ వార్ ఫేర్‌లో ఆరితేరిన ఆక్టోపస్‌లకు భిన్న తరహాలకు చెందిన అత్యుత్తమ ఆయుధాలను ప్రభుత్వం సమకూర్చింది. ఏకే-47 మొదలు ఇన్సాస్ వరకు, చిమ్మ చీకట్లలో సైతం శత్రువు కదలికల్ని సుదూరం నుంచే గుర్తించేందుకు తయారైన నైట్ విజన్ బైనాక్యులర్స్, గాగుల్స్, కార్నర్ షాట్ రైఫిల్స్, ఎంపీ-5 వంటివి ఈ విభాగాల అమ్ములపొదిలో ఉన్నాయి.
- గ్రేహౌండ్స్‌లో ఉన్న 2,600 మంది, ఆక్టోపస్‌లోని దాదాపు 400 మంది సిబ్బందినీ విభజించేందుకు చేపట్టిన కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. సీమాంధ్రలో విభాగాల హెడ్‌క్వార్టర్స్‌ను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపైనా అధికారులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.
- అవసరాన్నిబట్టి ఆక్టోపస్ బలగాలను రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా తరలించాల్సిన అవసరం ఉండటంతో దీని ప్రధానకేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ నగర శివార్లలో పోలీసు విభాగానికి ఉన్న 70 ఎకరాల స్థలాన్ని దీనికోసం పరిశీలిస్తున్నారు.
- సీమాంధ్రకు సంబంధించి మావోయిస్టుల సమస్య ప్రస్తుతం తూర్పు గోదావరి, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోనే ఉండటంతో గ్రేహౌండ్స్ విభాగానికి ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న కార్యాలయాన్నే హెడ్-క్వార్టర్స్‌గా చేయాలని నిర్ణయించారు.
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న అధికారుల్లో కొందరు నిష్ణాతులు ఉన్నారు. తాజా విభజన నిర్ణయంతో స్థానికత ఇతర అంశాల ఆధారంగా వీరు రెండు రాష్ట్రాలకూ అవసరమైన స్థాయిలో పంపిణీ జరగకపోతే భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు అలాంటి అధికారుల్ని సాంకేతికంగా ఏ రాష్ట్రానికి కేటాయించినా నిర్ణీతకాలంవరకు డెప్యుటేషన్‌పై కొనసాగిస్తూ లోటును భర్తీ చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన తుది కసరత్తుల్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రతి తూటా పంచాల్సిందే!
Published Tue, Apr 22 2014 5:56 AM | Last Updated on Fri, Nov 9 2018 5:41 PM
Advertisement