సీఎం, డిప్యూటీ సీఎం గైర్హాజరు.. మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గైర్హాజరయ్యారు. హైదరాబాద్‌లోనే ఉన్నా వారు కార్యక్రమానికి రాకపోవడంపై అధ్యాపక సంఘాలు మండిపడ్డాయి. సమాజానికి ఉత్తమ పౌరులను అందించే గురువులను సన్మానించే కార్యక్రమానికే రాకుంటే ఇక వారు ఉండీ ఎందుకని తీవ్రంగా విమర్శించారు. ఇది రాష్ట్రంలోని 4 లక్షల మంది ఉపాధ్యాయులను అవమానపరచడమేనని ఉపాధ్యాయ సంఘాలైన పీఆర్‌టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నేత లు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, భుజంగరావు, కత్తి నర్సింహారెడ్డి, నర్సిరెడ్డి, వెంకటేశ్వర్‌రావు, మధుసూదన్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం వస్తారని నిరీక్షించి ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమాన్ని 12 గంటల వరకు ఆపాల్సి వచ్చిందన్నారు. కనీసం సందేశం పంపించే తీరిక కూడా లేదా? అని నిలదీశారు.
వివిధ ప్రాంతాల నుంచి ఉదయమే రవీంద్రభారతికి చేరుకున్న ఉత ్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు పడిగాపులు కాశారు. చివరకు కొంత ఆలస్యంగానైనా మంత్రి పార్థసారధి వచ్చాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి పంపిన సందేశాలను సభలో చదివి వినిపించారు. కనీసం ఆ సందేశాలను కూడా పంపించలేని దుస్థితిలో మన ప్రభుత్వ పెద్దలు ఉండటం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు దుయ్యబట్టారు. ప్రత్యేక అతిథిగా మర్రి శశిధర్‌రెడ్డి, సభాధ్యక్షుడిగా దామోదర రాజనర్సింహ, గౌరవ అతిథులుగా మంత్రులు గీతారెడ్డి, పార్థసారథి, శైలజానాథ్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆహ్వానంలో పేర్కొన్నారు. అయితే మంత్రి పార్థసారథి, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు మినహా మిగతా వారెవరూ కార్యక్రమంలో పాల్గొనకపోవటం గమనార్హం.
గురువులకు అవమానం!
Published Fri, Sep 6 2013 1:11 AM | Last Updated on Thu, Sep 27 2018 8:33 PM
Advertisement