విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డులో 35 ఏళ్ల కిందట అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన హనుమంతు యర్రప్ప దొర(హెచ్‌వై దొర) దక్షిణ ప్రాంతం విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) సీఎండీ స్థాయికి చేరుకున్నారు. తన సొంత ప్రాంతమైన ఈపీడీసీఎల్ సీఎండీ పోస్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించిన దొరకు అనూహ్య రీతిలో ఎస్‌పీడీసీఎల్ కుర్చీ దక్కింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోని తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ఆ సంస్థలో నేటినుంచి దొర పాలన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బోరుభద్రగ్రామానికి చెందిన ఆయన 1978 డిసెంబరులో సోంపేట ఎపీఎస్‌ఈబీలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగప్రస్థ్ధానం ప్రారంభించారు.
1991లో ఏడీఈగా, 2001లో డీఈగా, 2006లో ఎస్‌ఈగా, 2007 అక్టోబరులో ఈపీడీసీఎల్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొంది 2008 ఏప్రిల్ 30వ తేదీ ఇదే హోదాలో ఉద్యోగ విరమణ చేశారు. ఆ మరుసటి రోజే ఈపీడీసీఎల్ ప్రాజెక్టుల డెరైక్టర్‌గా నియమితులయ్యారు. 2009 నవంబరు 5వ తేదీ ఇదే సంస్థలో ఆపరేషన్ డెరైక్టర్‌గా నియమితులై ఇప్పటి దాకా పనిచేస్తున్నారు. ఈపీడీసీఎల్ సీఎండీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అహ్మద్‌నదీం బదిలీ కావడంతో ఈ పోస్టు కోసం దొర తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన్ను ఎలాగైనా ఈపీడీసీఎల్ సీఎండీగా చేయాలని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నాయకుడు సీఎం వద్ద పట్టుబట్టారు.
అయితే ఈ ప్రయత్నం ఫలించకపోగా ఐఏఎస్ అధికారి శేషగిరి బాబును ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించారు. దీంతో దొరకు ఈసారి కూడా నిరాశే ఎదురయిందనే ప్రచారం జరిగింది. విద్యుత్ పంపిణీ సంస్థలో ఫైనాన్స్ మినహా ఇతర అన్ని విభాగాలకు డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవం, సహచర ఉద్యోగులతో స్నేహ సంబంధాలు కొనసాగించే నైజం, విద్యుత్ సరఫరా నష్టాల తగ్గింపులో లోతైన పరిజ్ఞానం ఉండటంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత జిల్లాలో తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌పీడీసీఎల్‌కు దొరను సీఎండీగా చేశారు.
దీంతో పాటు ఆయనకు ఒకే సారి మూడేళ్ల పదవీ కాలాన్ని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. విద్యుత్ పంపిణీ సంస్థల చరిత్రలో ఏ సీఎండీకి ఈ రకమైన నియామకం జరిగిన దాఖలాలు లేవు. శనివారం మధ్యాహ్నం ఆయన్ను ఎస్‌పీడీసీఎల్ సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, రాత్రి 7-30 గంటలకు ఇన్‌చార్జ్ సీఎండీ రమేష్ నుంచి హైదరాబాదులోనే ఆయన నూతన బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. సోమవారం నుంచి ఎస్‌పీడీసీఎల్‌లో దొర పాలన ప్రారంభం కానుంది.
వినియోగదారుల సత్వరసేవకే ప్రాధాన్యం: దొర
ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో వినియోగదారులకు సత్వర సేవలు అందించడమే తన తొలి ప్రాధాన్యమని సీఎండీ హెచ్‌వై దొర చెప్పారు. ఆదివారం సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ డిస్కం పరిధిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా పనిచేస్తానన్నారు. ఎస్‌పీడీసీఎల్ ఒకప్పుడు ఆదాయంలో ఈపీడీసీఎల్‌తో పోటీ పడిన సంస్థ అనీ, కొన్నేళ్లుగా పరిస్థితిలో కొంత ఇబ్బంది తలెత్తిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తన మీద నమ్మకం ఉంచి అప్పగించిన పెద్ద బాధ్యతను సవాల్‌గా తీసుకుని డిస్కంను ఉత్తమ సంస్థగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషిచేస్తానని ఆయన చెప్పారు.